Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల నెత్తిన ట్రూ అప్ చార్జీల భారం మోపుతోన్న పాలకులు

-ఎనిమిదవ సారి విద్యుత్ చార్జీల పెంపు
-ఆశతో కూడిన అవగాహనరాహిత్యం వల్లే పెరుగుతోన్న విద్యుత్ చార్జీలు
-ఫీజులే చెల్లించని వారు ఇక ప్రాజెక్టులను ఏమి పూర్తి చేస్తారు?
-వైయస్ వివేక హత్య కేసు రెండు, మూడు నెలలు కొలిక్కి వచ్చే ఛాన్స్ 
-ఇన్నాళ్లు బటన్ మోహన్ రెడ్డి అన్నారు… ఇప్పుడు బటన్ మోసం రెడ్డి అనాలా?
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశతో కూడిన అవగాహన రాహిత్యం వల్ల ప్రజల నెత్తిన ట్రూ అప్ చార్జీల భారం పడుతోందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. పాలకుల పనికిమాలిన చేష్టల వల్ల, తాను ముఖ్యమంత్రినని ఏమి చేసినా చెల్లుతుందని అహంభావం కారణంగానే ప్రజలకు మరోసారి విద్యుత్ భారం తప్పడం లేదు. ఇప్పటికే ఏడుసార్లు విద్యుత్ చార్జీలను పెంచారు. ఇప్పుడు ఎనిమిదవ సారి విద్యుత్ చార్జీలను పెంచబోతున్నారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల ప్రజలు దారుణంగా నష్టపోతున్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో రెన్యుబుల్ ఎనర్జీ కోసం కొన్ని పి పి ఏ లను చేసుకుంది. యూనిట్ విద్యుత్ మూడు నుంచి మూడున్నర రూపాయలకు కొనుగోలు చేసే విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…

గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏలను గౌరవించకుండా, రేటు తగ్గించాలని కోరడం, వారి నుంచి విద్యుత్ ను కొనుగోలు చేయకుండా మానేశారన్నారు. పిపిఏ లను పునసమీక్షించేందుకు విద్యుత్ నిపుణుల కమిటీ అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి తో పాటు మరొక రెడ్డితో కమిటీ వేశారు. పిపిఏ లు చేసుకున్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన పాత బకాయిలను నిలిపివేశారు. కొత్తగా విద్యుత్తును కొనడం ఆపివేశారు. ఎక్స్చేంజిలో యూనిట్ విద్యుత్ కు ఐదు రూపాయలు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీనితో యూనిట్ విద్యుత్ ధరకు అదనంగా రూపాయిన్నర చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో పిపిఏ ఒప్పందాలను చేసుకున్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. హిందూజా ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను బొగ్గు ధర మినహాయించి, మిగిలిన ధర చెల్లించాలి. రెన్యుబుల్ ఎనర్జీ కి రా మెటీరియల్ ఉండదు. ఒప్పందం కుదుర్చుకున్న మేరకు ధర చెల్లించాలి. ఉత్పత్తి అయిన విద్యుత్ ను గ్రిడ్ కు అనుసంధానం చేయకుండా మూర్ఖత్వంతో మొండిగా తీసుకోకుండా ఆపివేశారు. విద్యుత్ ను తీసుకొని ధరను నెగోషియేట్ చేసి ఇవ్వవచ్చు . పి పి ఏ ఒప్పందాలను కాదని అనడానికి వీలు లేదు. వారు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

