Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్… పులి మీద స్వారీ చేస్తున్నావ్, జాగ్రత్త!

– విద్యార్థులతో రాజకీయం చేస్తే ఖబడ్దార్..!
– టీడీపీ, దాని తోక పార్టీల కుట్రలో భాగమే అనంతపురం కళాశాల ఘటన
– లాఠీ చార్జ్ జరగనేలేదు, విద్యార్థుల ముసుగులో దుండగులు రాళ్ళు వేశారు, గాయపడిన విద్యార్థినే వీడియో సందేశంలో చెప్పింది
– విద్యార్థి సంఘాల ముసుగులో రాళ్ళు, చెప్పులు విసిరిన వారిపై చర్యలు తీసుకుంటాం.. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతాం.
– ఎయిడెడ్ విద్యా సంస్థల పేరుతో… విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో ఆటలొద్దు..
– రాజకీయ పార్టీల హిడన్ ఎజెండాలో ఎయిడెడ్ విద్యా సంస్థలు భాగస్వాములు కావొద్దు
– ఎయిడెడ్ విద్యా సంస్థలను బలవంతంగా లాక్కుంటున్నాం అన్నది శుద్ధ అబద్ధం
– ఎయిడెడ్ విద్యా సంస్థలను టేక్ ఓవర్ చేయడానికి అవేమైనా కంపెనీలా..?
– ప్రైవేటు యూనివర్సిటీస్ యాక్ట్ ను తెచ్చి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసినప్పుడు సరస్వతి పుత్రులు గుర్తుకు రాలేదా బాబూ..?
– విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్
ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి. రాజశేఖర్, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ పోల భాస్కర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ హేమచంద్రారెడ్డిలతో కలిసి ఎయిడెడ్ విద్యా సంస్థలకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు, కుయుక్తులపై మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
నిన్న అనంతపురంలోని శ్రీ సాయిబాబా నేషనల్ కాలేజీ ఆవరణలో.. కొంతమంది విద్యార్థి సంఘాలుగా చెప్పుకుంటూ, విద్యార్థుల అభిమతానికి విరుద్ధంగా, బలవంతంగా ధర్నాకు ప్రేరేపించి, అలజడి సృష్టించారు. ఇందులో భాగంగా కొంతమంది దుండగులు విద్యార్థుల ముసుగులో రాళ్ళు రువ్వి విద్యార్థులను గాయపరిచారు. పోలీసులు తక్షణం రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వాస్తవంగా జరిగింది ఇది అయితే, వాస్తవాలను వక్రీకరిస్తూ, వక్రభాష్యాలు చెబుతూ.. ప్రతిపక్షాలు, ఓ వర్గం మీడియా, సోషల్ మీడియాలో ఏ విధంగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారో చూశాం.
– అనంతపురం దాడిలో గాయపడిన జయలక్ష్మి అనే విద్యార్థిని విద్యార్థి సంఘాల ముసుగులో దుండగులు రాళ్ళు విసిరి కొట్టడంతోనే గాయమైంది. వాస్తవానికి, ఆ విద్యార్థినికి, ఎయిడెడ్ సంస్థకు సంబంధమే లేదు. ఆమె చదువుతున్నది బీబీఏ, ఆ కోర్సు నాన్ ఎయిడెడ్ పరిధిలోనిది.
ఈ విషయాన్నింటినీ పక్కన పెట్టి.. విద్యార్థులపై విరిగిన లాఠీ.. లాఠీ చార్జీ జరిగిందని తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలికే మీడియాలో కట్టుకథలు రాస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారు.విద్యార్థిని జయలక్ష్మి, అసలు ఏం జరిగిందో తానే స్వయంగా రికార్డ్ చేసిన వీడియోను కూడా మీడియా ముందు ప్రదర్శించారు.
పోలీసులు కొట్టలేదు, ఎక్కడి నుంచో వచ్చి రాయి తన తలకు తగిలిందని విద్యార్థిని ఆ వీడియోలో స్పష్టంగా చెప్పింది.
విద్యార్థి సంఘాల ముసుగులో ఎవరైతే పోలీసులు, విద్యార్థుల మీదకు రాళ్ళు, చెప్పులు రువ్వారో వారిపై చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరుపుతాం.
లోకేష్ తగుదునమ్మా.. అంటూ రాజకీయం చేస్తున్నాడు. ఆయన తండ్రి చంద్రబాబు రెండాకులు ఎక్కువ చదివి, సరస్వతి పుత్రులపై దాడి చేస్తారా.. లాఠీ దెబ్బలే సమాధానమా అంటూ సినిమా డైలాగులు చెబుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించి కడప ఆర్జేడీ నుంచి ప్రాథమిక నివేదికను తీసుకున్నాం. ఈ ఘటనలో వాస్తవ పరిస్థితులను చూస్తే.. అదొక అటానమస్ కాలేజీ, 1991 నుంచి నడుస్తుంది. మొత్తం 2 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఎస్ఎస్ బీఎన్ కాలేజీలో మొత్తం ఎన్ని కోర్సులు ఉన్నాయి, విద్యార్థులకు బోధన ఎలా జరుగుతుంది, మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి.. అన్న విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే…
తమ కళాశాలకు గాంట్ర్ ఇన్ ఎయిడ్ వద్దు.. ప్రభుత్వం నుంచి టీచర్స్ శాలరీలకు సంబంధించి గ్రాంట్ ఇన్ ఎయిడ్ విత్ డ్రా చేసుకుంటున్నామని కన్సెంట్ లెటరు కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి, ఆ విద్యా సంస్థలో… హైస్కూలులో 13 మంది టీచింగ్ స్టాఫ్, ముగ్గురు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. జూనియర్ కాలేజీ లో 6గురు టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. డిగ్రీ కాలేజీలో 13 మంది టీచింగ్, 17 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ను సరెండర్ చేస్తూ వారి ఆమోదపత్రాన్ని అధికారులకు అందించారు.
ఎస్ఎస్ బీన్ కాలేజీ విద్యార్థులపై ప్రతిపక్షాలు ఈరోజు మొసలి కన్నీరు కారుస్తారా.. ఆ కాలేజీలో 47 టీచింగ్ పోస్టులు ఉంటే.. 34 పోస్టులు ఖాళీగా ఉన్న విషయం మీకు తెలియదా..సరస్వతి పుత్రులపై బాబుకు అమాంతంగా ప్రేమ పుట్టుకొచ్చిందా.. ?. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, విద్యా సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేసి, కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలికి, ఏకంగా ప్రైవేటు యూనివర్సిటీస్ యాక్ట్ పేరుతో చట్టం తెచ్చి విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేశారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎయిడెడ్ విద్యా సంస్థలను ఎప్పుడైనా సమీక్షించారా..? ఎప్పుడైనా ఆ సంస్థల్లో ఖాళీలు భర్తీ చేశారా.. 1999లో ఎవరు అధికారంలో ఉన్నారు, 2017లో ఎవరు అధికారంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడే కదా.. ! ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పోస్టులు భర్తీ చేయకూడదని 1999 డిసెంబరు 17న ప్రభుత్వ ఉత్తర్వులులు జారీ చేసింది నిజం కాదా..? ఖాళీలు భర్తీ చేయకూడని ఆ జీవోలో చెప్పింది ఎవరు, మీరు కాదా..?
ప్రభుత్వ గ్రాంట్ ఇన్ ఎయిడ్ తో నడుస్తున్న కాలేజీలు, స్కూళ్ళ మీద శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు, ఉన్నత ప్రమాణాలు పాటించేలా, టీచర్ – విద్యార్థుల నిష్పత్తిని పాటించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని వేసి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నాం. ఆ డాక్యుమెంటును పబ్లిక్ డొమైన్ లో కూడా పెడుతున్నాం.
గ్రాంట్ ఇన్ ఎయిడ్ కావాలా.. వద్దా.. అనే దానిపై ప్రభుత్వం ఆ విద్యా సంస్థలకు 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది.
1. ఎయిడెడ్‌ సంస్థలను అప్పగిస్తే.. పూర్తిగా ప్రభుత్వ సంస్థగా నిర్వహిస్తాం
2. ఎయిడెడ్‌ పోస్టులను అప్పగించి ప్రయివేటుగా నడుపుకోవచ్చని మరో అవకాశం
3. ఇప్పుడున్న పద్ధతిలోనే ప్రభుత్వ ఎయిడ్‌తో నడుపుకుంటామన్నా ఎలాంటి అభ్యంతరం లేదు.
4- ప్రభుత్వ విధానంపై కొన్ని రాజకీయ పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తూ.. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో తెస్తున్న సంస్కరణల వల్ల విద్యార్థులకు ఏదో నష్టం జరుగుతున్నట్టు, ఎయిడెడ్ సంస్థలపై ఒత్తిళ్ళు చేస్తున్నట్టు, టీడీపీకి వత్తాసు పలికే ఓ వర్గం మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూ, కోర్టుల్లో కేసులు వేయించడం, తల్లిదండ్రులను, విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నారు.
ఇందులో ఎవరినీ బలవంతం పెట్టేది లేదు, ఆ సంస్థల యాజమాన్యాలను ఒత్తిడికి గురిచేయం, గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చని పదే పదే చెబుతున్నా, విద్యార్థి సంఘాల ముసుగులో, తల్లిదండ్రుల కమిటీల పేరుతో కొద్దిరోజులుగా అలజడి చేయాలని చూస్తున్నారు.
అనంతపురంలో తెలుగుదేశం పార్టీకి చెందిన అనుబంధ సంస్థ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్, మరికొన్ని విద్యార్థి సంఘాలు.. ఒక పథకం ప్రకారం, కొద్దిరోజుల్లో ఎస్ కెడీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్న పరిస్థితుల్లో, విద్యా వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయాలని, ప్రభుత్వంపై బురదజల్లాలనే కుట్రతో.. ధర్నా పేరుతో విద్యార్థులపై చేసిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ, ఖండిస్తున్నాం.
విద్యా సంస్కరణల్లో భాగంగా.. మారుతున్న కాలానికి అనుగుణంగా.. నడపలేని పరిస్థితుల్లో ఉన్న విద్యా సంస్థలను ఉన్నది ఉన్నట్టుగా ప్రభుత్వానికి అప్పగిస్తే…. నాడు–నేడులో భాగంగా పునరుద్ధరిస్తాం. విద్యార్థులకు సరిపడా టీచర్లను భర్తీచేస్తాం. చారిటీకింద విద్యాసంస్థలను పెట్టిన దాతల పేర్లను కొనసాగించడం ద్వారా యాజమాన్యాల ఉద్దేశాలను నెరవేరుస్తాం. ఎయిడెడ్‌ విద్యాసంస్థల స్థాపన వెనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు అందిస్తున్న తోడ్పాటులో భాగమే ఇది. ఆ సంస్థలను నడుపుతున్న వారికి సహాయంగా నిలిచే కార్యక్రమం ఇది… అని ముఖ్యమంత్రి గాను పలు సందర్భాల్లో చెప్పారు. మరోవైపు తాము ప్రభుత్వంలో భాగమయ్యేలా చూడాలంటూ ఎయిడెడ్‌ టీచర్లు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో, వారి డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని, వారిని సరెండర్‌ చేసి, ప్రయివేటుగా నడుపుకోవచ్చు. దా ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా యథా ప్రకారం నడుపుకోవచ్చు అని చెప్పాం.
