– బాగా పనిచేసిన వారికే టికెట్లు
– సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలి
– జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టం
– దళితబంధులో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేలకు ఇదే చివరి వార్నింగ్
– సీఎం కేసీఆర్
హైదరాబాద్: షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లనున్నట్లు సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. బాగా పనిచేసిన వారికే టికెట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలని హెచ్చరించారు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టమని తెలిపారు.
ఈ మేరకు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో గురువారం పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలో వందకుపైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తందని ధీమా వ్యక్తం చేశారు.
దాహం వేసినప్పుడే బావి తవ్వుతామనే రాజకీయం నేటి కాలానికి సరిపోదని, ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా ఇద్దరు ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట జెడ్పీచైర్మన్లు, ఎంపీలు ఇంచార్జీలుగా నియమించాలని తెలిపారు. మూడు, నాలుగు నెలల్లో ఇంచార్జీల నియామక ప్రక్రియ పూర్తికావాలని చెప్పారు.
పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం అవ్వాలని సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. క్యాడర్లో అసంతృప్తి తగ్గించే చర్యలు చేపట్టాలని తెలిపారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు రావడమే మనకు ప్రధానమన్నారు. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్ను కూడా నడపవచ్చని పేర్కొన్నారు.
దళితబంధులో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గర ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేలకు ఇదే చివరి వార్నింగ్ అని గట్టిగా హెచ్చరించారు. అనుచరులు డబ్బులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యత అని అన్నారు.
తెలంగాణ భవన్లో సర్వసభ్య సమావేశంలో పార్టీ శ్రేణులనుద్దేశించి సీఎం మాట్లాడారు. రెండు పడక గదుల ఇళ్ల విషయంలోనూ ఆరోపణలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి తప్పు చేస్తే పార్టీ నుంచి తప్పిస్తామని కేసీఆర్ హెచ్చరించారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమన్న సీఎం.. నాయకులు ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకోవద్దన్నారు. ఎన్నికలే లక్ష్యంగా అందరూ పనిచేయాలని సూచించారు.