జగన్ రెడ్డి ని విచారించడానికి తాడేపల్లి ప్యాలెస్ తలుపు తట్టే ధైర్యం సీఐడీ చీఫ్ సంజయ్ కు ఉందా?
– ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ నాశనానికి పన్నిన కుట్రలో అసలు దోషి జగన్ రెడ్డే
– ఎలాంటి అర్హతలు లేని గౌరీశంకర్ ను ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించి, అతనిద్వారా ముఖ్యమంత్రి తన కుట్రలు అమలు చేశాడు
– నేడు వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నాం
• ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పై బురద జల్లడంకోసం.. లేని అవినీతిని సృష్టించి, దానిలో చంద్రబాబుని ఇరికించడం కోసం 524 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ను కత్తిరింపచేసిన జగన్ రెడ్డి..దానికి కొనసాగింపుగా తన కుట్రల్ని అమలు చేయడం కోసం అనర్హుడైన గౌరీశంకర్ ను ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించాడు
• ముఖ్యమంత్రి హోదాలో తానే స్వయంగా సంతకం పెట్టిమరీ జగన్ రెడ్డి.. గౌరీశంకర్ ను ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో నియమించాడు
• అతని ద్వారా తాను అనుకున్నకుట్రల్ని అమలు చేసి.. చంద్రబాబు, లోకేశ్ లపై బురదజల్లుతున్నాడు.
• కానీ ప్రభుత్వమే స్వయంగా నిన్న హైకోర్టులో ఫైబర్ నెట్ కేసులో లోకేశ్ నిందితుడు కాడని ఒప్పుకుంది.
• గౌరీశంకర్ నియామకంపై.. అతని అర్హతలపై అభ్యంతరాలు రావడంతో తాము అనుకున్న పని పూర్తయ్యాక జగన్ సర్కార్ అతన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ నుంచి తొలగించింది.
• గౌరీ శంకర్ నియామకంలో కుట్రపూరితంగా వ్యవహరించిన ముఖ్యమంత్రిని విచారించే ధైర్యం సీఐడీకి ఉందా?
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
చంద్రబాబు అతితక్కువ ఖర్చుతో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను పూర్తిచేసి దేశానికే ఆదర్శంగా నిలిచారని, అలాంటి గొప్ప ప్రాజెక్ట్ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వేసిన 24వేల కిలోమీట ర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లో, 524 కిలోమీటర్ల కేబుల్ ను కుట్రపూరితంగా కత్తిరింపునకు జగన్ రెడ్డి 2019 నవంబర్లో శ్రీకారం చుట్టాడని, ఈ పని చక్కబెట్టడానికి ఏపీ ఫైబర్ నెట్ లో ఈడీగా వ్యవహరించిన అంజయ్య ఈ మెయిల్స్ ద్వారా తన కింది అధికారుల కు ఆదేశాలు ఇచ్చిన సమాచారాన్ని ఇప్పటికే ప్రజలకు తెలియచేశామని, ఆది నుంచీ జగన్ రెడ్డి ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పై ఎంత విద్వేషంతో ఉన్నాడో చెప్పడానికి ఈ పరిణామాలే నిదర్శనమని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ….
“ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పై బురదజల్లడం కోసం, ఏదోరకంగా దానిలో అవినీతి జరిగిందని నిరూపించి, దానిలో చంద్రబాబు పాత్ర ఉందని నిరూపించడంకోసం జగన్ రెడ్డి వైర్లు కత్తిరించి మరీ పడిన నానా అవస్థల్ని కొద్దిరోజులక్రితం మీడియా ముందు ఉంచడం జరిగింది. దానిపై జగన్ రెడ్డి అవినీతి పత్రిక సాక్షిలో ఫైబర్ నెట్ కేబుల్ కత్తిరించిన మాట వాస్తవమేనని.. అయితే కత్తిరించిన కేబుల్ ను ఒక రహస్య ప్రదేశంలో భద్రపరిచామని హాస్యాస్పదంగా ‘ఫ్యాక్ట్ చెక్’ పేరుతో రాసుకొచ్చారు. అదే విధంగా నిన్న హైకోర్టులో ప్రభుత్వమే స్వయంగా ఫైబర్ నెట్ కేసులో లోకేశ్ నిందితుడు కాదని తేల్చింది. మరి అలాంటప్పుడు నేటివరకు అకారణంగా తమ నీలి మీడియాలో లోకేశ్ పై దేనికి బురదజల్లారో పాలకులు సమాధానం చెప్పాలి. చంద్రబాబు వేయించిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ను జగన్ రెడ్డి కత్తిరించడం కుట్రలో ఒక కోణమైతే, మరో రాజకీయ కుట్ర ఏమిటంటే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రాజెక్ట్ ను నిర్వీర్యం చేయడానికి ఎలా ప్రయత్నించాడో చూద్దాం.
ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ కు బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సిగ్నమ్ కంపెనీకి చెందిన గౌరీశంకర్ ను ఎటువంటి అర్హత లేకపోయినా జగన్ రెడ్డి ఏ కుట్రలో భాగంగా నియమించాడు?
ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను రాష్ట్రంలో అమలు చేసిన టెరాసాఫ్ట్ అనే కంపెనీకి సిగ్నమ్ అనే సంస్థ గతంలో ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్స్ అందించింది. టెరాసాఫ్ట్ సంస్థ తమకు గతంలో వివిధరకాల ఎక్విప్ మెంట్స్ అందించినట్టు.. అవన్నీ బ్రహ్మండంగా పనిచేస్తు నట్టు ధృవీకరిస్తూ సిగ్నమ్ సంస్థ టెరాసాఫ్ట్ సంస్థకు ఒక ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ అందించింది. ఆనాటి నుంచి సిగ్నమ్ సంస్థకు ఎండీగా కొర్రపాటి గౌరీ శంకర్ పనిచేస్తున్నారు. అటువంటి గౌరీశంకర్ ను జగన్ రెడ్డి, అతని సర్కార్ ఏ విధంగా ప్రలోభపెట్టిందో, ఎంతలా భయపెట్టి, తమకు అనుకూలంగా అతనితో వాంగ్మూలం తీసుకుందో ప్రజలకు తెలియాలి.
ఫైబర్ నెట్ వైర్లు కత్తిరించి చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేసి, ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను ఏవిధంగా బదనాం చేసే ప్రయత్నం చేశారో, అదే తరహాలో అప్పటివరకు లేని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిజినెస్ ఆపరేషన్స్ అనే పదవిని ఏపీ ఎస్.ఎఫ్.ఎల్ లో సృష్టించి దానిలో ముందుగానే తాము ఎంచుకున్న గౌరీశంకర్ ను కూర్చోబెట్టడానికి 28-10-2019న ప్రధాన వార్తాపత్రికల్లో ప్రకటనలు జారీ చేయడం జరిగింది. ఆ ప్రకటనల్లో ఈడీ పదవికి దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులకు కావాల్సిన విద్యార్హతలు.. మరియు కనీసంగా ఐటీ సెక్టార్లో 10 సంవత్సరా ల అనుభవం ఉండాలన్న నిబంధనలను పెట్టడం జరిగింది.
ఆనాటి ప్రభుత్వ ప్రకటనకు స్పందించి దాదాపు 12 మంది ఈడీ బిజినెస్ ఆపరేషన్స్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎంబీఏ, బీటెక్ మొదలగు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివిన ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారు. కానీ ముందుగా వేసుకున్న పథకరచనలో భాగంగా ఎటువంటి విద్యార్హతలు లేనటువంటి గౌరీ శంకర్ ను ఎంపిక చేయడం జరిగింది. గౌరీ శంకర్ తాను పెట్టిన దరఖాస్తులో బీ.ఆర్.అంబేద్కర్ యూనివర్శిటీ (ఆగ్రా) నుంచి దూరవిద్య ద్వారా బీఎస్సీ కంప్యూటర్స్ డిగ్రీ పట్టా పొందినట్టు పేర్కొనడం జరిగింది. కానీ వాస్తవానికి గౌరీ శంకర్ పొందుపరిచిన డిగ్రీ పట్టా నకిలీదని ఆ తరువాత తేలింది.
దీనిని బట్టి జగన్ రెడ్డి మరియు అతని ముఠాసభ్యులు గౌరీ శంకర్ కు డిగ్రీ పట్టా లేదన్న విషయం తెలిసి కూడా వారే తాడేపల్ల ప్యాలెస్ లో నకిలీపట్టాలు సృష్టించి మరీ అతనితో ఈడీ పోస్టుకు దరఖాస్తు చేయించారు. ఎంతో మంది ఉన్నత విద్యావంతుల్ని కాదని, ఒక నకిలీ డిగ్రీ పట్టాతో ఉద్యోగానికి దరఖాస్తు చేసిన వ్యక్తిని స్వయంగా ముఖ్యమంత్రి సంతకంతో ఎంపిక చేయడం జగన్ రెడ్డి రాజకీయ కుట్రకు అద్దం పడుతోంది .
తాను అనుకున్నవిధంగా ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పై, చంద్రబాబు.. లోకేశ్ లపై బురదజల్లడానికి గౌరీశంకర్ తనకు పనికొస్తాడనే జగన్ రెడ్డి.. ఎలాంటి అర్హతలు లేకపోయినా అతన్ని ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించాడు
గౌరీశంకర్ ను ఈడీగా నియమిస్తూ ఆదేశాలిచ్చిన ఫైల్ ను ప్రభుత్వంలోని కొంతమంది ఉన్నతాధికారులు స్వయంగా సిద్ధంచేసి సంతకాలు పెట్టిమరీ జగన్ రెడ్డి వద్దకు పంపించారు. జగన్ రెడ్డి కూడా తాను ఆదేశించిన విధంగానే తన కింద పనిచేసే అధికారులు ఎంతో నేర్పరితనంతో ఎటువంటి అర్హతలు లేని గౌరీశంకర్ ను ఈడీ పదవి కి ఎంపిక చేయడాన్ని సంతోషపడుతూ తాను కూడా స్వయంగా 11-02-2020 సాయంత్రం 4.49 నిమిషాలకు తనకు ఎంతగానో కలిసొచ్చే మంచి దుర్ముహూర్తంలో సంతకం చేశాడు. ముందుగా ఏపీ ఎస్.ఎఫ్.ఎల్ ఎండీగా ఉన్న సుమిత్ కుమార్ 28-12-2019న గౌరీశంకర్ నియామకాన్ని ఆమోదిస్తూ సంతకం పెడితే, ఆ తరువాత 29-12-2019న ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ భార్గవ్ సంతకం చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైలు పంపడం జరిగింది.
ముఖ్యమంత్రి కార్యదర్శి అయిన సాల్మన్ ఆరోక్యరాజ్ స్వయంగా ఈ దస్త్రాన్ని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి 11-02-2020న వారితో సంతకం పెట్టించారు. ఆ తరువాత గౌరీ శంకర్ నియామకానికి సంబంధించిన జీవో జారీ చేయడం కొరకు తిరిగి ఫైల్ ను సంబంధిత అధికారుల వద్దకు పంపారు. ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం అయ్యాక, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీ ఎస్.ఎఫ్.ఎల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిజినెస్ ఆపరేషన్స్ గా గౌరీ శంకర్ని నియమిస్తూ జీవో నెం-66ని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాలవలవన్ జారీ చేశారు. ఎటువంటి అర్హతలు లేని గౌరీశంకర్ ను నియమించడంకోసం ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డే ఏరికోరి ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించాడు. ఎందుకు అలా చేశారంటే కేవలం ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పై అతని ద్వారా బురదజల్లడానికే. ఎలాంటి అర్హతలు లేని గౌరీశంకర్ని ఏరికోరి ముఖ్యమంత్రి ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎందుకు నియమించారనే దానిపై ఏపీ సీఐడీ ఎప్పుడైనా ఆలోచన చేసిందా? ఆ గౌరీశంకర్ ను పిలిచి విచారించారా?
గౌరీ శంకర్ తన దరఖాస్తులో పొందుపరిచిన డిగ్రీ పట్టా బోగస్ అని బీ.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఆగ్రా వారు తేల్చిచెప్పారు
గౌరీశంకర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ పొందడంకోసం ప్రభుత్వానికి సమర్పించిన విద్యార్హతల వివరాలు అన్నీ కూడా బోగస్సే. ఇంటర్మీడియట్ కూడా కంపార్ట్ మెంట్లో పాసయ్యాడు. తాడేపల్లి ప్యాలెస్ పెదపాలేరు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతరులు కలిసి గౌరీశంకర్ అంబేద్కర్ యూనివర్శిటీలో బీఎస్సీ కంప్యూటర్స్ చదివినట్టు ఫేక్ సర్టిఫికెట్ సృష్టించారు. గౌరీ శంకర్ ఉద్యోగ దరఖాస్తులో ఇంటర్మీడియట్ 14-04-2007న 46 శాతం మార్కులతో పాసైనట్టు రాశారు. వాస్తవానికి 2009లో ఇంటర్మీడియట్ పాసైనట్టు సర్టిఫికెట్లో ఉంది. గౌరీ శంకర్ ను ఎంపిక చేసేవారికి ఆ మాత్రం వ్యత్యాసం కనిపెట్టే జ్ఞానం లేదా? జగన్ రెడ్డి ఏరికోరి ఎంపిక చేసిన వ్యక్తి కాబట్టి సర్టిఫికెట్లు సమగ్రంగా ఉన్నాయో లేదో కూడా ఎవరూ పరిశీలించలేదు. సుమిత్ కుమార్, రజత్ భార్గవ్ వంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం గుడ్డిగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆదేశాలమేరకు ఫైలుపై సంతకాలు చేశారు.