పిపిఏలు చేసుకున్న సంస్థలకు యూనిట్ విద్యుత్తు ధర మూడున్నర చెల్లించడంతోపాటు ఎక్స్చేంజిలోయూనిట్ విద్యుత్ ఐదు రూపాయలకు కొనుగోలు చేయడం వల్ల , ప్రజలపై యూనిట్ విద్యుత్ భారం ఎనిమిది రూపాయలు పడింది. ఎక్స్చేంజిలో కాకుండా, అదే పిపిఏలు చేసుకున్న సంస్థల వద్ద విద్యుత్ ను కొనుగోలు చేసి ఉంటే మూడు నుంచి మూడున్నర రూపాయలకే యూనిట్ విద్యుత్ లభించి ఉండేది. పాలకులు అజ్ఞానంతో , కక్కుర్తి పడి ఎక్స్చేంజిలో విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలపై భారాన్ని మోపారు. విజ్ఞులైన ప్రజలు తమ నెత్తిన రాష్ట్ర ప్రభుత్వం మోపిన భారాన్ని అర్థం చేసుకోవాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. ప్రభుత్వం కుదుర్చుకున్న పీపీఏ ఒప్పందాలను గౌరవించాలని బుద్ధి జ్ఞానం ఉన్న ఎలక్ట్రిసిటీ అధికారులకు తెలియదా?, వారికి బుద్ధి ఉండే ఉంటుంది… కానీ బుద్ధి లేనిది ఎవరికో ప్రజలు అర్థం చేసుకోవాలి. న్యాయస్థానాలు ఆదేశించినప్పటికీ, విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఏమీ లేదు. న్యాయస్థానాలు ఆదేశించిన తనకు తమిళనాడు ప్రభుత్వం ఇప్పటివరకు బకాయిలు చెల్లించలేదు. న్యాయస్థానాలు ఆదేశించాయని చెప్పి విద్యుత్ బకాయిలు చెల్లించారంటే, అందులో ఏదైనా మతలబు ఉండే ఉంటుంది. హిందూజా ప్లాంట్ ఖాళీగా ఉంచినందుకు 1230 కోట్ల రూపాయలను అప్పుచేసి మరి ఆ సంస్థకు చెల్లిస్తున్నారు. ఆ భారాన్ని మొత్తం ఇప్పుడు ప్రజలు ట్రూ అప్ చార్జీల రూపంలో భరించాల్సిందే. సకాలంలో బొగ్గును కొనుగోలు చేయకుండా, అదానీ సంస్థ వద్ద కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపించారు. దీని వల్ల ప్రజలపై ట్రూ అప్ చార్జీల భారం పడుతుండగా, ప్రభుత్వ అధినేతలకు లబ్ధి చేకూరుతోంది. పాలకుల అజ్ఞానం వల్ల 20వేల కోట్ల రూపాయల విద్యుత్ భారం ప్రజలపై పడిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

పదివేల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో 100 కోట్ల అవినీతి
హర్యానా, తెలంగాణ వంటి రాష్ట్రాలకు 60 నుంచి 70 వేల రూపాయలకు 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ ను ఉత్పత్తి సంస్థలు సరఫరా చేస్తుండగా, రాష్ట్రంలో శిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ మాత్రం 1,30,000 నుంచి 1,40,000కు సరఫరా చేస్తోందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ లెక్కన పదివేల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు లోనే 100 కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుంది. కడప జిల్లాకే చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో, సెంట్రల్ డిస్కం మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న కడప జిల్లా వాసి పద్మ జనార్దన్ రెడ్డి, కడప జిల్లాకే చెందిన వ్యక్తి కంపెనీకి 2900 కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చారు. 100% అదనంగా ఆ కంపెనీకి ప్రభుత్వం సొమ్ము చెల్లించింది. ఈ లెక్కన మూడు వేల కోట్ల రూపాయల లబ్ధిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సదరు కంపెనీకి చేకూర్చింది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి రాష్ట్రంలో 2100 మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టును కట్టబెట్టి ఐదు నుంచి పదివేల ఎకరాల భూమిని అప్పనంగా అప్పగించారు. సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కోసం రెండు లక్షల ఎకరాల భూమిని అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కయ్యే ఖర్చును ఫీజు రూపంలో చెల్లించమంటే డబ్బు కట్టడానికి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ సమయం అడుగుతోంది. అదే సంస్థ కు నెల్లూరు దగ్గర ఐదు వేల ఎకరాల భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఏమిటి ఈ దోపిడీ?, ఈ భారం అంతా ప్రజలపైనే పడునుంది. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి కంపెనీకి కూడా పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టు అప్పగించారు. గడువులోగా ఫీజు చెల్లించమంటే, చెల్లించకుండా మరికొంత సమయం కావాలని సదరు సంస్థ కోరుతోంది. అలాగే దేశంలోనే ఒక ప్రముఖ సంస్థకు పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టు కట్టబెట్టారు. ఈరోజు ఆ సంస్థకు ఒక్క రూపాయ కూడా అప్పుపుట్టని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఫీజులే చెల్లించలేని సంస్థలు, ఇక ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తాయని రఘు రామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ లో విద్యుత్ మీటర్ల సరఫరా ను అగ్రగామి కంపెనీకి టెండర్ ద్వారా రీజనబుల్ ధర కు అప్పగించారు. అయినా, ఆ సంస్థకు ఇచ్చిన టెండర్ ను బిజెపి పాలిత ప్రభుత్వమే రద్దు చేస్తుండగా, రాష్ట్రంలో మాత్రం పోటీపడి టెండర్లను కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి?. కేవలం ముగ్గురు, నలుగురికి మాత్రమే ప్రభుత్వ ప్రాజెక్టులను ఎందుకు ఇస్తున్నారని రఘు రామకృష్ణంరాజు నిలదీశారు.

