-ధాన్యం ఇవ్వబోమన్నది మీరే…. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని సంతకం చేసింది మీరే…
-ఢిల్లీకి వచ్చి కేంద్రాన్ని ఎందుకు బదనాం చేస్తున్నారు?
-మీ బాధ్యత నుండి ఎందుకు తప్పుకుంటున్నారు?
– దేశంలోని ఇతర రాష్ట్రాలకు రాని సమస్య ఇక్కడేందుకు వస్తోంది?
– తెలంగాణ రైతులకు చేయూత అందించేందుకు కేందం ఎప్పుడూ సిద్ధమే
– రాష్ట్ర మంత్రులకు క్లాస్ పీకిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్….
కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు అంశంపై ఎందుకు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.
‘‘ తెలంగాణ రైతుల బాగోగులు మీకు అక్కర్లేదా? రాజకీయ లబ్ది కోసం ఎందుకీ డ్రామాలు చేస్తున్నారు? మొన్న మీటింగ్ లో ఎఫ్ సీఐకి ధాన్యం ఇవ్వబోమని చెప్పింది మీరే… ఇకపై బాయిల్డ్ రైస్ పంపబోమని లేఖ రాసింది మీరే.. ధాన్యం సేకరించాల్సిన బాధ్యత మీదే కదా… మీరు మీ బాధ్యత నుండి తప్పుకుని ఢిల్లీకి వచ్చి కేంద్రాన్ని ఎందుకు బదనాం చేస్తున్నరు?’’అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
వడ్లను కేంద్రమే సేకరించాలంటూ రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు ఈరోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్బంగా కేంద్రమే వడ్లను కొనుగోలు చేయాలంటూ వినతి పత్రం ఇవ్వబోగా పీయూష్ స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణలోనే ఎందుకొస్తుందని నిలదీశారు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం సేకరించి కేంద్రానికి అప్పగిస్తోందని, అందుకయ్యే వ్యయం మొత్తం పూర్తిగా కేంద్రమే చెల్లిస్తోంది కదా అని పేర్కొన్నారు. రైతులను ఆదుకునేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని… గతంలో మాదిరిగానే యాసంగిలోనూ తెలంగాణ నుండి బియ్యం సేకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రైతులను ఇబ్బంది పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం ఏ మాత్రం సరికాదని హితవు పలికారు.