Suryaa.co.in

Andhra Pradesh

దేశంలోనే ప్రముఖ పర్యాటక హబ్ గా అభివృద్ధికి కృషి :మంత్రి రోజా

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ఒక ప్రముఖ పర్యాటక హబ్ గా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన సంక్షేమ శాఖల మంత్రి రోజా అన్నారు. బుధవారం అమరావతి సచివాలయం మూడవ బ్లాకులో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమ శాఖల మంత్రిగా ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గండికోట-బెంగుళూరు,బెంగుళూరు-గండికోట బస్సు సర్వీసు ప్రారంభానికి సంబంధించిన దస్త్రంపై ఆమె తొలి సంతకం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తాను నేడు మంత్రిగా బాధ్యతలు చేపట్టడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.దివంగత ముఖ్యమంత్రి డా.వైయస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళేందుకు విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని ఆమె చెప్పారు.మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డని ఆయన నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి ఆర్కె.రోజా పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ప్రముఖ పర్యాటక హబ్ గా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని మంత్రి రోజా చెప్పారు.పర్యాటక శాఖలో ఇప్పటికే పలు ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని వాటన్నింటినీ సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడంతోపాటు మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు కృషి చేస్తానని అన్నారు.

అదే విధంగా క్రీడా రంగం ప్రోత్సాహానికి కూడా తనవంతు కృషి చేస్తాని,ముఖ్యంగా గ్రామీణ క్రీడల ప్రోత్సాహానికి ప్రత్యేక కృషి చేస్తానని మంత్రి ఆర్కె.రోజా వెల్లడించారు.అలాగే తెలుగు భాషాభివృద్ధికి,వివిధ కళకారులను అన్ని విధాలా ఆదుకుని ప్రోత్సహించేందుకు వారి సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటానని మంత్రి రోజా చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి సంక్షేమం,సమాచార పౌరసంబంధాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి సిహెచ్.శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మంత్రి రోజాకు పుష్పగచ్చం అందించి దుస్సాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.రాష్ట్ర పర్యాటక,సాంస్కృతికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మంత్రి రోజాకు పూలగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఇంకా పలువురు ప్రముఖులు,అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A RESPONSE