– ఇంటర్ ఫలితాలకు ఆదిమూలపు సురేష్, జగన్ రెడ్డిలు బాధ్యత వహించాలి
– కొండేపి శాసనసభ్యులు డోల బాల వీరాంజనేయస్వామి
ఇంటర్ ఫలితాల విడుదలతో లక్షల మంది తల్లిదండ్రులు కడుపుకోతకు గురయ్యారు. ఎంసెట్ రాసి ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వాలన్న విద్యార్ధుల కలలను జగన్ రెడ్డి నీరుగార్చారు. గతంలో టీడీపీ హయాంలో 2018-19లో ఇంటర్ మొదటి సంవత్సరం 60 శాతం ఉత్తీర్ణత ఉంటే నేడు 54 శాతానికి పడిపోయింది. అదే విధంగా రెండో సంవత్సరం 2018-19లో 68 శాతం ఉంటే నేడు 61 శాతానికి పడిపోయింది. మొన్న పదవ తరగతి ఫలితాలు కూడా 2018-19లో 93 శాతం నుంచి 67 శాతానికి దిగజార్చారు. కరోనాను బూచిగా చూపించి విద్యార్ధుల ఫలితాలను కరోనాపై నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కేరళ, తమిళనాడు లో 90 శాతం ఇంటర్ లో ఉత్తీర్ణులయ్యారు. అక్కడ కూడా కరోనా ఉన్నప్పుడు ఫలితాలు అక్కడ ఎందుకు గొప్పగా వచ్చాయి. కారణం జగన్ రెడ్డి చేతగాని పాలన అని అర్ధమయ్యింది.
ఆదిమూలపు సురేష్ విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సొంత విద్యా సంస్థల అభివృద్ధి, భూముల ఆక్రమణ కోసం పాటుపడ్డారు తప్పా రాష్ట్ర విద్యా వ్యవస్థ కోసం కాదు. ఈ ఫలితాల మీద ఆదిమూలపు సురేష్, జగన్ రెడ్డి బాధ్యత వహించాలి. నాడు నేడు పేరుతో రంగులు మార్చుకొని రూ.3,500 కోట్లు దోచుకున్నారు. టీడీపీ హాయంలో రెండు సార్లు డీఎస్సీ జరిపితే జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలో ఒక్కసారైనా డీస్సీని నిర్వహించారా? లెక్చరర్ల పోస్టులను సైతం పట్టించుకోలేదు. భూములను కొట్టేసేందుకు కుట్రపన్ని ఎయిడెడ్ విద్యావ్యవస్థను బ్రష్టుపట్టించారు. ఉపాధ్యాయ బదిలీల్లోను అవకతవకలు జరిగాయని ప్రశ్నించినందుకు వారిపై పోలీసులపై దాడి చేయించారు. ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురి చేశారు.
పీఆర్సీ, సీపీఎస్ విషయాల్లోను ఉపాధ్యాయాలను మోసం చేశారు. ఉపాద్యాయులను వైన్ షాపుల దగ్గర ఉంచారు. అదే విధంగా ఉపాధ్యాయులచే బాత్ రూంలు కడిగించి ఫోటోలు అప్ లోడ్ చేయిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఇంటర్ విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం పెడితే జగన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయడం ఈ ఫలితాలకు పరోక్ష కారణం. టీచర్లకు నాణ్యమైన శిక్షణ ఇవ్వలేదు. ఇంటర్ లో విద్యార్ధులు అత్యధికంగా ఫెయిల్ అయితే అమ్మ ఒడి, ఫీజ్ రీయంబర్స్ మెంట్ లబ్దిదారులను తగ్గించే కుట్రలో భాగంగానే విద్యార్ధులను ఉత్తీర్ణులు కాకుండా చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆర్ధిక వ్యవస్థ కుంటుపడి ఖజానా ఖాళీ అయ్యింది కాబట్టి ఇలాంటి కుట్రలకు పాల్పడి విద్యార్ధుల భవిష్యత్ ను అంథకారంలోకి నెడుతున్నారు. పరీక్షల సమయంలో కరెంట్ కోతలకు గురి చేశారు.