– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
జనం తమ ఇబ్బందులను తెలిపే అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం లేదని, అసలు జనం గోడు వినే తీరిక లేదా? లేక ఎందుకు వినాలన్నా అహంభావమా? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. కనీసం విజ్ఞప్తులు స్వీకరించడానికి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుమతించడం లేదు. నేడు సీఎంకు విజ్ఞప్తి చేసేందుకు వచ్చిన అమలాపురం గొల్లగూడెం కు చెందిన ఆరుద్ర అనే యువతి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద చేయి కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
కానిస్టేబుల్ వేధిస్తున్నాడని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి విన్నవించుకున్నప్పటికీ ఆ యువతకి న్యాయం జరగలేదు. స్పందనలో ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి విన్నవించుకునేందుకు తాడేపల్లి రాగా అక్కడ కూడా చుక్కెదురయింది. దీంతో మనస్థాపం చెందిన ఆరుద్ర ఆత్మహత్యకు పాల్పడింది.
రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాస్వామ్యమా? లేక నిరంకుశ నియంత రాజ్యమా? అని ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్ళకుండా, క్యాంప్ ఆఫీస్ అంటూ తాడేపల్లిలో గడపడం ఏంటి? క్యాంప్ ఆఫీస్ కూడా నిషేధిత ప్రాంతం లాగా ముళ్ళకంచెలతో, పోలీసు పహారాతో ఉంచటం ఏంటి? రాజరిక పాలనలో కూడా ధర్మగంట ఉండేది. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజా వినతుల స్వీకరణ లేదు. కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఇంటర్వ్యూలు కరువు. అఖిలపక్ష సమావేశాలు లేవు. కేవలం నిర్బంధకాండలు, అణచివేతలు, నియంత పాలన మాత్రమే ఏపీలో సాగుతోంది. జగన్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
తక్షణమే ఆరుద్రను కానిస్టేబుల్ వేధింపుల నుండి కాపాడి, ఆమెకు న్యాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే ప్రజా వినతులను స్వీకరించాలి. ఏపీ అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షాల సూచనలను పరిగణలోకి తీసుకోవాలి.