– అక్టోబర్ 1వరకు నవరాత్రి పండుగ ప్రత్యేక ఆకర్షణలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (లేపాక్షి) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని లేపాక్షి షోరూమ్ లతో పాటు హైదరాబాద్‌లో కూడా (తిరుమల మినహా) అక్టోబర్ 1, 2025 వరకు దసరా నవరాత్రి పండుగ ప్రత్యేక రాయితీ అమ్మకాలు నిర్వహించనున్నట్టు లేపాక్షి చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపోరియంలను లైటింగ్, బ్యానర్లు వంటివాటితో అలంకరించి, ప్రత్యేకంగా “బొమ్మల కొలువు” ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఇందులో కొత్త డిజైన్లతో ఉన్న కొండపల్లి, ఎటికొప్పాక బొమ్మలు, ఓడిఓపి ఉత్పత్తులు, జిఐ ఉత్పత్తులతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమైన ఇతర హస్తకళా వస్తువులు ప్రదర్శిస్తారన్నారు.
ఈ పండుగ ప్రత్యేక అమ్మకాలలో హ్యాండీక్రాఫ్ట్స్పై 15 శాతం, హ్యాండ్లూమ్స్పై 10 శాతం రాయితీ అందుబాటులో ఉంటుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలు, వస్త్రాలను ప్రోత్సహించడమే లేపాక్షి లక్ష్యమని అన్నారు. ఈ దసరా పండుగ సమయంలో సమీపంలోని లేపాక్షి ఎంపోరియాలను సందర్శించి, రాష్ట్ర కళాకారులను ప్రోత్సహించాలని లేపాక్షి చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ మనోహరన్ కోరారు.