Suryaa.co.in

Editorial

క్యాబినెట్ బెర్తు బాలినేనికేనా?

– మంత్రిమండలిలో ఇంకా ఒక స్థానం ఖాళీ
– బాలినేనికి ఎమ్మెల్సీ ఖరారు
– మండలి చైర్మన్‌కు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా
– ఇంకా వాటిని ఆమోదించని మండలి చైర్మన్
– జయమంగళ వెంకటరమణ స్థానం బాలినేనికే
– బాలినేనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి?
– మాట ఇచ్చిన పవన్ కల్యాణ్?
– చంద్రబాబుతో ఇప్పటికే పవన్ కల్యాణ్ భేటీ
– మండ లి చైర్మన్ నిర్ణయమే తరువాయి
– మండలి చైర్మన్ తాత్సారంపై గవర్నర్‌కు ఫిర్యాదు
( మార్తి సుబ్రహ్మణ్యం)

మాస్ లీడర్‌గా పేరున్న మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి ఖాళీగా ఉన్న మంత్రి పదవి ఇవ్వబోతున్నారా? దానికంటే ముందు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు రంగం సిద్ధమయిందా? జనసేన దళపతి-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ మేరకు బాలినేనికి నిర్దిష్ట హామీ ఇచ్చారా? నలుగురు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలపై మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవడమే ఇక త రువాయా? ఇదీ ఇప్పుడు కూటమి వర్గాల్లో జరుగుతున్న హాట్ టాపిక్.

ఉమ్మడి ప్రకాశం జిల్లా కేంద్రంగా రాయలసీమ, కోస్తా జిల్లాల రాజకీయాల్లో పట్టున్న మాస్ లీడర్-అజాతశత్రువుగా పేరున్న బాలినేని శ్రీనివాసరెడ్డిని, త్వరలో మంత్రి పదవి వరించబోతుందన్న చర్చకు తెరలేచింది. జయమంగళ వెంకట రమణ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఆయన రాజీనామా చేసిన స్థానాన్ని బాలినేనితో భర్తీ చేసి, తర్వాత బాలినేనిని క్యాబినెట్‌లో కూడా తీసుకునేందుకు రంగం సిద్ధమయినట్లు సమాచారం.

ఆ మేరకు గుడివాడలో షాడో ఎమ్మెల్యేగా ప్రచారంలో ఉన్న ఒక నాయకుడు.. ఇప్పటికే వెంకటరమణతో మాట ముచ్చట్లు పూర్తి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వెంకటరమణకు పార్టీలో గౌరవప్రద స్థానం ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు. వెంకటరమణ త్యాగానికి ఆమేరకు ‘తగిన ప్రతిఫలం’ లభించనుందన్నమాట. ఆ మేరకు గుడివాడ షాడో ఎమ్మెల్యే రంగం సిద్ధం చేసినట్లు, కృష్ణా జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

నిజానికి ఎన్నికలకు ముందే బాలినేనిని పార్టీలోకి రావాలని చంద్రబాబునాయుడు ఆహ్వానించారు. గెలిచిన తర్వాత మంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ చేశారు. కానీ చివరి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేని బాలినేని, అయిష్టంగానే వైసీపీ నుంచి ఒంగోలు అభ్యర్ధిగా పోటీ చేశారు. మాగుంటకు సీటు ఇవ్వకుండా చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఎంపీ సీటు ఇవ్వడం, జిల్లాలో తాను సూచించిన చంద్రశేఖర్‌కు తప్ప.. మిగిలిన వారికి తన అభీష్టానికి వ్యతిరేకంగా సీట్లు ఇవ్వడం, తన నియోజకవర్గంలో పేదలకు పట్టాల విషయంలో తాను ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు చివరి వరకూ చేసిన ప్రయత్నాలను జగన్-సీఎంఓ పట్టించుకోకపోవడంపై బాలినేని అప్పట్లోనే జగన్ వైఖరిపై అసంతృప్తితో ఉండేవారు.

తన సన్నిహితుడు మాజీ మంత్రి శిద్దా రాఘవరావుకు దర్శి సీటు సిఫార్సు చేసినా, జగన్ ఇవ్వకపోవడం కూడా బాలినేని అసంతృప్తికి మరో ప్రధాన కారణం. ఒంగోలు నగరంలో పట్టాలకు సంబంధించిన భూసేకరణ నిధులను, ఎన్నికల ముందు విడుదల చేసినా ఫలితం దక్కలేదు. పైగా తనను రాజకీయంగా అణచివేసేందుకు ప్రయత్నించే, వైవి సుబ్బారెడ్డిని జగన్ ప్రోత్సహించడం కూడా బాలినేనికి రుచించేది కాదు.

అయినా అన్నీ భరించి వైసీపీలో కొనసాగిన బాలినేని, ఆ ఎన్నికల్లో ఓడిపోవలసి వచ్చింది. మంత్రి పదవి తొలగించిన తర్వాత అనేకసార్లు జగన్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా లభించకపోవడంతో, విసిగి వేసారి హైదరాబాద్‌కు వెళ్లిపోయిన సందర్భాలు కోకొల్లలు. ఉమ్మడి
ప్రకాశం, గుంటూరు, కర్నూలు, కడప జిల్లాల్లో బాలినేని పరిచయాలు-ప్రభావం తె లిసిన సజ్జల-విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి, బాలినేనిని బుజ్జగించిన సంఘటలకు లెక్కేలేదు.

