బ్రిటిష్ హయాం నుంచే అన్య మతస్థులు ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవాలంటే, డిక్లరేషన్ ఫారం పై సంతకాలు చేసే సంప్రదాయం ఉంది.తిరుమల వేంకటేశ్వరస్వామిపై తమకు నమ్మకం, గౌరవం ఉందని,దర్శనానికి అనుమతించాలని అందులో సంతకం చేయాలి. ఇదే తిరుమల డిక్లరేషన్ అంటే.1933 ముందు వరకు మహంతులు దీన్ని పర్యవేక్షించారు.
“తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాలు ప్రజా దేవాలయాలు. హిందువులు తమ హక్కు కొద్దీ ఈ ఆలయాలను సందర్శించవచ్చు. అదే సమయంలో ఇతర మతస్తులు కూడా ఈ ఆలయాల్లోకి రావొచ్చు. దానిపై ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, టీటీడీ ఆలయాల్లోకి ప్రవేశించే ముందు అన్యమతస్తులు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలి” అని ఆ ఫారం మొదట్లోనే పేర్కొన్నారు.
ఆ తర్వాత అన్యమతస్తులు డిక్లరేషన్ ఫారంలో తమ పేరు, చిరునామా రాయాలి. ఏ ఆలయం అయితే ఆ ఆలయంలోని దేవుడి పేరు రాసి, ఆ దేవుడిపై తమకు నమ్మకం ఉందని, ఆ భగవంతుడి ఆరాధనను గౌరవిస్తామని అంగీకరిస్తూ సంతకం చేయాలి. ఈ ఫారంపై సాక్షులు కూడా సంతకం చేయాల్సి ఉంటుంది.
ఇక ఈ డిక్లరేషన్ ఫారంను ఆలయ పేష్కార్ (ప్రత్యేక అధికారి)కి, లేక ఆలయంలో విధుల్లో ఉన్న ఇన్చార్జి అధికారికి అందజేయాలి. ఆ అధికారి ఆమోద ముద్ర వేసిన అనంతరం అందరు భక్తుల్లాగానే, అన్యమతస్తులు కూడా ఆలయంలోకి ప్రవేశించవచ్చు.