Suryaa.co.in

Andhra Pradesh Telangana

కేటీఆర్‌ వ్యాఖ్యలను రాజకీయం చేయదల్చుకోలేదు: సజ్జల

– కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల
– తెలంగాణలో త్వరలో ఎన్నికలు వస్తున్నందునే.. : పెద్దిరెడ్డి
– కేటీఆర్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి: మంత్రి బొత్స

ఏపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. కేటీఆర్‌ అయినా.. ఎవరైనా ముందు వాళ్ల రాష్ట్రం గురించి మాట్లాడాలి.. ఆ తర్వాతే ఇతరుల గురించి మాట్లాడాలని సూచించారు. అయితే.. కేటీఆర్‌ వ్యాఖ్యలను రాజకీయం చేయదల్చుకోలేదని సజ్జల చెప్పారు.
రాష్ట్రంలో రోడ్లు, నీరు, కరెంట్ లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. ‘కేటీఆర్‌ అయినా, ఎవరైనా ముందు వాళ్ల రాష్ట్రం గురించి మాట్లాడాలి.. ఆ తర్వాతే ఇతరుల గురించి మాట్లాడాలి. రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తిగా జరగలేదు. సుమారు రూ.50-60వేల కోట్ల ఆస్తుల విభజన జరగాల్సి ఉంది. ఏపీకి కేపిటల్‌ లేకుండానే విభజన చేశారు. విభజన తర్వాత ఐదేళ్లపాటు అభివృద్ధి జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌లో పీవీ ఎక్స్‌ప్రెస్‌వే వైఎస్‌ హయాంలో చేపట్టారు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో వాళ్లకూ మనకూ అందరికీ తెలుసు. అధిక వర్షాల వల్లే రోడ్లు దెబ్బతిన్నాయి. కేటీఆర్‌ వ్యాఖ్యలను రాజకీయం చేయదల్చుకోలేదు. తెలంగాణలోనూ రోడ్లు బాగాలేవు. మొన్నటి వరకు తెలంగాణలో విద్యుత్‌ కోతలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. సీఎం జగన్‌ పాలనలో తన మార్కును చూపిస్తున్నారు. దిశ చట్టంపై విమర్శలు చేస్తోన్న వారికి.. కోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది’ అని సజ్జల వివరించారు.

రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్‌ వ్యాఖ్యలు: పెద్దిరెడ్డి
అమరావతి:తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా విద్యుత్‌ కోతలు లేవని స్పష్టం చేశారు. ఎక్కడైనా సాంకేతిక సమస్య వస్తే పావుగంట పాటు అంతరాయం కలుగుతోందన్నారు. రైతులకు 7 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు వివరించారు.మరోవైపు బొగ్గును కూడా అధికంగా కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణలో త్వరలో ఎన్నికలు వస్తున్నందునే.. రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్‌ ఏపీపై వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు.

కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: మంత్రి బొత్స
కేటీఆర్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. నేను హైదరాబాద్‌ వెళ్లి స్వయంగా ఉండి వస్తున్నా. హైదరాబాద్‌లో అసలు కరెంటే ఉండటం లేదు. నేను జనరేటర్ వేసుకుని అక్కడ ఉండి వచ్చా. కేటీఆర్‌కు ఎవరో ఫోన్ చేసి చెప్పారు.. నేను స్వయంగా అనుభవించి వచ్చా. బాధ్యత కలిగిన వ్యక్తి అలా మాట్లాడటం తప్పు.తమ ఘనత ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు. ఎదుటి వారి గురించి ఇలా మాట్లాడకూడదు.

LEAVE A RESPONSE