చివరకు విజయసాయిరెడ్డి చేతులెత్తేయడంతో, సజ్జల రంగంలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. కాగా విశాఖలో బాలినేనికి చెందిన క్వారీని ఎన్నికల ముందు తీసుకున్న జగన్, ఎంతకూ దానికి సంబంధించి డబ్బులు ఇవ్వకపోవడం.. ఎన్నికల తర్వాత జగన్‌తో భేటీ అయిన సందర్భంలో.. ‘నేనే నష్టాల్లో ఉన్నా.అప్పుల పాలయ్యా. నా దగ్గర డబ్బులు లేవ’న్న జగన్ మాటలు, బాలినేనిని మసస్తాపానికి, ఆగ్రహానికి గురి చేసింది.

నిజానికి అంతకుముందే బాలినేని ఎన్నికలకు భారీ స్థాయిలో అప్పుచేశారని, ఆ క్రమంలో హైదరాబాద్‌లో ఆస్తి కూడా అమ్మేసినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాతనే ఆయన జనసేనలో చేరేందుకు మానసికంగా సిద్దమయ్యారు. జగన్ తనకు న్యాయంగా ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా మోసం చేయడాన్ని, ఆయన బంధువు కూడా అయిన బాలినేని, జీర్ణించుకోలేకపోయారన్నది ఆయన అనుచరుల వాదన.

ఒకదశలో మామా అల్లుళ్లకు ఇవన్నీ అలవాటేనని, బాలినేని బె దిరించడం-జగన్ తన వారితో ఆయనను బుజ్జగింపచేయడం మామూలేనన్న మాట కూడా అప్పట్లో బాగా వినిపించేది. అందువల్ల బాలినేని పార్టీ మారబోరన్న ధీమా ఉండేది. ఎప్పుడైతే తాను కూడా అప్పులపాలయ్యా. నా దగ్గర డబ్బుల్లేవని జగన్ జవాబు ఇచ్చారో, అప్పుడే పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు బాలినేని అనుచరులు చెబుతున్నారు.

తర్వాత జనసేనాధిపతి పవన్‌తో భేటీ అయిన సందర్భంలోనే మంత్రి పదవి హామీ ఇచ్చారని, పార్టీలో మీకు తగిన గౌరవం ఇస్తానని, మీ గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లనివ్వనని భరోసా ఇచ్చినట్లు సమాచారం. అందుకు తగినట్లుగానే రాజీనామా చేసిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ స్థానంలో.. బాలినేనికి ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి కూడా ఇప్పించేందుకు పవన్ కల్యాణ్ చిత్తశుద్ధితో ప్రయత్నించడం విశేషం. కాగా ప్రస్తుతం క్యాబినెట్‌లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. సో..దానిని బాలినేనితో భర్తీ చేయనున్నట్లు స్పష్టమవుతోంది. బాలినేని జనసేనలో చేరిన తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ బాగా బలపడింది. ఇక ఆయన మంత్రి పదవి ఇస్తే, వైసీపీలోని చాలామంది మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరడం ఖాయం.

అయితే శాసనమండలి చైర్మన్ మోషెన్‌రాజు, తన వద్దకు వచ్చిన ఎమ్మెల్సీల రాజీనామా లేఖను ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేసి, స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖలు సమర్పించారు. ఇప్పటివరకూ చైర్మన్ వాటిని ఆమోదించకుండా, తాత్సారం చేయడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి రాజీనామా లేఖలు ఇచ్చిన ఎమ్మెల్సీలు.. గవర్నర్‌ను కలిసి మండలి చైర్మన్‌పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

వైసీపీ ఎమ్మెల్సీలయిన పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణచక్రవర్తి తమ పదవులకు స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖలు సమర్పించారు. అయితే ఇప్పటివరకూ మండలి చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారు. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ ఒత్తిళ్లు ఉన్నట్లు పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మండలి చైర్మన్ మోషెన్‌రాజు కూడా, వైసీపీ హయాంలోనే చైర్మన్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే.

నిజానికి రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీల త్యాగానికి తగిన ప్రతిఫలం దక్కేలా ఏర్పాట్లు చేశారని, అందువల్ల వారు కూడా రాజీనామా చేసేందుకు సుముఖంగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాల వ్యవహారంలో కూడా త్యాగధనులకు ‘తగిన ప్రతిఫలం’ దక్కేలా చూస్తున్నట్లు చెబుతున్నారు. ఒక్క బీద మస్తాన్‌రావు మాత్రం, తనకు తిరిగి ఎంపీ ఇవ్వాలన్న షరతుతోనే రాజీనామా చేశారంటున్నారు. మోపిదేవి వెంకటరమణ మాత్రం తనకు ఎమ్మెల్సీ ఇచ్చి, వచ్చే ఎన్నికల్లో రేపల్లె టీడీపీ సీటు ఇచ్చే ఒప్పందంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారంటున్నారు.

LEAVE A RESPONSE