– టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్
శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…! అల్లూరిసీతారామరాజు జిల్లా ఎట్టిపాక మండలం పురుషోత్తమపట్నం గ్రామంలోని రాములవారికి చెందిన భూములు కొట్టేయడం అన్యాయం. భద్రాచలం రాములవారి దేవాలయం తెలంగాణ లో ఉన్నప్పటికి ఆ ఆలయ భూములు ఏపీలో ఉన్నాయి. సోమరాజు పురుషోత్తమదాస్ అనే వీర భక్తుడు ఆలయానికి ఇచ్చిన భూములకు ఎసరు పెట్టారు. 917 ఎకరాల రాములవారి భూమికి పాసుపుస్తకాలు ఉన్నా కొట్టేయడానికి సిద్ధమయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ భూములకు రక్షణ ఉండగా నేడు రక్షణ కరువైంది. కొట్టేస్తున్న పెద్ద తలకాయ వివరాలు త్వరలో బయట పెడతాం. అనేకచోట్ల దేవుడి మాన్యాలను ప్రభుత్వం మింగేస్తోంది. దేవాదాయ శాఖవారు ఈ భూమికి వెంటనే కంచె వేసి దేవాలయ భూముల్ని కాపాడాలి. ఎండోమెంట్ వెంటనే చర్యలు తీసుకోవాలి. వారంరోజుల్లో చర్యలు తీసుకోకపోతే ముట్టడి కార్యక్రమం చేపడతాం.
రాష్ట్రంలో 232 చోట్ల దేవాలయాల్లో దాడులు జరిగినా చర్యలు మాత్రం శూన్యం. ఏ గుడికి ఎంతనష్టం వాటిల్లిందో లెక్కలున్నాయి. వైసీపీ నాయకుల నేతృత్వంలోనే కబ్జాపర్వం నడుస్తోంది. ప్రభుత్వం అండదండలతో వైఎస్ఆర్సిపికి చెందిన ఎటపాక లో ఓ పెద్ద తలకాయ రాముడి భూములను యథేచ్చగా కబ్జా చేస్తున్నాడు. ఈయన దేవుడి భూముల్లో ఇల్లు నిర్మాణం చేసుకుంటూ ఇతరులను కూడా నిర్మించుకోవాలని ప్రోత్సహిస్తున్నాడు. దేవుడి భూములలో నిర్మాణాలు తగదని ఎవరైనా రాముడి భక్తులు గానీ, అధికారులు గానీ అడిగితే భూములు కావాలనుకుంటే రాముడ్నే వచ్చి అడగమను అని వ్యంగంగా మాట్లాడటం రామ భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్లే. ప్రశ్నించినవారిపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఎండోమెంట్ అధికారులను దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాముడి పేరుతో ఎగతాళి చేస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నారు. ఒకటి లేదా రెండెకరాలైతే ఏదో కాకతాళీయంగా కక్కుర్తిపడ్డారని అనుకోవచ్చు. ఏకంగా 917 ఎకరాల వందలకోట్ల విలువైన భూములను కాజేయాలనుకోవడం అన్యాయం. ఇంత మొత్తంలో ఆక్రమణలంటే రాష్ట్రంలో ఎవరి హస్తముంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట పడాలి. జగన్.. దేవుడి దయ ఉండాలని చెబుతూనే దేవుడి మాన్యాలకు ఎసరు పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించడంపై ఉన్న శ్రద్ధ ప్రజల బాగోగులపై ఎందుకు చూపడంలేదని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ జగన్ ని ప్రశ్నించారు.