Suryaa.co.in

Telangana

ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా?

తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ నాకుంది
మోటార్లకు మీటర్లు పెడతామని మేమెన్నడూ చెప్పలేదు
తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తున్నారు.
1వ తేదీన పాలమూరులో.. 3వ తేదీన ఇందూరులో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతోపాటు, పూర్తయిన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.

మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో.. మోదీ చేతుల మీదుగా రూ.13,545 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరగనుంది.రూ.505 కోట్లతో నిర్మించిన మునీరాబాద్-మహబూబ్‌నగర్ ప్రాజెక్టులో భాగమైన.. ‘జక్లేర్-కృష్ణ’ కొత్త లైన్‌ను జాతికి అంకితం చేస్తారు.

ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్-గోవా మధ్య 102 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
కృష్ణ స్టేషన్‌ నుంచి ‘కాచిగూడ – రాయచూర్ – కాచిగూడ’ డెమూ సర్వీస్‌‌ను ప్రారంభిస్తారు. జాతీయ రహదారులకు సంబంధించిన రూ. 6,404 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

రూ.2,457 కోట్లతో నిర్మించిన NH 365 BBలో భాగమైన సూర్యాపేట-ఖమ్మం ఫోర్‌‌లేన్‌ను మోదీగారు ప్రారంభిస్తారు.దీంతోపాటుగా రూ.2,661 కోట్ల విలువైన.. హసన్ (కర్ణాటక) – చర్లపల్లి HPCL LPG పైప్‌లైన్ ను జాతికి అంకితం చేస్తారు.ఈ ప్రాజెక్టు ద్వారా.. 37 లక్షల మంది వినియోగదారులకు LPG గ్యాస్ అందించే వెసులుబాటు ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో 230 కిలోమీటర్ల మేర ఈ పైప్‌లైన్ ఉండగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే 130 కిలోమీటర్ల పాటు ఈ HPCLపైప్‌ లైన్ ఉంటుంది.తిమ్మాపూర్ లోని IOCL ప్లాంటుకు ఈ పైప్‌లైన్ ను కనెక్ట్ చేస్తే.. అదనంగా మరో 35 లక్షల మంది వినియోగదారులకు గ్యాస్ అందించే అవకాశం ఉంది.

దీంతోపాటుగా.. రూ. 1,932 కోట్లతో.. కృష్ణపట్నం (ఆంధ్రప్రదేశ్) – హైదరాబాద్ మధ్య ‘మల్టీ ప్రాడక్ట్ పైప్‌లైన్’కు (డీజిల్, పెట్రోల్, కిరోసిన్, జెట్ ఫ్యూయల్..) శంకుస్థాపన చేస్తారు. ఇది తెలంగాణ భవిష్యత్ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుంది.

నరేంద్రమోదీ ఇస్తున్న మరో కానుక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రూ.81.27 కోట్లతో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ & స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ & కమ్యూనికేషన్స్ భవనాలను మోదీ గారు వర్చువల్ గా ప్రారంభిస్తారు.

దేశంలో మౌలికవసతుల కల్పనను వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి మోదీ గారు ‘హీరా’ మోడల్‌ (H- హైవేస్, I- ఇన్ఫోవేస్, R- రైల్వేస్, A- ఎయిర్‌వేస్ అభివృద్ధి)తో ముందుకెళ్తున్నారు. తెలంగాణకు రికార్డు స్థాయిలో రూ.లక్షా పదివేల కోట్ల విలువైన (1.10 లక్షల కోట్లు) జాతీయ రహదారులను కేటాయించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలంగాణలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే.. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ 9 ఏండ్లలోనే 2500 కిలోమీటర్ల హైవేస్ తెలంగాణ ప్రజలకు వినియోగంలోకి వచ్చాయి. మరో 2200 కిలోమీటర్ల హైవేలు నిర్మాణంలో ఉన్నాయి.

RRR వంటి పలు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు 50 శాతం నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినా.. కేసీఆర్ ప్రభుత్వం సహకరించని కారణంగా ఈ ప్రాజెక్టులు ఆగిపోతున్నాయి.

ప్రధాని మోదీ చేతుల మీదుగా.. తెలంగాణలోని 22 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు ఇటీవలే శంకుస్థాపన జరిగింది. రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను.. అదే విధంగా.. నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల ఆధునీకరణ జరగనుంది. దేశవ్యాప్తంగా 34 వందేభారత్ రైళ్లు ఇస్తే.. తెలంగాణకే 3 రైళ్లను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే బడ్జెట్‌ను గణనీయంగా పెంచుతోంది.