ఇప్పటికే ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలు, తిరిగి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటే… అలాకూడా చేయొచ్చు. దీనికికూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. యథాతథంగా తమ విద్యాసంస్థలను నడుపుకోవచ్చు అని తెలియజేశాం. ఇందులో ఒత్తిడి ఎక్కడ ఉంది అని ఆందోళనలు చేస్తున్న రాజకీయ పార్టీలను, విద్యార్థి సంఘాలను సూటిగా ప్రశ్నిస్తున్నాం.
ఎస్ఎస్ బీఎన్ కాలేజీలో విద్యార్థులై లాఠీచార్జ్ జరిగిందని చూపించండి. విద్యార్థులను కాలేజీలోకి వెళ్ళనీయకుండా, విద్యార్థి సంఘాల ముసుగులో కొందరు దౌర్జన్యం చేస్తుంటే.. వచ్చినవాళ్ళు ధర్నా చేయడానికి వచ్చారా.. లేక అరాచకం చేయడానికి వచ్చారా.. దేనికొచ్చారు. పోలీసుల మీద కూడా రాళ్ళు, చెప్పులు వేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ విద్యా సంస్థల పేరుతో రాజకీయం చేయాలని గత కొద్దిరోజులుగా తెలుగుదేశం, వారికి వత్తాసు పలికే మీడియా తాపత్రయాన్ని రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు.
పిల్లలతో రాజకీయం ఏంటి..? నాడు-నేడులో విద్యా సంస్థలను అభివృద్ధి చేయాలంటే చెప్పండి, చేస్తాం. బలవంతంగా మీ విద్యా సంస్థలను లాగేసుకుంటేనో, మీపై ఒత్తిడి చేస్తేనో, ఫీజులు పెంచితేనో చెప్పండి.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాకాకుండా, కేవలం మీకు రాజకీయమే కావాలంటే ఈ ప్రభుత్వంలో కుదరదు.
ఎయిడెడ్ విద్యా సంస్థలను విలీనం చేస్తే.. ఫీజులు పెరుగుతాయనో, మరోరకమైన ఇబ్బంది వస్తుందనో ఎవరూ భయ పడాల్సిన అవసరం లేదు. యాజమాన్యాలకు ఇష్టం లేకుండా ప్రభుత్వం ఏదీ చేయదు.
ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎన్నో అవకతవకలు జరుగుతున్న అంశాలను నిపుణుల కమిటీ ద్వారా వెలుగులోకి తెచ్చాం. ఉపాధ్యాయులు లేకుండా, సున్నా అడ్మిషన్లతో ఉన్న 400కు పైగా ఉన్న స్కూళ్ళు ఏ విధంగా వైబుల్ అని విద్యార్థుల ముసుగులో వస్తున్న పార్టీలను సూటిగా అడుగుతున్నాం. ఈరోజు కొంతమంది పచ్చ కండువాలు వేసుకుని, టీఎన్ ఎస్ ఎఫ్ అనే విద్యార్థి సంఘం పేరుతో ఇక్కడికి వచ్చారు. మీ నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎయిడెడ్ విద్యా సంస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేశాడో.. ఈరోజు వచ్చిన టీఎన్ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు నిలదీయాలి. ఎయిడెడ్ సంస్థల విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో ఆటలా..
చంద్రబాబుకు ఏ విషయంలోనూ క్లారిటీ ఉండదు. అధికారంలో ఉంటే ఒక మాట.. ప్రతిపక్షంలో ఉంటే మరో మాట. ఈరోజు ఎయిడెడ్ విద్యా సంస్థల మీద చంద్రబాబుకు ప్రేమ పుట్టుకువచ్చిందా..? నిన్నటివరకూ తల్లిదండ్రుల అసోసియేషన్ల పేరుతో, ఇప్పుడేమో విద్యార్థి సంఘాల ముసుగులో, టీఎన్ఎస్ ఎఫ్ కండువాలు కప్పుకుని వచ్చి, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటారా..?