ఫైబర్ నెట్ ను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న జగన్ రెడ్డి ఈ విధంగా అర్హతలేని గౌరీ శంకర్ ను కీలకపదవిలో కూర్చోబెట్టి, తనకు నచ్చినట్టు అతనితో నిరాధారమైన ఆరోపణలు చేయించడం మొదలుపెట్టాడు. కానీ గౌరీశంకర్ తో పాటు ఈడీ పదవికి దరఖాస్తు చేసుకున్న ఇతర ఉన్నత విద్యావంతులు మరియు గౌరీశంకర్ అసలు విద్యార్హతలు తెలిసిన కొందరు ఈ తప్పుడు సర్టిఫికెట్ల వ్యవహారంపై పెద్దఎత్తున ప్రశ్నించడం మొదలుపెట్టేసరికి దిక్కుతోచని స్థితిలో తాము అనుకున్నపని గౌరీశంకర్ తో చేయించిన తర్వాత అతన్ని టెర్మినేట్ చేసి జగన్ రెడ్డి అండ్ కో చేతులు దులుపుకున్నారు. గౌరీ శంకర్ డిగ్రీపట్టా నూటికి నూరుశాతం నకిలీదని ధృవీకరిస్తూ డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ యూనివర్శిటీ (ఆగ్రా) వారు లిఖిత పూర్వకంగా జూన్ 2020లో తెలియపరిచారు. తాము దూరవిద్య విధానానికి సంబంధించి ఎవరికీ ఎలాంటి విద్యార్హత సర్టిఫికెట్లు అందించలేదని బీ.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం వారే చెప్పారు. ఇదంతా గమనిస్తే గౌరీశంకర్ కు దొంగ సర్టిఫికెట్లు అందించింది కూడా జగన్ రెడ్డే నని స్పష్టమవుతోంది.
తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించిన గౌరీశంకర్ని… అనర్హుడని తెలిసీ అతన్ని ఏరికోరి ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించిన ముఖ్యమంత్రిని సీఐడీ ఎందుకు విచారించదు?
గౌరీశంకర్ నియామకంపై గానీ.. దానివెనకున్న కుట్రగురించి గానీ, అతని విద్యార్హత సర్టిఫికెట్లపై గానీ సీఐడీ ఎందుకు దృష్టి పెట్టలేదు? దొంగ సర్టిఫికెట్లు సమర్పించిన అతన్ని ఎందుకు అరెస్ట్ చేసి విచారించలేదు? అలాంటి వ్యక్తిని ఎంపికచేసి, అతని నియామకానికి సంబంధించిన ఫైల్ పై తానే స్వయంగా సంతకం పెట్టిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఏపీ సీఐడీ ఎందుకు విచారించలేదు? 30-12-2019న ఫైల్ సీఎం కార్యాలయానికి చేరుకోగా 11-02-2020న ముఖ్యమంత్రి స్వయంగా దానిపై సంతకం చేసింది నిజంకాదా? దీనికి జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడు? కుట్ర కాకపోతే ముఖ్యమంత్రే స్వయంగా అర్హతలేని వ్యక్తిని ఈడీగా ఎందుకు ఎంపిక చేస్తాడు? దీనికి సంబంధించి ముఖ్యమంత్రి సంతకం చేసిన నోట్ ఫైల్ ను విడుదల చేస్తున్నాం. సీఐడీ చీఫ్ దీనికి సమాధానం చెప్పాలి.
