– పాకాల ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందని ప్రభుత్వం చెప్పలేదు
– మీడియాలో మాత్రమే కథనాలు వచ్చాయి
– జూబ్లీహిల్స్ హైలైఫ్ పబ్‌కు రాజ్ పాకాల గతంలో యజమాని
– డ్రగ్స్ తీసుకున్న జూబ్లీహిల్స్ గ్యాంగ్‌లో రాజ్ పాకాల సభ్యుడనే ప్రచారం
– మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. రేవ్ పార్టీ జరిగినట్లు మీడియాలో మాత్రమే కథనాలు వచ్చాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు.
అసలు 111 జీవోను అతిక్రమిస్తూ రాజ్ పాకాల జన్వాడలో ఇల్లు ఎలా నిర్మించారని ప్రశ్నించారు. పదేళ్లు మంత్రిగా పని చేసిన కేటీఆర్‌కు వారెంట్ ఎలా ఇస్తారో తెలియదా? కేసీఆర్ హయాంలో ఫాంహౌస్‌లో స్టింగ్, కోవర్ట్ ఆపరేషన్లు జరిగినట్లుగా ఇప్పుడు జరగడం లేదు. జన్వాడ ఫాంహౌస్‌లో ఎలాంటి స్టింగ్ ఆపరేషన్ జరగలేదని వెల్లడించారు.
జూబ్లీహిల్స్ హైలైఫ్ పబ్‌కు రాజ్ పాకాల గతంలో యజమానిగా ఉన్నారు. డ్రగ్స్ తీసుకున్న జూబ్లీహిల్స్ గ్యాంగ్‌లో రాజ్ పాకాల సభ్యుడనే ప్రచారం కూడా జరిగింది . బీఆర్ఎస్ హయాంలో జుబ్లీహిల్స్ పబ్‌లకు అనుమతులు ఇప్పించింది రాజ్ పాకాలనే. డ్రగ్స్‌కు స్వర్గం అని చెప్పే సన్ బర్న్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడానికి రాజ్ పాకాల ప్రయత్నించారు.
జన్వాడ ఫాంహౌస్ ఘటనపై రాజ్ పాకాల మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది. తాను డ్రగ్స్ తీసుకోలేదని రాజ్ పాకాల నిరూపించుకోవాలి. విజయ్ మద్దూరి స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆయన స్టేట్మెంట్ను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. విచారణలో అన్ని నిజాలు బయటపడతాయని, కానీ అప్పుడే బీఆర్ఎస్ నేతలు భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు.