మంత్రి లోకేష్ అసమర్థతతో భ్రష్టుపట్టిన విద్యావ్యవస్థ
– విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు, లోకేష్ చెలగాటం
– ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా అబద్ధాలు
– లోకల్, నాన్ లోకల్ పేరుతో లబ్ధిదారులను తగ్గించే కుట్రలు
– 32 లక్షల మందికి ‘తల్లికి వందనం’ పేరుతో మోసం:
– ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ఆగ్రహం
తాడేపల్లి: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసమర్థత కారణంగా రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిందని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ సీనియర్ నేత సాకె శైలజానాథ్ మండిపడ్డారు.
తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చివరికి విద్యార్ధులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపైన కూడా చంద్రబాబు, లోకేష్‌లు అబద్దాలు మాట్లాడటం వారి దిగజారుడుతనంకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టి, ప్రైవేటు కార్పోరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్నారని అన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యారంగంను నిర్వీర్యం చేస్తోంది. సాక్షాత్తు మంత్రి నారా లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న విద్యా వ్యవస్థలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆరు త్రైమాసికాలకు సంబంధించి రూ.4200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు హాస్టల్ ఫీజు (వసతి దీవెన) కింద రెండేళ్లలో రూ.2200 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. మొత్తం ఫీజురీయింబర్స్ మెంట్, హాస్టల్ వసతి బకాయిలు కలిపి రూ. 6400 కోట్లు చెల్లించాల్సి ఉంది.
దీనిపై వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’ పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహిస్తే వైయస్సార్సీపీ పెండింగ్ పెట్టిపోయిన రూ.3500 కోట్ల బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని గతేడాది అక్టోబర్ 22న మంత్రి నారా లోకేష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇదే నారా లోకేష్ మరో 5 నెలల తర్వాత మార్చి 22, 2025న వైయస్సార్సీపీ ప్రభుత్వం రూ.4271 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయిందని మరో లెక్క చెప్పారు. .
దీంతోపాటు ఈ బకాయిలకు సంబంధించి ఇప్పటికే రూ.788 కోట్లు చెల్లించామని, మరో రూ.600 కోట్లు ఇటీవలే రిలీజ్ చేశామని మరో రూ.400 కోట్లు విడుదల చేస్తామని ఎక్స్‌లోనే పొంతన లేకుండా మరో అబద్ధపు పోస్ట్ రాసుకొచ్చారు. కానీ ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి ఒక్క రూపాయి కూడా బకాయిలుగా చెల్లించిన పాపాన పోలేదు.
గతేడాది తల్లికి వందనం పథకం అమలు చేయకుండా విద్యార్థుల తల్లులను మోసగించిన కూటమి ప్రభుత్వం, ఈ ఏడాది కూడా 32 లక్షల మంది లబ్ధిదారులను కట్ చేసి అరకొరగా అమలు చేసింది. యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్) లెక్కల ప్రకారం గతేడాదికి సంబంధించి ఒక్క విద్యారంగంలోనే ఈ ప్రభుత్వం రూ.13,112.82 కోట్లు బకాయిలు పెట్టింది. ఈ ఏడాది 54,94703 మందికి మాత్రమే తల్లికి వందనం చెల్లించింది. 32,47182 మందికి ఎగనామం పెట్టారు.
పైగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ.15వేలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి తీరా ఇచ్చే సమయానికి రూ.13 వేలే ఇస్తామని చెప్పారు. మరీ దారుణం ఏంటంటే చాలా మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.8 వేలు, రూ.9 వేలు కూడా జమ చేసేసి చేతులు దులిపేసుకున్న దిక్కుమాలిన ప్రభుత్వం ఇది. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగరకొట్టేదానికి ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది.
లోకల్, నాన్ లోకల్ సమస్యల మీద హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చిన జీవో చూస్తే అదే అనుమానం కలుగుతుంది. వరుసగా నాలుగేళ్లు ఇక్కడ చదవకపోతే నాన్ లోకల్ అవుతారని చెప్పడం విడ్డూరంగా ఉంది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇక్కడే చదవాలని చెబుతున్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకుని ఇంటర్ చదువుల కోసం బయటకి వెళితే వారిని నాన్ లోకల్ గా పరిగణిస్తామని చెప్పడం మతిలేని చర్య.
ఒకపక్క విద్యార్థులు ప్రైవేటు విద్యాసంస్థల ఫీజు వేధింపులకు భయపడి చదువులు మానేస్తుంటే, చంద్రబాబు మాత్రం జైల్లో ఉన్న తన పార్టనర్ ఈశ్వరన్‌ని పరామర్శించడానికి సింగపూర్ పర్యటనకి వెళ్తున్నాడు. ఆయనతో పాటు మంత్రి నారా లోకేష్, మంత్రి నారాయణ, టీజీ భరత్ కూడా సింగపూర్ వెళ్తున్నారు.