– కైకలూరును కృష్ణాలో విలీనం చేయాలని డిమాండ్
– పెదపాలపర్రు, కోడూరు గ్రామాల ఇబ్బందులపై సిఎం సమీక్షించాలని వినతి
కైకలూరు: వైసీపీ ప్రభుత్వ కాలం నాటి జిల్లాల పునర్ విభజన పరంగా ఏర్పడిన సమస్యలు తాజా పునర్ విభజన ప్రక్రియలోనూ పరిష్కారం కాకపోవటంతో, ముదినేపల్లి మండలం పెదపాలపర్రు, కోడూరు గ్రామాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ప్రముఖులు కృషి చేయాలని , సీఎం స్వయంగా వాస్తవ పరిస్థితులను సమీక్షించాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. వైసీపీ చేపట్టిన అస్తవ్యస్థ పునర్ వ్యవస్థీకరణ ఫలితంగా అప్పటి వరకు కృష్ణ జిల్లాలో ఉన్న కైకలూరు నియోజకవర్గం ఏలూరు జిల్లాలో చేరింది. అది సరైన నిర్ణయం కాదని నియోజక వర్గం ప్రజలు నెత్తి నోరు బాదుకున్న ఫలితం లేకపోయింది.
ఎన్నికల సమయంలో చంద్ర బాబు నాయుడు తిరిగి కైకలూరును కృష్ణా జిల్లాలో విలీనం చేస్తామని గట్టి హామీ ఇవ్వడంతో సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంతా భావించారు. తర్వాత ప్రభుత్వం మారింది. మంచి ప్రభుత్వ పాలనలో తప్పక మంచి రోజులు వస్తాయని భావించారు. కైకలూరు శాసన సభ్యుడు కామినేని శ్రీనివాస్ సైతం ఈ విషయంపై మంత్రి వర్గ ఉపసంఘానికి లేఖ రాశారు. మంత్రి వర్గం సైతం ఈ ప్రతిపాదనను ఆమోదించింది. కానీ ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా మంగళ వారం సీఎం దగ్గర జరిగిన చర్చలలో ఈ అంశాన్ని పక్కన పెట్టేసారు.
గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల మార్పు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కైకలూరు విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ తమ నియోజక వర్గాన్ని కృష్ణాలో విలీనం చేయాలని కోరినా పాలకుల చెవికెక్కలేదు. ఇక్కడ కైకలూరు నియోజక వర్గ స్థాయి వ్యవహారం ఒక ఎత్తు కాగా, ఈ నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలం పెదపాలపర్రు, కోడూరు గ్రామాల ఇబ్బందులు వర్ణాతీతమనే చెప్పాలి. కైకలూరు నియోజకవర్గంను కృష్ణా జిల్లాలో కలిపేందుకు అడుగు పడని తాజా పరిస్థితులలో, కనీసం ఈ రెండు గ్రామాలను ప్రజా సౌలభ్యం దృష్ట్యా గుడివాడ రూరల్ మండలంలో కలిపి, కృష్ణా జిల్లాలో కొనసాగించాలని గ్రామస్ధులు డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నాటి పునర్ వ్యవస్థీకరణ ఫలితంగా ఈ గ్రామాలు పరిపాలనా సౌలభ్య రహితంగా మారిపోయాయి. పెదపాలపర్రు, కోడూరు గ్రామాలకు నాటి రెవిన్యూ డివిజన్ కేంద్రం గుడివాడ ఐదు నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం మచిలీపట్నం 30 కిలోమీటర్ల దూరంలో ఉండేది. కైకలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ గ్రామాలను ఏలూరు జిల్లాకు మార్చటం వల్ల రెవిన్యూ డివిజన్ కేంద్రం, జిల్లా కేంద్రం దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏలూరుకు మారిపోయ్యాయి. నిజానికి రెండు దశాబ్దాల క్రితం జరిగిన మండలాల పునర్ విభజన అనాలోచితంగా, అసమగ్రంగా సాగింది.
