– కేసు అసోంలో ఉంటే హైదరాబాద్లో బెయిల్ పిటిషనా?
– ఢిల్లీని వదిలి హైదరాబాద్కు రావడంలో ఆంతర్యమేమిటి?
– పవన్ ఆరోపణలు నిజమైతే దాక్కోవడమెందుకు?
– కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు నిందితులకు షల్టర్జోన్లా?
– “డరో మత్” — మరి ఎందుకు దాక్కుంటున్నారు? చట్టాన్ని ఎదుర్కోండి
– పవన్ ఖేరా వ్యవహారంపై తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్చార్జ్ ఎన్వీ సుభాష్ ఆగ్రహం
హైదరాబాద్: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సతీమణి రిణికి భూయాన్ శర్మ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు కొన్ని షరతులతో కూడిన ఒక వారం పాటు మధ్యంతర ఉపశమనాన్ని మంజూరు చేసింది. ఈ సమయంలో, గౌహతి క్రైమ్ బ్రాంచ్ నమోదు చేసిన ఆ కేసుపై పూర్తి భౌగోళిక అధికార పరిధి కలిగిన అసోంలోని సంబంధిత కోర్టును ఆశ్రయించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, అనంతరం ఈ అంశాన్ని అసోంలోని సమర్థవంతమైన కోర్టు చట్టపరంగా, కేసు మెరిట్స్ ఆధారంగా పరిగణిస్తుందని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.
పవన్ ఖేరా ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన శాశ్వత నివాసి. ఆయనపై నమోదైన కేసు అసోంలో ఉన్నప్పటికీ, ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, హైదరాబాద్ చిరునామాతో ఉన్న ఆధార్ కార్డును సమర్పించిన సందర్భంలో, ఆయన కోర్టు ముందు ఉంచిన పత్రాలలో వ్యత్యాసాలు ఉన్నాయని హైకోర్టు స్వయంగా గుర్తించింది.
ఈ నేపథ్యంలో, పవన్ ఖేరా హైదరాబాద్కు ఎందుకు వచ్చారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాహుల్ గాంధీ “డరో మత్” అని చెప్పే సమయంలో, అదే పార్టీకి చెందిన అధికార ప్రతినిధి ఢిల్లీని వదిలి, కాంగ్రెస్ పాలిత తెలంగాణలో ఆశ్రయం పొందడం ఏ సందేశాన్ని ఇస్తోంది?
అసోం పోలీసులు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న పవన్ ఖేరా నివాసానికి వెళ్లిన సమయంలో, ఆయన ఇప్పటికే నిశ్శబ్దంగా హైదరాబాద్కు జారుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు చెబుతున్న వీడియోలో ఆయన కారులో మీడియా కెమెరాల నుండి ముఖాన్ని దాచుకుంటూ కనిపించడం గమనించవచ్చు. అసోం ముఖ్యమంత్రిపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేసిన తర్వాత, చట్టాన్ని ఎదుర్కోవడానికి ఆయన వెనుకంజ వేస్తున్నారనే అభిప్రాయం దీనితో మరింత బలపడుతోంది.
ఆయన చేసిన ఆరోపణలపై నమ్మకం ఉంటే, ఈ విధంగా గోప్యత పాటించడం, తప్పించుకోవడం, విచారణకు దూరంగా ఉండే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్న తలెత్తుతోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఆశ్రయం పొందాల్సిన అవసరం ఏంటని ఈ సందర్భంగా ఎన్.వి.సుభాష్ ప్రశ్నించారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్, పవన్ ఖేరాకు స్పష్టంగా సందేశం ఇస్తున్నారు: “డరో మత్.” చట్టాన్ని ధైర్యంగా ఎదుర్కోండి. కోర్టులో మీ వాదనలను ఆధారాలతో నిరూపించుకోండి.
పారిపోవడం, ముఖం దాచుకోవడం, రాజకీయ ఆశ్రయం కోరుకోవడం..ఇవేవీ అసోం ముఖ్యమంత్రిపై మీరు చేసిన నిరాధారమైన, పరువు నష్టం కలిగించే ఆరోపణల నుండి మిమ్మల్ని రక్షించలేవు.