Suryaa.co.in

Andhra Pradesh

తిరుమల శ్రీవారి,పద్మావతి అమ్మవారి ఆలయాల పై “డ్రోన్ కెమెరా షూట్” లు నిషేధించాలి

-నవీన్ కుమార్ రెడ్డి, తిరుపతి

తిరుమల శ్రీవారి ఆలయ పై భాగంలో డ్రోన్ కెమెరాతో తీసిన విజువల్స్ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ప్రసారం కావడంతో భక్తులలో ఆందోళన కలుగుతుంది! బిజెపి ప్రభుత్వం తిరుమల శ్రీవారి ఆలయ పై భాగంలో ఇప్పటికైనా “నో ఫ్లయింగ్ జోన్” గా అధికారికంగా ప్రకటించాలి!

ఐకాన్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వైరల్ అయిన శ్రీవారి ఆలయ పైభాగం దృశ్యాలు ఉద్దేశపూర్వకంగా తీసినవా లేక గూగుల్ 3d ఇమేజెస్ ఆ అన్నదానిపై ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన వెంటనే టిటిడి తగు చర్యలు చేపట్టాలి!

కడప జిల్లాకి చెందిన మాజీ ఎమ్మెల్యే తన అనుచరులతో గతంలో కోడూరు సమీపంలోని మామండూరు నడక మార్గం ద్వారా (తిరుమలకు మూడవ మార్గం ప్రతిపాదన సందర్భంగా) తిరుమల కొండకు వస్తూ, డ్రోన్ కెమెరాతో శేషాచలం కొండలలో షూట్ చేసుకుంటూ తిరుమలలోని కళ్యాణ వేదిక చేరుకొన్నాక టిటీడీ విజిలెన్స్ అధికారులు గమనించి, డ్రోన్ స్వాధీనం చేసుకొని తిరిగి విడిచిపెట్టారే తప్ప, అప్పుడే సీరియస్ గా పరిగణించి ఉంటే ఇలాంటివి పునరావతం అయ్యే ఆస్కారం ఉండదు.

అలిపిరి టోల్ గేట్ వద్ద పటిష్టమైన విజిలెన్స్ వ్యవస్థ ఉంది. విజిలెన్స్ అధికారులు భక్తులను తనిఖీలు చేసి బ్యాగులను స్కానింగ్ ద్వారా , క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే తిరుమల కొండకు అనుమతిస్తారు. అలాంటిది డ్రోన్ కెమెరా తిరుమలకు తీసుకెళ్లి ఉంటే, స్కానింగ్ లో బయటపడకుండా ఎలా తిరుమల వరకు చేరింది అన్న కోణంలో విచారణ చేపట్టాలి.

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా.. ఇటీవల ఎస్వీబీసీ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారంలో అమ్మవారి పుష్కరిణి నుంచి, ఆలయ పై భాగం మీదుగా నాలుగు మాడా వీధులలో వాహన ఊరేగింపుతో పాటు , తిరుచానూరు గ్రామ పంచాయితీ మొత్తాన్ని చిత్రీకరించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులంతా ప్రత్యక్షంగా వీక్షించడం జరిగింది!

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎస్వీబీసీ ద్వారా తీసిన డ్రోన్ షూట్ లు, ఒక పక్క భక్తులకు కనువిందు కలిగించినా , మరో కోణంలో దానిని ఆసరాగా తీసుకొని అసాంఘిక శక్తులు ఉద్దేశపూర్వకంగా తిరుమల తిరుచానూరు ఆలయాలపై డ్రోన్ షూట్ లు చేసే ప్రమాదం ఉంది.

తిరుచానూరు బ్రహ్మోత్సవాలలో ఎస్వీబీసీ డ్రోన్ కెమెరా షూట్ లను ప్రత్యక్షంగా టీవీల ద్వారా చూసిన భక్తులు డ్రోన్ కెమెరా షూట్ లను టిటిడి వారు అధికారికంగా అనుమతిస్తున్నారన్నటువంటి అనాలోచనతో ప్రయోగాలు చేసే ఆస్కారం ఉంది!

తిరుమలలో సుమారు 1200 సీసీ కెమెరాలు,ఆక్టోపస్,ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్,విజిలెన్స్,పోలీస్ లాంటి అనేక పటిష్ట నిఘా సంస్థలు 24 గంటలు పర్యవేక్షిస్తున్నా ఇలాంటివి జరగడం భక్తులలో ఆందోళన కలిగిస్తుంది!

తిరుమల తిరుచానూరు తో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలపై “నో డ్రోన్ షూట్స్”అని భక్తులకు తెలిసేలా, ఎస్వీబీసీ తో పాటు ప్రైవేట్ చానల్స్ లో ప్రతినిత్యం స్క్రోలింగ్ ద్వారా అందరికీ అవగాహన కల్పించేలా, టిటిడి ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు, విజిలెన్స్ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తినిగా డిమాండ్ చేస్తున్నాను.

LEAVE A RESPONSE