Suryaa.co.in

National

ఏక్‌నాథ్ షిండేనే మ‌హారాష్ట్ర సీఎం!

మ‌హారాష్ట్ర నూత‌న ముఖ్య‌మంత్రిగా శివ‌సేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు బీజేపీ కీల‌క నేత‌, మ‌హారాష్ట్ర అసెంబ్లీలో విప‌క్ష నేత‌, మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ గురువారం సాయంత్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శివ‌సేన తిరుగుబాటు ఎమ్మెల్యేల‌తో శిబిరం నిర్వ‌హించిన షిండే గురువారం మ‌ధ్యాహ్నం ముంబై చేరుకున్న సంగ‌తి తెలిసిందే.

ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఫ‌డ్న‌వీస్ ఇంటికి వెళ్లిన షిండే… ఆయనతో క‌లిసి గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిశారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు త‌మ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే బ‌లం త‌మ‌కు ఉంద‌ని వారు గ‌వ‌ర్న‌ర్‌కు తెలిపారు. గ‌వ‌ర్నర్ నుంచి ఆమోదం తీసుకున్న త‌ర్వాత షిండేతో క‌లిసి ఫ‌డ్న‌వీస్ మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా అంద‌రి అంచ‌నాలను త‌ల‌కిందులు చేస్తూ ఫ‌డ్న‌వీస్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేశారు. షిండే నేతృత్వంలో శివ‌సేన ప్ర‌భుత్వం కొలువుదీర‌నుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అంతేకాకుండా తాము షిండే ప్ర‌భుత్వానికి బ‌య‌టి నుంచి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని, ప్ర‌భుత్వంలో చేర‌బోమ‌ని ప్ర‌క‌టించారు.

అంతేకాకుండా షిండే ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్టే బాధ్య‌త త‌మ‌దేన‌ని కూడా ఫ‌డ్న‌వీస్ మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వెర‌సి మ‌హారాష్ట్ర త‌దుప‌రి సీఎం ఫ‌డ్న‌వీసేన‌న్న అంద‌రి అంచనాల‌ను ఆయ‌న త‌ల‌కిందులు చేసేశారు. ఫ‌డ్న‌వీస్ ప్ర‌క‌ట‌న‌కు ముందే… షిండేను శివ‌సేన శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న‌ట్లుగా ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

LEAVE A RESPONSE