Suryaa.co.in

Andhra Pradesh

ఎంవివి సత్యనారాయణ… ఎవరి ట్రాప్ లో పడొద్దు

-ఆయనంటే ప్రస్తుతం గౌరవం లేకపోయినా, కోపమయితే లేదు
-నన్ను అసభ్య పదజాలంతో తిట్టించడం వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది
-ఆయన్ని ఖర్చు రాసి నా అకౌంట్ లో వేస్తారేమోనన్నదే నా అనుమానం
-గతంలోనూ ఒక ఎంపీ చేత ఇలాగే తిట్టించారు… నేను హెచ్చరించడం వల్లే ఆయనకు ప్రాణాపాయం తప్పింది
-నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణంరాజు

విశాఖపట్నం ఎంపీ ఎం వివి సత్యనారాయణ ఎవరి కుట్రలోనూ భాగస్వామి కావద్దు… ప్రస్తుతం ఆయన అంటే గౌరవం లేకపోయినా కోపమయితే లేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. గురువారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై, వాయిదా పడిన అనంతరం సెంట్రల్ హాల్లో సహచర ఎంపీలకు నేను తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అందజేస్తుండగా, అక్కడికి చేరుకున్న విశాఖపట్నం ఎంపీ ఎం వివి సత్యనారాయణ, నన్ను తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారు.

గురువారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అరవింద్ సావంత్, అనిల్ దేశాయి తో పాటు మరికొంతమంది సహచర ఎంపీలతో కలిసి ఉన్న నా వద్దకు సత్యనారాయణ వచ్చి… నా కుటుంబ సభ్యుల అపహరణను నాటకమని అంటావా?, నా భార్య గురించి మాట్లాడుతావా??, నిన్ను లేపించి వేస్తాను అంటూ నోటికొచ్చినట్లు బండ బూతులు తిట్టాడు. గతంలోనూ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఇలాగే నన్ను అసభ్య పదజాలంతో దూషించాడు .

ఆ విషయాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకు వెళ్ళాను. అయినా, గోరంట్ల మాధవ్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా చర్యలు తీసుకుంటారా? లేదా?? అన్నది తెలియక పోయినప్పటికీ, నేను ఈ సంఘటనను వివరిస్తూ స్పీకర్ కు ఫిర్యాదు చేశాను. ఎంపీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను అపహరించడం వెనుక కుట్ర కోణం ఉందని, ఇది కేవలం డబ్బుల కోసం జరిగిన కిడ్నాప్ కాదని పేర్కొంటూ, ఆయనకు బలం చేకూరే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అదే నెల 17వ తేదీన లేఖ రాయడం జరిగింది.

కిడ్నాప్ వెనుకనున్న కుట్ర కోణాన్ని చేదించాలని కోరుతూ, సత్యనారాయణ మంచి కోరే నేను లేఖ రాశాను. నేను రాసిన లేఖ అందినట్లుగా పేర్కొంటూ, అదే నెల 26వ తేదీన ప్రధానమంత్రి స్వయంగా సంతకం చేస్తూ లేఖ రాశారు. అలాగే ఈ సంఘటనపై ఎన్ఐఏ చేత సమగ్ర దర్యాప్తు జరిపించనున్నట్లుగా హోం మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ఎం వి వి సత్యనారాయణ కుటుంబ సభ్యుల అపహరణ గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. ప్రభుత్వంలో పెద్ద పదవిలో ఉన్న ఒకరు ఆస్తులు రాయించుకోవడం కోసమే ఇలా చేశారని చెప్పుకున్నారు .

అధికార పార్టీ ఎంపీ కొడుకును కిడ్నాప్ చేసి భార్యను పిలిపించుకొని ఆమె ద్వారా ఫోన్ చేయించి ఆడిటర్ ను పిలిపించుకోవడం అన్నది జరగదని నేను భావించాను. అదే విషయాన్ని చెప్పాను. ఏదో డబ్బుల కోసమే జరిగిన కిడ్నాప్ అయితే, విశాఖపట్నం నివాసయోగ్యం కాదని… నేనిక్కడ ఇక వ్యాపారాలు చేయదలుచుకోలేదని సత్యనారాయణ మీడియా ముందు ఎందుకు చెప్పారు. అంటే కిడ్నాప్ అనేది వ్యాపార లావాదేవీలకు సంబంధించిన జరిగినట్టు ఆయన తన మాటలతో చెప్పకనే చెప్పినట్లుయింది.

కిడ్నాప్ వ్యవహారంలో చెప్పుకోలేని బాధను ఏదో ఆయన అనుభవిస్తున్నారని, నాకు పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాశాను. పుణ్యానికి వెళ్తే పాపం ఎదురైనట్లుగా , ఆయన మంచి కోసం నేను కృషి చేస్తే… నన్ను అసభ్య పదజాలంతో దూషించడం ఎంతవరకు సబబు?!. కిడ్నాప్ వెనకనున్న సూత్రధారులు, పాత్రధారి ద్వారా మాట్లాడించారా? అన్న అనుమానం కలుగుతోంది. కిడ్నాప్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన హేమంత్ అనే రౌడీషీటర్ ప్రతిరోజు మాదిరిగానే పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం చేయడని ఎంపీ కుమారుడు చెప్పగానే, పోలీసులు అంగీకరించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఎంపీ ఫిర్యాదు చేసిన రెండు గంటల వ్యవధిలోనే పోలీసులు కిడ్నాప్ వ్యవహారాన్ని చేదించారని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. కిడ్నాప్ వ్యవహారంపై నేను మాట్లాడిన దానిపై మనసు నొచ్చుకొని ఉంటే సత్యనారాయణ నేరుగా నాతో మాట్లాడవచ్చు. అయినా ఆయన చెబుతున్నట్లుగా నేను ఆయన భార్య గురించి మాట్లాడింది లేదు.