లోకేష్ జాగ్రత్త.. పులి మీద స్వారీ చేస్తున్నావ్. పిల్లల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు ఇకనైనా మానుకో. పిల్లలతో రాజకీయం చేద్దామంటే ఏ రాజకీయ పార్టీకైనా ఖబడ్దార్..! మీ పిల్లలేమో కాన్వెంట్లలో చదువుతున్నారు.. ప్రభుత్వ, ఎయిడెడ్ సంస్థల్లో చదువుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులు ఏమై పోయినా ఫర్వాలేదనా.. మీ దుష్ట రాజకీయం..?
పేదరికం విద్యకు అడ్డు కాకూడదన్నది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విధానం.
గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ లో ఏ ఇబ్బంది ఉన్నా, పొరపచ్చాలు ఉన్నాయని మీకు అనిపించినా, అటువంటి వారితో చర్చించడానికి ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది.
రాజకీయ పార్టీల హిడన్ ఎజెండాలో భాగస్వాములు కావొద్దని ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలకు చెబుతున్నాం.
ఫీజులు పెంచితే మేం చర్యలు తీసుకుంటామని చెప్పాం. మంచి ప్రమాణాలతో, ఉన్నతమైన విలువతో విద్యా బోధన అందించాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన.
టీడీపీ, దాని తోక పార్టీల కుట్రలో భాగమే అనంతపురం కళాశాల ఘటన. విద్యార్థుల జీవితాలను బలిపీఠం మీద పెట్టేందుకు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సాకులు చూపిస్తూ, రాష్ట్రంలో అలజడి సృష్టించి, శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని చూస్తున్నారు. మీ ఆటలు సాగనివ్వం.
ప్రభుత్వ భూములను ఎస్ఆర్ ఎం, విట్ తదితర సంస్థలకు ధారాదత్తం చేసి, ఒక వ్యాపార ధోరణిలో విద్యా వ్యవస్థను నడిపించాలని ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ ను చంద్రబాబు తెచ్చాడు.
చంద్రబాబు చేసిన ఆ చట్టానికి మార్పులు చేసి, అందులో 35 శాతం పేద, అణగారిన వర్గాలకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంటుతో కార్పొరేట్ కాలేజీలలో చదువునే అవకాశం కల్పించిన నాయకుడు జగన్.
ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ… విద్యార్థుల భవిష్యత్తు కోసం వీళ్ళు ధర్నాలు, ఆందోళనలు చేయడం లేదు. వీరి రాజకీయ స్వార్థం కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నారు.
ఎయిడెడ్ విద్యా సంస్థలను టేక్ ఓవర్ చేయడానికి అవి ఏమైనా కంపెనీలా.. ప్రభుత్వం స్వచ్ఛందంగా, వారి ఇష్ట ప్రకారమే నిర్ణయం తీసుకుంటుంది తప్పితే… ఏకపక్షంగా టేక్ అవర్ చేయడం గానీ, విలీనం చేయడం గానీ చేయటంలేదు.
ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర మాట్లాడుతూ.. 1990 వరకు ప్రైవేటు కాలేజీలు, స్కూళ్ళు చాలా తక్కువ ఉండేవని, ఆ పరిస్థితుల్లో విద్యా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలను, ఎయిడెడ్ సంస్థలను ప్రోత్సహించాయి. ఆ తర్వాత వచ్చిన సంస్కరణల్లో భాగంగా, గత రెండు దశాబ్దాలుగా, 1990 తర్వాత కొత్తగా ఒక్క ఎయిడెడ్ కాలేజీ కూడా నమోదు కాలేదు. 1999లో ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకూడదని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో.. పెద్దఎత్తున ఖాళీలు ఏర్పడ్డాయి. దాంతో అవి క్రమేపీ నిర్వీర్యమయ్యే పరిస్థితులకు వచ్చాయని తెలిపారు.

LEAVE A RESPONSE