Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రా థానోస్ పాలనలో ముస్లింలకు రక్షణ కరువైంది

*వక్ఫ్ భూములు, మైనార్టీల ఆస్తులను దోచుకుంటున్నారు
*న్యాయం అడిగిన ముస్లిం కుటుంబాలను వేధిస్తున్నారు
*నంద్యాలలో రూ. 100 కోట్ల విలువైన వక్ఫ్ భూములు కొట్టేయడానికి ప్లాన్
*జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ఇంఛార్జి షేక్ రియాజ్

ఆంధ్రా థానోస్ జగన్ రెడ్డి పాలనలో ముస్లిం మైనార్టీలకు రక్షణ కరవైందని, వారి ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఇంఛార్జి షేక్ రియాజ్ స్పష్టం చేశారు. వైసీపీ నాయకుల ఆగడాలను ప్రజలు అడ్డుకునే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ “ కడప జిల్లాలో అక్బర్ బాషా అనే ముస్లిం రైతు ఎకరం భూమిని ముఖ్యమంత్రి సమీప బంధువు తిరుపాల్ రెడ్డి ఆక్రమించుకున్నాడు. దీనిపై బాధితుడు సామాజిక మాధ్యమాల్లో వీడియో పెట్టినందుకు వాళ్ల కుటుంబం మొత్తాన్ని వేధిస్తున్నారు. కాళ్లు పట్టుకుని వేడుకుంటే తప్ప భూమి ఇవ్వమని అంటున్నారు. దీనిపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్టా రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబును బాధిత కుటుంబం కలిసేందుకు ప్రయత్నిస్తే ఒక్కరు కూడా కలవ లేదు. ఇదేనా ముస్లిమ్ కుటుంబాలకు ఇస్తున్న భరోసా?

నంద్యాలలో రూ. 100 కోట్లు విలువైన వక్ఫ్ భూములను కొట్టేసేందుకు వైసీపీ నాయకులు ప్లాన్ చేశారు. అమ్మడానికి వీలు లేని వక్ఫ్ భూములను 1992లో కాశిరెడ్డి వెంకట సురేంద్ర నాథ్ రెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించి దోచుకోవడానికి పథకం రచించడంపై ప్రభుత్వ పెద్దల సమాధానం ఏమిటి? ఈ రోజు జరిగే వక్ఫ్ బోర్డు సమావేశంలో ఈ భూమిని డీ నోటిఫై చేయించేందుకు పావులు కదుపుతున్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదు?

ఆయన పేరుకే డిప్యూటీ సీఎం
మైనార్టీ నాయకుడు అని గుర్తించి అంజాద్ బాషాకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే… ఆయన ప్రజలకు మేలు చేయాల్సింది పోయి ముఖ్యమంత్రి జగన్ కు చెక్క భజన చేస్తున్నారు. కడప జిల్లాలో సాటి ముస్లింకు అన్యాయం జరిగితే నోరు మెదపలేదు. ముస్లిం సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పథకాలను ప్రభుత్వం రద్దు చేస్తే మాట్లాడలేని మీరు… అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ కడప జిల్లాలో పర్యటిస్తే మాత్రం అవాకులుచవాకులు పేలుతారు. ముస్లింలు అభివృద్ధి చెందాలి, వక్ఫ్ భూములకు రక్షణ కల్పించాలని పీఏసీ మీటింగ్ లో తీర్మానం చేసిన బాధ్యత కలిగిన నాయకులు పవన్ కళ్యాణ్ .

మీకు నిజంగా ముస్లిం సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రా థానోస్ జగన్ రెడ్డికి చిడతలు కొట్టడం ఆపేసి నిలదీయండి. కబ్జాలకు గురవుతున్న వక్ఫ్ భూములపై ఎంక్వైరీ వేయించండి. ముస్లిం సంక్షేమానికి కట్టుబడి ఉన్న పవన్ కళ్యాణ్ వైపు నిలబడతారా? లేక ముస్లింల ఆస్తులు దోచుకుంటున్న ఆంధ్రా థానోస్ వైపు నిలబడతారా? మీరే తేల్చుకోండి. ఈ ప్రభుత్వం ముస్లింల ను ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప… వారి సంక్షేమానికి కట్టుబడి లేదు” అన్నారు.

LEAVE A RESPONSE