గుడివాడకు అతి సమీపంలో ఉన్న పెదపాలపర్రు, కోడూరు గ్రామాలను గుడివాడ రూరల్ మండలంలో కాక, ముదినేపల్లిలో చేర్చారు. పెదపాలపర్రు సరిహద్దులు పంచుకున్న మోటూరు, కల్వపూడి అగ్రహారం, పర్నాస గ్రామాలు గుడివాడ రూరల్ మండలంలో ఉన్నాయు. గుడివాడ నుండి ముదినేపల్లి మార్గంలో జాతీయ రహదారి వెంబడి ప్రయాణం ప్రారంభిస్తే పెదపాలపర్రు గ్రామం ముందుగా వస్తుంది. తరువాత గుడివాడ పట్టణానికి దూరంగా ఉన్న కల్వపూడి అగ్రహారం, పర్నాస గ్రామాలు వస్తాయి. కానీ ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏమిటంటే గుడివాడకు అతి సమీపంలో ఉన్న పెదపాలపర్రు గ్రామం ముదినేపల్లి మండలంలోనూ, దూరంగా ఉన్న గ్రామాలు గుడివాడ రూరల్ మండలంలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో మరెక్కడా ఉండక పోవచ్చు.
ఈ ప్రత్యేక సమస్యను ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం పరిష్కరించ వలసిన అవసరం ఉంది. ఈ గ్రామాలను దత్తత తీసుకున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు శాఖలు గుడివాడ పట్టణంలోనూ, గుడివాడ రూరల్ మండలం మోటూరులో ఉన్నాయి. ఈ గ్రామాలకు చెందిన రైతుల బ్యాంకు ఖాతాలు పూర్తిగా గుడివాడ పట్టణంలోని కెడిసిసిబి బ్యాంకులో ఉండగా, సబ్ రిజిస్టార్ కార్యాలయం సైతం గుడివాడే కేటాయించబడి ఉంది. గ్రామస్డుల వైద్య అవసరాలకు సైతం 5 కిలోమీటర్ల దూరంలో గుడివాడే కీలకం. గ్రామస్ధులకు గుడివాడ రూరల్ మండలం దొండపాడు, పాత చవటపల్లి , మోటూరు, గుడ్లవల్లేరు మండలం చంద్రాల, విన్నకోట గ్రామాలలో సైతం వ్యవసాయ భూములు ఉండగా, వైసీపీ ప్రభుత్వం చేసిన జిల్లా మార్పు ఫలితంగా ఆస్తులు ఒక జిల్లాలో నివాసం మరోక జిల్లాలో అన్న చందంగా మారింది. ఏలూరు జిల్లాలో గ్రామస్డులు నివాసం కాగా, పిల్లలు కృష్ణా జిల్లా గుడివాడలో విద్యాభ్యాసం చేస్తారు.
వారి ధృవీకరణ పత్రాలలో కృష్ణా జిల్లాగా నమోదు అవుతుంది, కానీ తల్లి దండ్రుల నివాసం ఏలూరు జిల్లాలో ఉన్నట్లు అయ్యింది. పొట్ట చేతపట్టుకుని విభిన్న అవసరాల కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలు వెళ్లినప్పుడు ఇది సమస్యగా మారుతుందన్నది నిపుణుల అభిప్రాయం. ఉద్యోగ అవకాశాల పరంగా కృష్ణా, ఏలూరు జిల్లాలు రెండు జోన్ల పరిధిలో ఉంటే వీరి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. లోకల్ స్టేటస్ విషయంలోనూ సమస్యలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ కోరుతున్న విధంగా కైకలూరును కృష్ణా జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది సాధ్యం కాకపోతే కనీసం ముదినేపల్లి మండలం పెదపాలపర్రు , కోడూరు గ్రామాలనైనా పూర్వం మాదిరి కృష్ణా జిల్లాలో కొనసాగించాలని కోరుతున్నారు. పెనమలూరు, గన్నవరం తరహాలో చూడవద్దని కోరుతున్నారు. ఇది నియోజక వర్గ ప్రజల ఉమ్మడి ఆకాంక్ష మాత్రమే కాదని, తమది కృష్ణా జిల్లా అని చెప్పుకోవటం ఆత్మ గౌరవం వంటిదన్నది ఇక్కడి భావనగా ఉంది. ఈ సమస్య స్పష్టంగా సీఎం దృష్టికి చేరితే ఆయన తప్పక స్పందిస్తారన్న ఆశాభావం ఇక్కడి ప్రజల్లో ఉంది.