– ఆదిమూలం నుంచి అరవ శ్రీధర్ వరకు మహిళలపై అఘాయిత్యాలు పరిపాటుగా మారాయి
– జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేతిలో బాధిత మహిళ స్వయంగా సీఎంకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు
– ఒక మహిళ తనకు జరిగిన అఘాయిత్యాన్ని సాక్షాదారాలతో చూపినా హోంశాఖ స్పందించదా?
– హోంశాఖను “వర్క్ ఫ్రమ్ హోం” శాఖగా మార్చారు
– మహిళపై అన్యాయం జరిగితే ప్రెస్ మీట్లు పెట్టి తిట్టించడం దుర్మార్గం
– కాలయాపన కోసమే జనసేన త్రీమెన్ కమిటీ ఏర్పాటు
– ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలి
యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
తాడేపల్లి: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైయస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా మండిపడ్డారు. రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన మహిళకు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేతిలో జరిగిన అన్యాయంపై స్వయంగా బాధితురాలే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు.
ఒక మహిళ మీ వద్దకు వచ్చి… మీ ఎమ్మెల్యే నన్ను వేధిస్తున్నాడు, న్యాయం చేయండి అని మొరపెట్టుకుంటే కూడా స్పందించరా? రైల్వే కోడురు బాధిత మహిళ చేసిన ఆరోపణలు జుగుప్సాకరం. హోంశాఖను ‘వర్క్ ఫ్రమ్ హోం’ శాఖగా మార్చేశారు, హోం మంత్రి పోలీస్ వ్యవస్థను పాతాళానికి తొక్కేశారు.
సంక్రాంతి సందర్భంగా నారా వారి పల్లెలో ముఖ్యమంత్రికి బాధిత మహిళ స్వయంగా వెళ్లి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఒక వివాహిత మహిళ జీవితానికి సంబంధించిన వ్యవహారంలో ముఖ్యమంత్రి ఇలాగేనా వ్యవహరించేది. రైల్వే కోడూరులో బాధిత మహిళపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?.
బాధిత మహిళ గోడు వెళ్లబోసుకుంటే మాటల దాడులు చేయిస్తారా? ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిస్తారా? అరవ శ్రీధర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరిగినా పట్టించుకోని దద్దమ్మ ప్రభుత్వం ఇది. సుగాలి ప్రీతికి జరిగిన ఘోరం, ఇవాళ రైల్వే కోడూరులో మహిళకు జరిగింది. బాధితురాలికి న్యాయం చేయాల్సిందే.బాధిత మహిళకు వైయస్సార్సీపీ అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదుకోకపోతే ప్రతిపక్షంగా మేమే ఆమెకు అండగా నిలుస్తాం” అని తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రైల్వే కోడూరు ఘటనపై తక్షణమే చర్యలు తీసుకుని బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.