అమరావతి: ప్రజల సౌకర్యార్థం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం డ్రెస్ కోడ్ అమలు చేయబోతుంది. మొత్తం 19 కేటగిరీల ఉద్యోగులు పనిచేస్తుండగా, అందులో మహిళా పోలీసులు, ఏఎన్‌ఎంలు, ఎనర్జీ అసిస్టెంట్‌లు మినహా మిగిలిన వారికి యూనిఫామ్ అందిస్తోంది. పురుష ఉద్యోగులు లైట్ బ్లూ కలర్ చొక్కా, క్రీమ్ కలర్ ప్యాంట్ ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మహిళా ఉద్యోగులకు లైట్ బ్లూ కలర్ టాప్, క్రీమ్ కలర్ పైజామా, క్రీమ్ కలర్ చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌ను యూనిఫామ్‌గా నిర్ణయించింది. ఒక్కొక్కరికి మూడు జతల కోసం 7.50 మీటర్ల చొక్కా క్లాత్, 4.05 మీటర్ల ప్యాంట్ క్లాత్‌ను.. మహిళ ఉద్యోగులకు టాప్ కోసం 7.50 మీటర్లు, పైజామాకు 7.25 మీటర్లు, చున్నీకి మరో 7.50 మీటర్ల క్లాత్‌ను పంపిణీ చేస్తున్నారు. మహిళా పోలీసులు, ఏఎన్‌ఎంలు, ఎనర్జీ అసిస్టెంట్‌లు మినహా 1,00,104 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 95 వేల మందికి ఇప్పటికే యూనిఫామ్ వస్త్రాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ నెల 25వ తేదీకల్లా మిగిలిన వారికీ అందజేస్తామని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు తెలిపారు.
ప్రజలు సులభంగా గుర్తించేందుకు..
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు, విధుల పట్ల నిబద్ధతతను పెంపొందించేందుకు యూనిఫామ్ ఉపయోగపడుతుందని, ప్రజలు కూడా వీరిని సులభంగా గుర్తించే అవకాశం లభిస్తుందని అధికారులు వివరించారు. తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలనే ఆదేశాలను ప్రభుత్వం ఇంకా జారీ చేయలేదని, ప్రజల సౌకర్యార్థం భవిష్యత్‌లో తప్పనిసరి చేసే అవకాశాలున్నాయని తెలిపారు.