అయినా కూడా బండ బూతులు తిడుతూ, నిన్ను చంపిస్తాను… లేపేస్తాను… ఎవడు అడ్డం వస్తాడో చూస్తానని అనడం విడ్డూరంగా ఉంది. ఈ సంఘటన జరుగుతుండగా అక్కడే ఉన్న మా పార్టీ ఎంపీలు ప్రేక్షక పాత్ర వహించారు. సత్యనారాయణ నోరు పారేసుకున్నంతసేపు వేడుక చూసి, ఆ తరువాత ఆయన్ని అక్కడనుండి తీసుకువెళ్లారు.

నాతో పాటు సెంట్రల్ హాల్లో ఉన్న శివసేన ఎంపీలు అడ్డుకునే ప్రయత్నాన్ని చేశారు. కిడ్నాప్ చేయించిన వారు, చేసిన హేమంత్ మీరు, మీరు చూసుకోవాలి. నాపై సత్యనారాయణ రుబాబు ఏమిటి?!. నేను కూడా ఆయన మాదిరిగానే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నోరు పారేసుకోవచ్చు. ఒకవేళ ఆయన చేయి చేసుకుంటే, నేను చేసుకోవచ్చు. కానీ ఒక పార్లమెంటు సభ్యుడిగా హుందగా వ్యవహరించాను. అసభ్య పదజాలంతో దూషించడం, సభ్యత సంస్కారం లేకుండా వ్యవహరించడమనేది మా పార్టీ కొనుగోలు చేసిన వ్యక్తి నుండి నేర్చుకున్న సంస్కారం కాబోలు.

ఎం వి వి సత్యనారాయణ నన్ను వ్యక్తిగతంగా దూషించినంతమాత్రాన, నాకేమీ భయం లేదు. గతంలో నన్ను అపహరించి, లాకప్ లో చిత్రహింసలకు గురిచేసి హత్య చేయాలని చూశారు. నన్ను చిత్రహింసలకు గురిచేసిన సంఘటనను వీడియో ద్వారా వీక్షించి ఆనందించారు. గతంలో సహచర పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ తో నన్ను తిట్టించినప్పుడు, వారి కుట్ర కోణాన్ని నేను బయట పెట్టడం వల్లే ఆయన ప్రాణాలతో మిగిలి ఉన్నారు. ఇప్పుడు కూడా అటువంటి ట్రిక్కులే చేస్తున్నారా?

స్వతహాగానే సత్యనారాయణ మాట్లాడారా?, తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకే మాట్లాడారా?? అన్నది తెలియాల్సి ఉంది. హైదరాబాదులో సత్యనారాయణ ఎవరెవరితో సమావేశమయ్యారన్న విషయాలు ఎన్ఐఏ విచారణలో వెలుగు చూస్తాయని భావించి, ఇలా మాట్లాడించారా? అని రఘురామకృష్ణం రాజు అనుమానం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా నాకు వచ్చిన ముప్పేమీ లేదు. సత్యనారాయణ ను ఖర్చు రాసి నా అకౌంట్ లో వేస్తారేమో నన్నది నా అనుమానం. సత్యనారాయణకు ఏమైనా జరిగితే దానికి జగన్మోహన్ రెడ్డి పూర్తి బాధ్యులవుతారు.

సత్యనారాయణ తన జాగ్రత్తలు తాను ఉండాలి. సత్యనారాయణ ఎవరు చేతిలోనో కీలుబొమ్మగా మారి మాట్లాడుతున్నారు. నేను ఆయన మంచి కోరి లేఖ రాయడమే తప్పా?!. కిడ్నాప్ సంఘటనతో దెబ్బతిని ఉన్న సత్యనారాయణ అపార్థం చేసుకోవడంలో ఎంతో కొంత అర్థం ఉంది. ఆయన్ని నేను మన్నించగలను.

ఎవరో తిట్టిస్తే ఆ తిట్ల వెనుక కుట్ర కోణం ఉందని ఆయన గమనించాలి. సినిమా ప్రొడ్యూసర్, నటుడు, విశాఖపట్నం నగరంలో పెద్ద బిల్డర్ అయినా సత్యనారాయణ ఈ విషయాన్ని గ్రహిస్తే మంచిది. ఒక పార్లమెంట్ సభ్యుడిగా నోరు అదుపులో పెట్టుకుంటే ఆయన కు గౌరవం ఉంటుందని రఘురామకృష్ణం రాజు సూచించారు.

LEAVE A RESPONSE