Suryaa.co.in

Telangana

పంటలు ఎండుతుంటే సిగ్గులేకుండా చూస్తూ కూర్చూంటారా ?

– రైతులంటే కాంగ్రెస్ నాయకులకు ఎందుకింత నిర్లక్ష్యం ?
– ఉద్యమాలతో కాంగ్రెస్ కళ్లు తెరిపించాలి
– ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తున్నా ఎన్డీఎస్ఏ ఎక్కడా ?
– మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాదయాత్రకు ఎమ్మెల్సీ కవిత సంఘీభావం

హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి కుట్ర చేశాయని, ఆ రెండు ప్రాజెక్టులు కలిసి మేడిగడ్డపై దుష్ప్రచారం చేశారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ముఖ్యంగా బ్యారేజీకి పర్రెపట్టిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం, ఆ మరుసటి నాడే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్డీఎస్ఏ ను పంపించడం వంటివి జరిగాయని గుర్తు చేశారు. మరి ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తున్నా… ఎన్డీఎస్ఏ వాళ్లు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న కుట్రను ప్రజలు గమనించాలని కోరారు.

కాళేశ్వరం నీళ్లు వినియోగించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పోలాలను ఎండబెడుతూ రైతుల నోట్లల్లో మట్టికొడుతున్నదని ధ్వజమెత్తారు. లక్షాలది ఎకరాలు ఎండిపోతున్నా సిగ్గులేకుండా కాంగ్రెస్ నాయకులు చూస్తూ కూర్చున్నారు తప్పా రైతుల కష్టాలను చూడడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ కళ్లు తెరిపించడానికి రామగుండం నుంచి జెండా ఎత్తుకొని కోరుకంటి చందర్ వచ్చారని తెలిపారు.

గతంలో కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పై పిడికిలి ఎత్తి పోరాటం చేస్తేనే పోలాలకు నీళ్లు వస్తాయని అన్నారు. నీటి కోసం పాదయాత్ర చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కృషి అభినందనీయమన్నారు. “ఒకప్పుడు తలాపున పారేటీ గోదారి… మన బతుకులు ఎడాది అని పాడుకున్న తెలంగాణను కేసీఆర్ గోదావరి నీటితో చెరువును నింపి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. ఎండకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకేలా గోదావరి నీటిని కేసీఆర్ గారు సద్వినియోగం చేశారు” అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వల్లనే గోదావరి జలాలను ప్రతీ ఇంటికి చేరాయని స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE