• అమలుకు 16 SHE టీమ్స్ (Sanitation & Health Enforcement Teams) సిద్ధం.
-జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
విశాఖపట్నం:: విశాఖ నగర ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కొరకు జీవీఎంసీ ఈట్ రైట్ క్యాంపైన్ ప్రారంభించి వాటి అమలుకు 16 ప్రత్యేక SHE టీమ్స్ (శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్ఫోర్స్మెంట్) లను ఏర్పాటు చేయడం జరిగిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.
నగరంలో హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలు, వీధి ఆహార విక్రయ కేంద్రాలలో ఆహార నాణ్యత, పరిశుభ్రత పాటించకపోవడం వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, పలు ఆహార పదార్థాల్లో హానికరమైన రసాయనాలు వినియోగించడం వలన క్యాన్సర్, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వాటిని పూర్తిగా అరికట్టేందుకు ప్రతి జోన్ కు రెండు “SHE” టీములను ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ తెలిపారు.
ఈ టీమ్ లో సహాయ వైద్యాధికారి, శానిటేషన్ సూపర్వైజర్, ఫుడ్ ఇన్స్పెక్టర్, సచివాలయం శానిటరీ కార్యదర్శి తో పాటు సచివాలయం మహిళా పోలీసు ఒక బృందం గా ఉంటారని తెలిపారు. వీరు ప్రతిరోజు కనీసం రెండు లేదా మూడు ఆహారం విక్రయించే కేంద్రాలలో తనిఖీలు నిర్వహించి వారు వినియోగించే ఆహార పదార్థాలతో పాటు ముడి సరుకులు నాణ్యత, వంటశాల పరిశుభ్రతలను పరిశీలిస్తారని, పర్యావరణ పరిరక్షణ కొరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నందున వారు నిషేధిత ప్లాస్టిక్ ను ఉపయోగించకుండా “SHE” టీమ్ లు తనిఖీలు నిర్వహిస్తాయని తెలిపారు.
ఈ టీమ్ లు మొదటిసారిగా ఆహార పదార్థాలు నాణ్యత, పరిశుభ్రత మొదలైనవి ఆహార తయారు చేసే నిర్వహణకు అవగాహన కల్పిస్తారని, తరచుగా ఆహార నాణ్యత పరిశుభ్రత పాటించని వారికి అపరాద రుసుము వసూలు చేస్తారని కమిషనర్ తెలిపారు.
ప్రస్తుతం జోన్ కు రెండు టీమ్ లు ఉన్నాయని అవసరమైతే 32 టీమ్ లను ఏర్పాటు చేసి ప్రతి జోన్ కు నాలుగు చొప్పున కేటాయిస్తామన్నారు. అందుకు ఆహార ఉత్పత్తి చేసే సంస్థలు, ప్రజలు విశాఖను పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన, ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కమిషనర్ తెలిపారు.