ఇచ్చేదేమో ప్రజల సొమ్ము… తానేదో రైతుబంధు నన్నట్లుగా ఫోజు
ప్రజల సొమ్మును రైతులకు పంచుతూ, తానేదో రైతుబంధు… దీనబంధు అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోజులు కొడుతున్నారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. తెనాలిలో జగన్ మాయ ముందు, సినిమాలు కూడా సరిపోవు. వైయస్సార్ రైతు భరోసా అని తాటికాయ అంత అక్షరాలతో సాక్షి దినపత్రిక తో సహా జాతీయ, ప్రాంతీయ దినపత్రికల్లో ప్రచారం చేసుకుంటూ, పక్కనే పీఎం కిసాన్ అని ఇంగ్లీషులో చిన్న అక్షరాలతో రాయడం వెనుక ఆంతర్యం ఏమిటి. కేంద్ర ప్రభుత్వ పథకం పేరు పూర్తిగా తెలుగులో రాయవచ్చు కదా. ప్రతి రైతుకు రెండు వేల చొప్పున 51.2 లక్షల మందికి అన్నదాతలకు 1090 కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాలో బటన్ నొక్కి జమ చేస్తున్నట్లుగా చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. దేశంలోని తొమ్మిది కోట్ల మంది రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలో సోమవారమే సింపుల్ గా బటన్ నొక్కి వారి ఖాతాలలో జమ చేశారు. నిన్న ప్రధానమంత్రి దేశ రైతుల ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని, ఇప్పుడు తానేదో కొత్తగా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నట్లుగా ల్యాప్టాప్ ను నొక్కడం పరిశీలిస్తే, నిన్నటి వరకు బటన్ మోహన్ రెడ్డి అన్న వారంతా నేటి నుంచి బటన్ మోసం రెడ్డి అని పిలువాలా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మారిస్తే, నిధులు ఇచ్చేది లేదని కేంద్ర మంత్రులు స్పష్టం చేయగా, రాష్ట్రంలో మాత్రం పార్టీ పేరుతో కేంద్ర పథకాన్ని పేరు మార్చి అమలు చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డుకు బదులుగా జగన్మోహన్ రెడ్డి నటనకు ఆస్కార్ లాంటి అవార్డును ఇవ్వాలి. బహిరంగంగానే పచ్చి అబద్ధాలు చెబుతూ, ప్రజల్ని మోసగించడం ఒక్క జగన్మోహన్ రెడ్డి కే చెల్లింది. మూడు సంవత్సరాల తొమ్మిది నెలల పాలనలో రాష్ట్ర రైతాంగానికి 1.45 లక్షల కోట్ల రూపాయల లబ్ధి చేకూరినట్లు చెప్పారు. ఇందులో 55 వేల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు కోసం వెచ్చించినట్లు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. ధాన్యం కొనుగోలు కూడా రైతుకు చేసిన సహాయమేనా?. కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. రాష్ట్ర రైతాంగానికి 1.45 లక్షల కోట్ల రూపాయల సహాయం చేసినట్లుగా పత్రికా ప్రచార ప్రకటనలలో పేర్కొనడం పరిశీలించిన ప్రజలు, అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తున్నారేమోనని భ్రమపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగులను ఉపాధ్యాయులను సకాలంలో జీతాలు చెల్లించకుండా, స్కూళ్ల ఎత్తివేత ద్వారా విద్యార్థులను మోసగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు రైతులను కూడా వంచిస్తోంది.

అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రైతు భరోసా కింద 12 వేల 500 రూపాయలు చెల్లిస్తానని చెప్పారు. ఇప్పుడు చెప్పిన దానికంటే ఎక్కువే ఇస్తున్నామని రైతులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు రైతు భరోసా కింద అందజేస్తున్న మొత్తం లో 6వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 7500 మాత్రమే రైతులకు ఇస్తోంది. ఇదే చెప్పిన దానికంటే ఎక్కువ చెల్లించడమా?. కేంద్రం ఇచ్చే డబ్బులను కూడా తానే ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. దేశంలో ఏ సంక్షేమ పథకాన్ని ఎవరు ప్రవేశపెట్టారన్నది చెప్పాలి. తెనాలి వేదికగా దేశ ప్రజలందరినీ జగన్మోహన్ రెడ్డి మోసగించారు. రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే ధైర్యం తనకుందని, ధైర్యం ఉంటే అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చెయ్యాలని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలకు సవాలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఎవరెన్ని స్థానాలకు పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి కి ఎందుకు?. తాను ఒక్కడే వీరుడినని, సింగల్ గా పోటీ చేస్తానని చెప్పడమే కాకుండా దుష్ట చతుష్టయం, దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ తో పోటీ పడుతున్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇది ఇంగ్లీష్, తెలుగు మీడియం మధ్య పోటీ అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయి.

తెనాలి వేదికగా జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే. తన నివాసం నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెనాలికి ఎవరైనా హెలికాప్టర్లో ప్రయాణం చేస్తారా?. గతుకులమయమైన రోడ్ల వల్ల ప్రయాణం చేసి ఉండవచ్చునని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. 26 కిలోమీటర్ల పొడవు చెట్లు నరికించుకునే కంటే, రెండు కిలోమీటర్ల వ్యవధిలో చెట్లను నరికించుకోవడం మంచిదే కదా?. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రోగులకు నీడ కూడా లేకుండా చెట్లను నరికి వేశారు. బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వెళ్లే ముఖ్యమంత్రి, తాను వెళ్లేదారిలో ఏపుగా ఎదిగిన చెట్లను సెక్యూరిటీ కారణాలను సాకుగా చూపి నరికించడం దారుణం. ఇదే విషయమై తాను గ్రీన్ ట్రిబ్యునల్ కు ఒక లేఖ రాశాను. ఒక్క చెట్టును నరికితే, ఎన్ని మొక్కలు నాటాలి. ఎంత జరిమానా విధించాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తన పర్యటనలో భాగంగా వేలాది వృక్షాలను నరికించి వేశారు. ఋషికొండకు గుండు కొట్టించి ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు. ఋషికొండకు గుండు కొట్టిన కేసు న్యాయస్థానాలలో కొనసాగుతున్నప్పటికీ, యధేచ్ఛగా భవన నిర్మాణాలను కొనసాగిస్తూనే ఉన్నారు. అదేమిటని న్యాయస్థానాలను ప్రశ్నిస్తే, సుమోటోగా కేసులు నమోదు చేసే ప్రమాదం ఉంది. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ నిలిపివేయడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక జనరేటర్ తీసుకువచ్చే వాహనం ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ప్రతిపక్షాల సభలో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఐరన్ లెగ్ అంటూ తిట్టిపోసే వారు ఇప్పుడు ఏమంటారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

మన మాట ఎందుకు నమ్మాలి?
రాష్ట్ర ప్రజలు మన మాట ఎందుకు నమ్మాలని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి చేయనందుకా?, ఒకటవ తేదీ జీతాలను అడుక్కునే పరిస్థితి తీసుకు వచ్చినందుకా??, ఉద్యోగులకు టీ ఏ, డీ ఏ లు ఇవ్వనందుకా?, అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఉపాధ్యాయుల, విద్యార్థుల ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నారు. ఆల్కహాల్ లేకుండానే కేవలం కెమికల్స్ ద్వారానే మద్యాన్ని ఉత్పత్తి చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అన్ని వర్గాల ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్న మనమే నమ్మకం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణంరాజు విమర్శించారు.

