– ఇది రైతుల ప్రభుత్వం
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– వ్యవసాయ రంగం కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన రేవంత్ సర్కారు
– ప్రాణహిత చేవెళ్ల పథకం ద్వారా సాగు నీరు తెస్తా
– తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా: కొత్రేపల్లి గ్రామం పరిధిలో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునే దిశగా పనిచేస్తుంది. పామ్ ఆయిల్ పంట సాగుతో అధిక లాభాలు ఆర్జించడంతో పాటు, మొదటి మూడు సంవత్సరాల పాటు అంతర్గతంగా కూరగాయ పంటలను సాగు చేయవచ్చు. ఆయిల్ ఫామ్ పంటకు ప్రభుత్వం సబ్సిడీని అందిస్తూ రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది.
రైతులకు మొక్కలు ఇవ్వడంతో పాటు డ్రిప్ పరికరాలను అందించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు నా సూచన. ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేసుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలి అదేవిధంగా మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు వేసుకునే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు.
అధిక దిగుబడి వచ్చే విత్తనాలను రైతులకు అందిచాలి. జిల్లాలో పెద్ద మొత్తంలో ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేసినట్లయితే రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు వెంటనే శంకుస్థాపన చేసుకుందామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునే దిశగా రైతు భరోసా, రైతు బీమా పథకాలను అమలుపరుస్తున్నామని, త్వరలోనే పంటల బీమాను కూడా వర్తింప చేస్తామని మంత్రి తెలిపారు.
స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధికంగా ప్రాముఖ్యత ఇస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రైతు బిడ్డ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా రైతు, అందుకే వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు.
ప్రజా ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర లోనే వ్యవసాయ రంగం కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసింది. రైతులను రుణ బారం నుండి విముక్తులను చేయడానికి 25 లక్షల మంది రైతులకు చెందిన 21 వేల కోట్ల రుణాలను మాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా ను ఏడాదికి ఎకరాకు 12 వేలకు పెంచి కేవలం తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేయడం జరిగింది. రైతు బీమా, సన్న రకాల వడ్లకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్, వ్వవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. రైతులకు ఏమేమి కావాలో అన్నింటికి కూడా ప్రభుత్వ సహకారం అందిస్తుంది.
రైతుల కష్టాలు తీర్చడానికి భూ భారతి తీసుకువచ్చారు. మన దేశం ఏడాదికి లక్ష కోట్ల విలువైన ఆయిల్ ఫాం ను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి మన దగ్గర ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది.
తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ మంత్రి, ఆయిల్ ఫాం సాగులో అపార అనుభవం కలిగిన రైతు. ఆయిల్ ఫాం సాగుతో రైతులకు మేలు జరుగుతుంది అని మొదటి నుంచి ప్రోత్సహిస్తున్నారు.
ఆయిల్ ఫాం తోటల పెంపకానికి రైతులు ముందుకు రావాలి. ఆయిల్ ఫాం తోటల సాగుకు ఆసక్తి ఉన్న రైతులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడాను. ప్రాణహిత చేవెళ్ల పథకం ద్వారా వచ్చే అయిదేళ్ళలో మన ప్రాంతానికి సాగు నీరు తెస్తానని హామీ ఇస్తున్నా. హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ భాషా, కాసాని జ్ఞానేశ్వర్ గారు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, రైతులు పాల్గొన్నారు.