– జగన్ కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్
ఏపీ సీఎం, వైకాపా అధ్యక్షుడు జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.ఇటీవల వైకాపా ప్లీనరీలో జగన్‌ను ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చెల్లదని ఈసీ తేల్చి చెప్పింది.ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకీ శాశ్వత అధ్యక్షుడు గానీ, శాశ్వత పదవులు గానీ వర్తించవని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈ ఆదేశాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి పంపినట్టు ఈసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
వైకాపాకు శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నికైనట్టుగా వచ్చిన వార్తలు, మీడియాలో చూసిన కథనాల ఆధారంగా ఈసీ స్పందించింది. ”ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా తరచూ ఎన్నికలు జరగాలి. శాశ్వత అధ్యక్షుడు, శాశ్వత పదవులు ప్రజాస్వామ్య వ్యతిరేకం. అనేకసార్లు లేఖ రాసినా వైకాపా పట్టించుకోలేదు. వెంటనే అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలి” అని వైకాపా ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది.
”ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి శాశ్వత అధ్యక్షుడు గానీ, ఒక పదవికి శాశ్వత నియామకం జరగడం గానీ ఉండదు. ఎప్పటికప్పుడు పార్టీలకు ఎన్నికలు జరగాలి. ఎన్నికల నియమావళికి అనుగుణంగా జరగాలి. ఈసీ ఇచ్చిన నియమావళి అంగీకరించిన తర్వాతే ఈ దేశంలో పార్టీల రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా నియమించడం ఈసీ నియమ నిబంధనలకు విరుద్ధం. ఇప్పటికే పలుమార్లు వైకాపాకు ఉత్తరాలు రాసినా, సమాచారం కోరినా స్పందించలేదు. దీంతో వైకాపా శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు మీడియాలో వచ్చిన వార్తలను నిజమని భావిస్తున్నాం.. వైకాపా స్పందించకపోవడం వల్లే ఈ నిర్ణయానికి వచ్చాం. శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమైన వ్యవహారం. ఇలాంటివి చెల్లుబాటు కాదు” అని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. శాశ్వత అధ్యక్షుడిగా నియామకానికి సంబంధించి అంతర్గతంగా విచారణ జరిపి ఆ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని పార్టీ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్టు తెలిపింది.