– ముందస్తు అరెస్టులే జగన్ రెడ్డి దోపిడీకి నిదర్శనం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు
విశాఖలో జగన్ రెడ్డి చేస్తున్న భూ దందాలకు, దౌర్జన్యాలకు నేటి టీడీపీ నేతల అరెస్టులే నిలువెత్తు సాక్ష్యాలు. రుషికొండను పరిశీలించేందుకు టీడీపీ నేతలు వెళ్తుంటే.. జగన్ రెడ్డికి ఎందుకు అంత ఉలుకు.? అక్కడ ఏమీ తప్పు జరగకుంటే భయపడాల్సిన అవసరం ఏమిటి? టీడీపీ నేతల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా. మూడు ముక్కలాటతో విశాఖను ముప్పేట దోచేస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా.. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే.. సుమారు 72వేల రిజిస్ట్రేషన్లు జరిగాయంటేనే అక్కడ భూ దోపిడీ, అక్రమాలు, ఆక్రమణలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. నిర్బంధాలతో ప్రజల హక్కుల్ని, ప్రజా పోరాటాన్ని అడ్డుకోలేరని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి.
రుషికొండను పరిశీలించేందుకు వెళ్తున్న టీడీపీ నేతల్ని అడ్డుకోవడానికి వందలాది మంది పోలీసుల్ని మొహరించిన జగన్ రెడ్డి.. మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపేందుకు ఆ స్థాయిలో పోలీసుల్ని ఉపయోగిస్తే బాగుండేది. జగన్ రెడ్డి అక్రమాలను ప్రజలంతా గుర్తించారు. ఎన్ని అడ్డదారులు తొక్కినా.. ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడి నిర్భందాలు విధించినా ఉత్తరాంధ్రను వైసీపీ భకాసురుల నుండి రక్షించుకుంటాం.