– నెల్లూరు ప్రతిష్టను దిగజార్చిన కూటమి ప్రభుత్వం
– ఒడిషా నుంచి షిప్లో ఏపీ గంజాయి సరఫరా
– అక్కడి నుంచి బైక్స్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో రవాణా
– మూడు అంచెల్లో గంజాయి సరఫరా
– నెల్లూరులోని వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
నెల్లూరు: నెల్లూరు ప్రతిష్టను టీడీపీ కూటమి ప్రభుత్వం దారుణంగా దిగజార్చిందని, ఒకప్పుడు నిజాయితీకి నగరంగా పేరు పొందిన నెల్లూరు ఇప్పుడు నార్కొటిక్స్ హబ్‌గా మారిందని వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాకే నెల్లూరు పరిస్థితి మారిందన్న ఆయన, హత్యలు, దోపిడిలు, గంజాయి సంస్కృతి పెరగడమే కాకుండా.. జైళ్ల నుంచే గంజాయి, రౌడీయిజం ఆపరేషన్లు కొనసాగుతున్నాయని తెలిపారు. నెల్లూరులో బైక్స్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ద్వారా యథేచ్ఛగా గంజాయి రవాణా చేస్తున్నారని, చివరకు రూ.300కు పీకలు కోసే విష సంస్కృతి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.
మూడంచెల పద్ధతిలో గంజాయి సరఫరా అవుతుంటే, దాన్ని నియంత్రించడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నాయకులపై అక్రమంగా గంజాయి కేసులు పెడుతూ కూటమి ప్రభుత్వం కొత్త సాంప్రదాయానికి తెర లేపిందని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ఆక్షేపించారు. ఒడిషా నుంచి 2.25 కేజీల గంజాయితో ఒక పార్సిల్ తయారు చేసి రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్ముతున్నారు. ఈ సరఫరా వ్యవస్థలో నెల్లూరులో 30 మంది సప్లయర్స్, వారి కింద 300 మంది డెలివరీ బాయ్స్ ఉండగా, వారిలో చాలామంది డిగ్రీ చదివిన యువత ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
ఒక్కో ప్యాకెట్ మీద రూ.50 కమీషన్ ద్వారా వారు రోజుకి రూ.500 వరకు సంపాదిస్తూ, గంజాయి వ్యసనానికి లోనవుతున్నారు. గంజాయి వ్యసనానికి 6 వేల మంది యువకులు బానిసలు కావడం, పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నెల్లూరులో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా మంత్రి పి.నారాయణ కేవలం పెన్షన్ పంపిణీల్లోనే కనిపిస్తున్నాడు. నేను 24 గంటల్లో ఇన్ని వివరాలు సాధించగలిగితే, మంత్రికి ఎంత సమాచారం ఉంటుందో.. ఒక్కసారి అందరూ ఆలోచించాలి. అయినా ఆయన ఈ విషయంలో ఎందుకంత సీరియస్‌గా లేరు? నెల్లూరులో గంజాయి నివారించాలని మంత్రి అనుకోవడం లేదా?. డెలివరీ బాయ్స్‌ను పట్టుకుంటే గంజాయి ఛెయిన్ పూర్తిగా బయటపడుతుంది.
.