– మాట వినని సంగారెడ్డి కలెక్టర్
– ఇళ్ల కేటాయింపులో ఆమెదే ఇష్టారాజ్యం
– – ఎమ్మెల్యే కోటా ఎక్కడుందో చూపాలన్న కలెక్టర్
– జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ చెప్పారన్నా పట్టించుకోని కలెక్టర్
– శివమెత్తిన ఎమ్మెల్యే మాణిక్‌రావు
సంగారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు విషయంలో కలెక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కోటా కింద 40 శాతం ఇళ్లు కేటాయించాలని ఇటీవల కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశానని, అయితే.. ఎమ్మెల్యేల కోటాపై జీవో ఎక్కడ ఉందని తనను కలెక్టర్ ప్రశ్నించడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి లేఖ ఇచ్చినా కలెక్టర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జహీరాబాద్ నియోజకవర్గంలో తాను సూచించిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయలేదని మాణిక్ రావు ఆరోపించారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాణిక్ రావు, చింతా ప్రభాకర్‌లు జిల్లా ఆడిషినల్ కలెక్టర్ చంద్రశేఖర్‌ను బుధవారం కలిశారు. ఇందిరమ్మ ఇళ్ల సమస్యను ఆడిషినల్ కలెక్టర్‌కు వివరించే సమయంలో, స్వల్ప వాగ్వాదం చోటుచేసుకున్న సందర్భంలో ప్రజాప్రతినిధులంటే అధికారులకు లెక్కలేనట్లు ఉందని, ఇది ప్రజలను అవమానించడమేనంటూ వారు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.