-గుడ్లు, చిక్కీల కాంట్రాక్టర్లకు రూ.178.5 కోట్ల బకాయిలు
-బకాయిలు చెల్లించకపోవడంతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పలు పాఠశాలల్లో గుడ్ల సరఫరా నిలిపివేత
-మంత్రి లోకేష్ సమీక్షలో వెల్లడైన విస్తుగొలిపే వాస్తవాలు
అమరావతి: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పేమాటలకు, చేసే పనులకు పొంతన ఉండదని మరోమారు తేటతెల్లమైంది. చిన్నారులకు మేనమామలా ఉండి వారి యోగక్షేమాలు చూసుకుంటానని చెప్పిన నాటి సిఎం జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి విద్యార్థులు, చిన్నారులకు తీరని ద్రోహం చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై సంబంధిత అధికారులతో గురువారం సెక్రటేరియట్ లో నిర్వహించిన సమీక్షలో చేదు నిజాలు వెల్లడయ్యాయి.
గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇవ్వాల్సిన గుడ్డును ఇవ్వడం లేదని మంత్రి దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన లోకేష్ గురువారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థులకు గుడ్ల పంపిణీ నిలిపివేతకు గత ప్రభుత్వ నిర్వాకమే కారణమని స్పష్టమైంది.
రాష్ట్రవ్యాప్తంగా గుడ్ల కాంట్రాక్టర్లకు డిసెంబర్ నుంచి 112.5 కోట్ల రూపాయలు, చిక్కీల కాంట్రాక్టర్లకు గతఏడాది ఆగస్టు నుంచి రూ.66 కోట్ల మేర జగన్ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్లిపోయింది. భారీగా బిల్లులు బకాయి పడటంతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పలు పాఠశాలలకు గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ గుడ్ల సరఫరా నిలిపివేశారు. వాస్తవం ఇలా ఉంటే టిడిపి ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు గుడ్ల పంపిణీ నిలిపివేశారంటూ వైసిపికి చెందిన నీలిమీడియా తప్పుడు ప్రచారం మొదలెట్టింది. విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్… దీనిపై సమీక్ష నిర్వహించి, గుడ్లు, చిక్కీలకు గత ప్రభుత్వం భారీగా బకాయిలు పెట్టి వెళ్లడంపై విస్మయం వ్యక్తంచేశారు.
చిన్నారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గుడ్లు, చిక్కీలను పంపిణీ చేయాలని, గత ప్రభుత్వం వదిలేసి వెళ్లిన బకాయిలను అతిత్వరలో చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. గుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లంతా మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలుచేసేందుకు సహకరించాలని కోరారు. ఈ సమీక్షలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, మధ్యాహ్న భోజన పథకం డైరక్టర్ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఇదిలావుండగా…ఇటీవల విద్యాశాఖపై మంత్రి లోకేష్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో గత ప్రభుత్వం విద్యాదీవెన, వసతిదీవెన పథకాల కింద రూ.3,480 కోట్లు బకాయిలు పెట్టడంతో వారి సర్టిఫికెట్లు వివిధ విద్యాసంస్థల్లో నిలచిపోయిన విషయం బట్టబయలైంది. మేనమామలా చూసుకోవడమంటే విద్యార్థులు, చిన్నారులను అవస్థల పాలుజేయడమా అని మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు.