– కవిత కారు ఓవర్ స్పీడుకు 16 చలాన్లు
(సుబ్బు)
బీఆర్ఎస్ గుర్తు కారు జనక్షేత్రంలో చతికిలపడినా.. కేసీఆర్ బిడ్డ, జాగృతి ఫౌండర్ కవిత కారు మాత్రం బ్రేకుల్లేకుండా జనంలోకి ఓవర్ స్పీడుతో దూసుకుపోతోంది. కొంచెం గందరగోళంగా ఉంది కదా? ఓకే. డైరక్టుగా విషయానికొచ్చేద్దాం.
ఎమ్మెల్సీ కవిత సొంత కారు ట్రాఫిక్ నిబంధనను బేఖాతురు చేస్తూ.. రోడ్డుమీదకు దూసుకుపోతోందన్న విషయం, ట్రాఫిక్ పోలీసులు ఎట్టకేలకూ గుర్తించడం సంతోషించదగ్గ విషయమే. తెలంగాణ ‘బాపు’ అధికారంలో ఉన్నప్పుడు.. నిబంధనలను బేఖాతరు చేసిన వాహనదారులపై చలాన్ల కొరడా ఝళిపించి, జేబులకు చిల్లులు పెట్టిన అదే ట్రాఫిక్ పోలీసులు, ఇప్పుడు కవితక్క కారుకూ అలవాటు ప్రకారం చలాన్ల కొరడా ఝళిపించారు.
అసలు కవితక్క ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ పోలీసులు వేసిన చలాన్లు ఎంతో తెలుసా? కేవలం 16 మాత్రమేనట! నిజామాబాద్, మేడ్చల్, శంషాబాద్, చేగుంట, కరీంనగర్, దేవన్‌పల్లి, సిద్దిపేట, లంగర్‌హౌస్, రామగుండంలో మేడమ్ కారుకు ఇన్ని చలాన్లు వేసినట్లు ఆ చలాన్ల షీటు ఒకటి, సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. చట్టాలు చేసి, వాటిపై చర్చించే ప్రజాప్రతినిధులకే నిబంధనలపై గౌరవం లేకపోతే ఎలా?
