-‘‘సమైక్యత’’ ఉత్సవాల పేరుతో కుళ్లిన ఆహార ప్యాకెట్లను పంచుతారా?
-ఇదో డూప్ సర్కార్…. బతుకమ్మ చీరెలు సహా కేసీఆర్ చేసేవన్నీ నాసిరకం, డూప్ పనులే
-కంటోన్మెంట్ భూములివ్వలేదనడం పచ్చి అబద్దం
-పరేడ్, జింఖానా, బైసన్ పోలో భూములివ్వడానికి కేంద్రం 2018లోనే సిద్దమైంది
-ఇదిగో ఆధారం……ఈ అంశంపై చర్చకు సిద్దమా?
-టీఆర్ఎస్ సర్కార్ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఫైర్…
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల పేరుతో ప్రభుత్వ నిధులను కొల్లగొట్టేందుకు ప్రజల ప్రాణాలతో టీఆర్ఎస్ నేతలు చెలగాటమాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో వజ్రోత్సవాల పేరుతో కమీషన్ల కోసం కుళ్లిపోయిన భోజన ప్యాకెట్లును అందించి చిన్నారులతో సహా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడటం సిగ్గు చేటన్నారు.
మధ్యాహ్న భోజన శిబిరం వద్ద తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ స్పందిస్తూ కుళ్లిపోయిన వేలాది ఆహార ప్యాకెట్లను పిల్లలు వదిలేయడం… వాటిని చెత్త కుప్పలో పడేస్తున్న ద్రుశ్యాలు బయటపడిన అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్రంగా స్పందించారు. ‘‘ఇదో డూప్ ప్రభుత్వం. పైసలు దండుకోవడం కోసం అన్నీ నాసిరకం, డూప్ పనులే చేస్తోంది. బతుకమ్మ చీరలు నాసిరకమే. నియోజకవర్గాల్లో జరిగే పనులన్నీ నాసిరకమే. మొత్తంగా ఈ ప్రభుత్వమే డూప్ ప్రభుత్వం’’అని దుయ్యబట్టారు.
కంటోన్మెంట్ లో అభివ్రుద్ది చేయరు. రోడ్లు వేయరు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించరు. ఇండ్లు ఇవ్వరు.. తాగడానికి మంచినీళ్లు కూడా సరఫరా చేయరు.. చివరకు కమీషన్ల కోసం కుళ్లిన భోజనాన్ని పంపి ఇక్కడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కేసీఆర్ తీరును చూస్తుంటే ఆయన ద్రుష్టిలో కంటోన్మెంట్ ప్రజలను అసలు మనుషులుగా కూడా గుర్తించడం లేన్నట్లుంది’’అని మండిపడ్డారు.
‘‘‘బీజేపీ ఈ సమస్యలన్నీ ప్రస్తావిస్తుంటే… కంటోన్మెంట్ లో రోడ్లు, ఫ్లైఓవర్లు వేద్దామన్నా, సచివాలయం నిర్మాణానికి కేంద్రం భూములు ఇవ్వడం లేదని కేసీఆర్, ట్విట్టర్ టిల్లు దుష్ప్రచారం చేస్తున్నరు. ఈ సందర్భంగా వాళ్లకు నేను సవాల్ చేస్తున్నా.. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బైసన్ పోలో, పరేడ్ గ్రౌండ్, జింఖాన్ గ్రౌండ్ భూములివ్వడానికి 4 ఏళ్ల క్రితమే కేంద్రం సిద్ధమైంది. 2018 ఆగస్టు 5న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీని కలిసిన అనంతరం కేంద్రం విడుదల చేసిన నోట్ ఇది (నోట్ ను చూపిస్తూ..). ఈ అంశంపై దమ్ముంటే చర్చకు సిద్ధమా?‘‘అని బండి సంజయ్ సవాల్ విసిరారు.
ఆ భూములిస్తే ఏటా కంటోన్మెంట్ బోర్డు ప్రజలకు 30 కోట్ల రూపాయల సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందనే భయంతో కేసీఆర్ ప్రభుత్వం వెనక్కు తగ్గి కేంద్రంపై అభాండాలు వేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివ్రుద్ది చేయాలని, లేనిపక్షంలో ప్రజలు తగిన బుద్ది చెబుతారని కేసీఆర్ ను హెచ్చరించారు.