-అమరావతి బహుజన జెఎసిఅధ్యక్షులు పోతుల బాలకోటయ్య
ప్రజా రాజధాని అమరావతి మహాపాదయాత్ర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు, సిఆర్డీఎ రద్దు బిల్లును శాసనసభలో వెనక్కి తీసుకుంటూ మరోమారు మూడు రాజధానుల బిల్లును పెట్టబోతున్న ట్లు ప్రకటించటం హాస్యాస్పదం గా ఉందని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు జిల్లా వెంగమాంబ పురం, బంగారురాజు పల్లి, వెంకటగిరి లో జరిగిన మహా పాదయాత్ర లో పాల్గొని ప్రసంగించారు. రెండేళ్ల తర్వాత ప్రవేశపెట్టిన మూడు రాజధానులు బిల్లు సమగ్రంగా లేదని,రాజధానిలో భాగస్వాములైన రైతులతో చర్చించలేదని, ప్రభుత్వమే తనకు తాను మూడు రాజధానులు బిల్లును వెనక్కి తీసుకోవడం శుభ సూచిక మన్నారు. అయితే మళ్ళీ సమగ్రమైన మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు.
దేవాలయం లాంటి అసెంబ్లీలో వెనక్కి తీసుకున్న మూడు రాజధానులు బిల్లు పైన ముఖ్యమంత్రి కట్టుబడి ఉండాలని, మరో బిల్లు పెట్టొద్దని ఆయన పేర్కొన్నారు.ఇప్పటికే రాష్ట్రానికి రాజధాని లేఖ రెండున్నరేళ్లు గడిచిపోయిందని, రాజధానిని వివాదాస్పదంగా మార్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన ఆరోపించారు . ప్రధాని మోడీ ఏకవాక్య తీర్మానం తో మూడు వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో వెనక్కి తీసుకున్న రీతిలో ముఖ్యమంత్రి కూడా హుందాగా వ్యవహరించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు . ఇప్పటికైనా రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి స్వయంగా స్పష్టమైన ప్రకటన చేయాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.