2014లో తెలంగాణ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ రూ.258 కోట్లు.
2023లో ఇది రూ.4,418 కోట్లకు పెరిగింది.
కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాజెక్టులను పేపర్ పైనే చూపించేది. వారు శంకుస్థాపనలు చేసిన అనేక ప్రాజెక్టులను మోదీ గారు ప్రారంభించారు.
ప్రత్యేకమైన కార్యాచరణతో రైల్వేవ్యవస్థను మెరుగుపరిచారు.
ఆధునిక వసతులు, వైఫై సదుపాయం కల్పిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో రూ.31,221కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి.
ఎయిర్‌పోర్టుల నిర్మాణం విషయంలోనూ.. కేంద్రం చిత్తశుద్దితో పనిచేస్తోంది.
దేశవ్యాప్తంగా 2014కు ముందు వినియోగంలో ఉన్న 75 విమానాశ్రయాల సంఖ్యను.. ఈ 9 ఏండ్లలో 150 విమానాశ్రయాలకు పెంచినా.. తెలంగాణలో మాత్రం ఒక్క ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కాకపోవడం దురదృష్టకరం.
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం కారణంగా.. ఈ పనులు ఆలస్యమవుతున్నాయి.
ఎన్నికలు వస్తున్నాయని.. వరంగల్ విమానాశ్రయానికి భూసేకరణ చేస్తామని ఏదో ప్రకటన చేసింది. ఇది కంటితుడుపు చర్య మాత్రమే.
ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్టణం, రాజమండ్రి, పుట్టపర్తి, కర్నూలు, కడప, విజయవాడ వంటి పలు ఎయిర్ పోర్టులు ఉన్నాయి.
మన దగ్గర మాత్రం ఒక్క హైదరాబాద్ లోనే విమానాశ్రయం ఉంది.అక్టోబర్ 3న నిజామాబాద్ పర్యటన సందర్బంగా.. ప్రధానమంత్రి.. రూ. 8021 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించడం, జాతికి అంకితం చేస్తారు.రామగుండంలోని NTPCలో రూ.6వేల కోట్లతో నిర్మించిన 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తారు. ఈ ప్లాంటులో ఉత్పత్తయ్యే విద్యుత్తులో 85 శాతం (680 మెగావాట్లు) తెలంగాణలోనే వినియోగిస్తారు.

వచ్చే డిసెంబర్ నాటికి రెండో ప్రాజెక్టు కూడా పూర్తికానుంది. ‘అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ’ని ఈ ప్లాంటులో వినియోగించడం ద్వారా.. తక్కువ ధరకే విద్యుత్‌ తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.ఈ ప్రాజెక్టు దేశంలోని ఎన్టీపీసీ పవర్ స్టేషన్లలో అత్యంత ఆధునికమైనది, సమర్థవంతమైనది. ఇది తక్కువ బొగ్గును వినియోగించుకోవడంతోపాటుగా, తక్కువ కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తుంది.పర్యావరణ అనుకూల ప్రాజెక్టుగా దీన్ని చెప్పుకోవచ్చు.
ఇప్పటికే రామగుండంలో 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ను కేంద్రం ప్రారంభించింది.

ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పనకు బాటలు పడతాయి.గత 9 ఏండ్లుగా భారతదేశ విద్యుత్ రంగం గణనీయమైన ప్రగతిని సాధించింది. గతంలో ఇండస్ట్రియల్ హాలిడేస్ ఇచ్చేవారు. కానీ ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలోనూ విద్యుత్ కొరత లేకుండా విద్యుత్ ప్రసారం జరుగుతోంది.

సౌత్-నార్త్ గ్రిడ్ కనెక్టివిటీ కూడా మెరుగుపడింది.రిలయబుల్, అఫర్డబుల్, సస్టేనబుల్ విద్యుత్ ను ప్రజలకు ఇవ్వాలనేది మోదీ గారి ఆలోచన.దానికి తగ్గట్లుగా విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచాం. దీంతోపాటుగా పునరుత్పాద విద్యుత్ (రిన్యువబుల్ ఎనర్జీ)కు ప్రత్యేక సహకారం అందిస్తున్నాం. తెలంగాణలో రూ. 1,369 కోట్లతో.. 496 బస్తీ దవాఖానాలు, 33 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీస్ తో పాటుగా.. 31 జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో.. 50/100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ లను నిర్మించాలనేది ప్రధానమంత్రి మోదీ సంకల్పం.

ఇందులో భాగంగా.. 3వ తేదీన.. 20 జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM)లో భాగంగా రూ. 516.5 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ లకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.

జిల్లాల పేర్లు..
వీటి ద్వారా జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో.. ఐసోలేషన్ వార్డులు, ఐసీయూలు మొదలైన వాటిని ఆధునీకరిస్తారు. దీంతోపాటుగా ఇన్‌ఫెక్షన్స్ నివారణతోపాటు ఆక్సీజన్ సప్లయ్ మెరుగుపరిచే చర్యలు కూడా ఇందులో ఉంటాయి.ఇప్పటికే హైదరాబాద్ సహా వివిధ పట్టణాల్లో బస్తీదవాఖానాలు.. ఈఎస్ఐ ఆసుపత్రిని ఆధునీకరించుకున్నాం.. ఏయిమ్స్ ఏర్పాటుచేసుకున్నాం. దీన్ని కూడా ఎప్పటికప్పుడు ఆధునీకరించుకుంటున్నాం.

దీంతోపాటుగా.. రూ.305 కోట్లతో 348 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ (ఎలక్ట్రిఫికేషన్) పూర్తయిన.. ధర్మాబాద్ (మహారాష్ట్ర) -మనోహరాబాద్, మహబూబ్‌నగర్ – కర్నూల్ రైల్వే లైనును.. జాతికి అంకితం చేస్తారు.రూ. 1200 కోట్లతో 76 కిలోమీటర్ల మీర నిర్మించిన మనోహరాబాద్-సిద్దిపేట కొత్త రైల్వే లైనును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

ఇది చాలా పెద్ద ప్రాజెక్టు.. భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ ప్రాజెక్టును నిర్మాణం చేయడం జరిగింది. యాదవ సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యమైన కొమురవెల్లి మల్లన్న.. దర్శనార్థం వచ్చే భక్తులకోసం.. కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపనకూడా త్వరలోనే జరగనుంది. అక్కడ రైల్వేస్టేషన్ నిర్మాణంతోపాటు.. వివిధ ముఖ్యమైన రైళ్లకు స్టాప్ కూడా ఉంటుంది.

ప్రధానమంత్రి ఈ రెండు ప్రాంతాల్లో అధికారిక కార్యక్రమాల ప్రారంభోత్సవం తర్వాత బీజేపీ బహిరంగ సభలకు హాజరవుతారు.9 ఏండ్లలోకేంద్రం 9 లక్షల కోట్లకు పైగానిధులను తెలంగాణ అభివృద్ఢికి కేంద్రం ఖర్చుచేసింది. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. తెలంగాణ అభివృద్ధి విషయంలో నాకు ఎవరి సర్టిఫికేటూ అవసరం లేదు. తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ నాకుంది.

మేం అనేక కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చాం. 26వేల కోట్లతో రీజనల్ రింగు రోడ్డు తీసుకొస్తే.. కేసీఆర్ సర్కారు ఇంతవరకు గజం భూమి కూడా సేకరించి ఇవ్వలేదు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని వస్తేఈ కార్యక్రమాలకు హాజరు కానికేసీఆర్ కు.. ముఖ్యమంత్రిగా ఉండే నైతిక హక్కు కేసీఆర్ కు లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా? దీన్ని తెలంగాణ ప్రజలు అర్ధంచేసుకోవాలి.

మహిళా రిజర్వేషన్లపై బీఆర్ఎస్ పార్టీ మాట్లాడటం హాస్యాస్పదం. మొదటి ఐదేళ్లూ.. మహిళామంత్రి లేకుండా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు మహిళలపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. కొత్తగా ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఎందరు మహిళలున్నారో చెప్పాలి?
మోటార్లకు మీటర్లు పెడతామని మేమెన్నడూ చెప్పలేదు. పథకం ప్రకారం కేసీఆర్ కుటుంబం కుట్రలుపన్నుతోంది, తెలంగాణ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటుతోంది.

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి హైదరాబాద్ వేదికగా వ్యవసాయ మోటర్లకు మీటర్లుండవని స్పష్టంగా ఈ విషయం చెప్పినా.. మళ్లీ మళ్లీ దుష్ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ కు దమ్ముంటే అమరవీరుల దగ్గర చర్చకు వస్తే.. నేను మీ అందరిముందు చర్చకు సిద్ధం. ఈ 9 ఏండ్లలో తెలంగాణకోసం కేంద్రం ఏం చేసిందో చెబుతాను.. రాష్ట్రం ఏ చేసిందో ఆయన్ను చెప్పుమనండి. మీడియా ప్రతినిధుల సమక్షంలోనే చర్చించుకుందాం. కేసీఆర్ కు రాజకీయంపై తప్ప..ప్రజాసంక్షేమంపై ఏమాత్రం ఆసక్తి లేదు.

బండి సంజయ్ ఇంటిమీద మజ్లిస్ కార్యకర్తలు చేసిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ, వాళ్ల మిత్రులు కలిసి చేస్తున్న దుందుడుకు చర్యలకు, తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు. వీరు చేస్తున్న కుట్రలకు సమాజం మరింత ఏకమవుతుంది తప్ప.. భయపడదు. ఈ చర్యను పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలకు భయపడే వ్యక్తి కాదు బండి సంజయ్.. ఆయనకు మా అందరి అండా ఉంటుంది.

LEAVE A RESPONSE