ఏ కుట్రలో భాగంగా గౌరీశంకర్ ను అడ్డుపెట్టుకొని ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పై జగన్ రెడ్డి బురదజల్లిస్తున్నాడనే దానిపై సీఐడీ విచారించదా? గౌరీశంకర్ ను భయపెట్టి, ఒక ఉన్నత పదవితో ప్రలోభపెట్టి తమకు కావాల్సిన విధంగా స్టేట్ మెంట్ ఇప్పించుకున్నారు. గతంలో తమకంపెనీ టెరాసాఫ్ట్ సంస్థకు ఇచ్చిన సర్టిఫికెట్ నిజం కాదని గౌరీశంకర్ తో మాయమాటలు చెప్పించి, అదే విషయాన్ని మంత్రుల కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ లో పొందుపరిచారు. కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? గౌరీశంకర్ ను ఈడీగా నియమించాక జూన్ 12న సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. తమకు కావాల్సిన స్క్రిప్ట్ కు అనుగుణంగా రిపోర్ట్ తయారుచేసి, మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన తదితరులు సంతకాలు చేసి రిపోర్ట్ సిద్ధం చేశారు. ఫైబర్ నెట్ పై కుట్రంతా ఇంత స్పష్టంగా కళ్లెదురు కనిపిస్తుంటే అకారణంగా చంద్రబాబు.. లోకేశ్ లపై అభాండాలు వేసి.. సీఐడీ హడావిడి చేస్తోంది.
కానీ కుట్రపన్ని దేశంలోనే ఒక రోల్ మోడల్ గా రూపొందింపబడిన ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను సర్వనాశనం చేస్తున్న జగన్ రెడ్డిని ప్రశ్నించలేని దుస్థితిలో సీఐడీ ఉంది. గౌరీశంకర్ నియామకం సహా.. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ కేబుల్ ను ఎందుకు కత్తిరించారనే దానిపై కూడా సీఐడీ విచారించాలి. జగన్ రెడ్డి సంతకాలు పెట్టిన ఫైళ్లను కూడా నేడు ప్రజల ముందు ఉంచు తున్నాం. వాటి ఆధారంగా ముఖ్యమంత్రికి నోటీసులిచ్చి.. విచారించే ధైర్యం సీఐడీకి ఉందా అని నిలదీస్తున్నాం. చంద్రబాబు, లోకేశ్ లపై తప్పుడు కేసులు పెట్టడం మాని… దమ్ము, ధైర్యముంటే నేరుగా తాడేపల్లి ప్యాలెస్ తలుపు తట్టాలని సీఐడీకి సూచిస్తున్నాం. ఇలాంటి నిజాలను దాచిపెట్టి.. చంద్రబాబు, లోకేశ్ లపై.. టీడీపీపై బురదజల్లే అవినీతి మీడియా సాక్షిని.. నీలి మీడియాను ఎప్పటికప్పుడు వాస్తవాలతో కడిగేస్తూనే ఉంటాం.
ఫైబర్ నెట్ పై కుట్ర నూటికి నూరుశాతం తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ లోనే నడిచింది. పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయి. 24 వేల కి.మీ ఫైబర్ ఆప్టిక్ లైన్ వేయాలంటే రూ.4వేల కోట్ల ఖర్చవుతుంది. రూ. 3వేల700 కోట్లు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదాచేశారు, అధునాతన సాంకేతిక పరిజ్జానంతో 149రూపాయలకు ఇంటర్నెట్, టెలిఫోన్, టీవీ వంటి సౌకర్యాన్ని అందించారు. వైసిపి ప్రభుత్వ ఆ రేటును 350కి పెంచేసింది. అధునాతన సౌకర్యాన్ని గ్రామాలకు తీసుకెళ్లాలని సంకల్పించాం, అటువంటి సత్సంకల్పానికి అవినీతి మరక అంటించే ప్రయత్నం చేస్తున్నారు.
నూటికి నూరు శాతం ఇది వైసీపీ పెద్దల కుట్రే, సీఎం జగనే ఈ కుట్రలో ప్రధాన పాత్రధారి. ఖైదీనెం. 6093గా ముద్రపడ్డ జగన్…ఏదోరకంగా చంద్రబాబుకు అవినీతి మరక అంటించే ప్రయత్నం చేస్తున్నారు. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను ప్రధాని మోడీ అభినందించారు, మిగతా అన్ని రాష్ట్రాల్లో డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టాలని సూచించారు . నాటి టెలికం సెక్రటరీ జెఎస్ దీపక్ ఏపీని సందర్శించి ఫైబర్ నెట్ ను బెస్ట్ మోడల్ గా ప్రశంసించారు. అటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్ ను కుట్రపన్ని నాశనం చేశారు. చైతన్యవంతులైన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఫైబర్ నెట్ పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, కుట్రను అర్థం చేసుకోవాలి.” అని పట్టాభిరామ్ సూచించారు.