సీఎం అరాచక చర్యల వల్ల రాష్ట్రానికి రాలేను
ముఖ్యమంత్రి అరాచక చర్యల వల్ల తాను రాష్ట్రానికి రాలేకపోతున్నానని రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి రాసిన లేఖలో రఘురామకృష్ణం రాజు తెలిపారు. 2021 నుంచి కేంద్రానికి రాసిన లేఖలన్నీ జతచేస్తూ, డిజిపి కి లేఖను రాసినట్లు తెలిపారు. ఏపీ సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ అవినీతి, అక్రమాలపై విచారణ నిర్వహించే అధికారి ఢిల్లీకి విచ్చేస్తే తాను అన్ని విధాలుగా సహకరిస్తాను. సునీల్ అనే అవినీతి అధికారి పుట్టుకతోనే క్రైస్తవ మతస్థుడు. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగంలో చేరాడు. ఈ విషయమై లీగల్ రైట్స్ ఫోరం ఇప్పటికే ఫిర్యాదు చేసింది. అబద్ధాన్ని జీవితంగా మార్చుకున్న సునీల్ కుమార్ ప్రభుత్వం ఇచ్చిన సెలవు గడువు కూడా ముగిసింది. త్వరలోనే విచారణ ప్రారంభమవుతుందని ఆశిస్తున్నానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.PV-Sunil-Kumar-caseవివేకాది లవ్ జిహాద్ హత్య అట..
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ది లవ్ జిహాద్ హత్యగా నిందితుడు సునీల్ యాదవ్ తరఫున నయన్ రెడ్డి అనే సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించడం విస్మయాన్ని కలిగించిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు . సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ సీబీఐ కూడా గట్టిగానే వాదనలు వినిపించింది. అలాగే డాక్టర్ వైయస్ సునీత తరపు సీనియర్ న్యాయవాది కూడా తన వాదనలు వినిపించారు. వైఎస్ వివేక హత్య వెనుక రాజకీయంగా పలుకుబడి కలిగిన పెద్దలు ఉన్నారని సిబిఐ తరపు న్యాయవాది తన వాదనలలో పేర్కొన్నారన్నారు. హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డిని విచారిస్తున్నట్లుగా తెలిపారు. వైఎస్ వివేక హత్యకు ముందు తరువాత వైయస్ భాస్కర్ రెడ్డి ఇంట్లో శివ శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ తో పాటు సహనిందితులు సమావేశమయ్యారని తెలిపారు. వీరితో వైఎస్ వివేక వెంట ఉన్నా ఎర్ర గంగిరెడ్డి ఫోన్లో మాట్లాడినట్లుగా కాల్ డేటా రికార్డులు స్పష్టంగా ఆధారాలు లభించాయని చెప్పారు. వైఎస్ వివేకా హత్య అనంతరం వైయస్ అవినాష్ రెడ్డి కొన్ని ఫోన్ నెంబర్లకు ఫోన్ చేశారని, ఆ నెంబర్లను ఎవరైతే వినియోగిస్తున్నారో వారిని కూడా పిలిచి విచారించినట్లుగా సిబిఐ న్యాయవాది, న్యాయస్థానం దృష్టికితీసుకువచ్చారు. కేసు విచారణ చివరి దశకు చేరుకుందని వెల్లడించారు. వైఎస్ వివేకాది లవ్ జిహాద్ హత్య అని చెత్త మాటలను ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇటువంటి మాటల ద్వారా ఇందులో మరింతగా కూరుకుపోతున్నారని గ్రహించాలి. ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నాడని, తనకు ఇస్తానన్న ఆస్తి ఇవ్వలేదని ఆస్తి కంటే ఎక్కువ సొమ్మును ఇచ్చి ఎవరైనా హత్య చేయిస్తారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తి వ్యక్తిత్వాన్ని పలుచన చేసే విధంగా మాట్లాడుతున్న మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మరో రెండు మూడు నెలల వ్యవధిలో వైఎస్ వివేకా హత్య ఒక కొలిక్కి వస్తుందన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE