– ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్‌తో సుబ్రహ్మణ్యం శర్మ ప్రత్యేక భేటీ
– బ్రాహ్మణుల ఆర్థిక, సామాజికాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ
మంగళగిరి: స్థానిక తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు, అఖిల భారత బ్రాహ్మణ మహా సంఘం(ఏబీబీఎంఎస్) ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.సుబ్రహ్మణ్యం శర్మ ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన బుచ్చి రాంప్రసాద్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణుల సంక్షేమానికి చేస్తున్న కృషి అభినందనీయం అని అన్నారు.
గతంలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, అధికారులు కానీ తమకు అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదని, రెండు సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటే రెండు సార్లు కాన్సిల్ చేశారని ఆయన గుర్తు చేశారు. నేడు చైర్మన్‌గా బాధ్యతలు తీసుకోకముందే అఖిల భారత బ్రాహ్మణ మహా సంఘానికి బుచ్చి రాంప్రసాద్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో దేశంలోని బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేయవచ్చని, అందుకు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ తరఫున తమ సహకారాలు కావాలని బుచ్చి రాంప్రసాద్‌ను ఆయన కోరారు.
ఏపీలోని బ్రాహ్మణుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం బుచ్చి రాంప్రసాద్ ని సుబ్రహ్మణ్యం శర్మ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏబీబీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు చక్రవర్తి రమణాచార్య, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్యాం రఘునందన్, రాష్ట్ర అధ్యక్షుడు గోవింద శర్మ, ఏబీబీఎంఎస్ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.