Suryaa.co.in

Telangana

వర్గీకరణ చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు

– రాజ్యాంగ సవరణ చేయమంటే 2004 నుండి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కుంటి సాకులు చెప్పి తప్పించుకుంది
– వర్గీకరణ బిల్లు పై శాసన సభలో జరిగిన చర్చ సందర్భంగా మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్ : రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 ప్రకారం ” ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు” అని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లును సంపూర్ణంగా సమర్తిస్తున్నాం. న్యాయమైన వర్గీకరణకు బీఆర్‌ఎస్ పార్టీ మొదటి నుండి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది.

మాదిగల సామాజిక ఆర్థిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడిగా కేసీఆర్ వర్గీకరణ అంశానికి మొదటి నుండి సంపూర్ణ మద్దతు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ ఉద్యమం నుండి పుట్టిన పార్టీ కాబట్టి స్వయంగా కేసీఆర్ ఒక అస్తిత్వ ఉద్యమ నాయకుడిగా వర్గీకరణ అంశంలో మందకృష్ణ మాదిగ తో పాటు అనేక ఇతర సంఘాలు,సంస్థలు, వ్యక్తులు,మేధావులు చేసిన పోరాటాన్ని, ఉద్యమాన్ని అర్థం చేసుకొని వారి కార్యాచరణకు ఎల్లప్పుడూ కేసీఆర్ అండగా నిలబడ్డారు.

మాదిగలను కేవలం ఓటు బ్యాంకు గా చూసే కొన్ని రాజకీయ పార్టీల అవకాశవాదానికి భిన్నంగా .. బీఆర్‌ఎస్ పార్టీ , కేసీఆర్ అధికారం లో ఉన్నా లేకున్నా ఉద్యమం నుండి ఈ రోజు దాకా సుమారు 25 సం౹౹లుగా ఈ వర్గీకరణ అంశంలో ఒకే స్టాండ్ తీసుకొని మద్దతు అందించారు,అందిస్తూనే ఉన్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడి, బీఆర్‌ఎస్ అధికారంలో వచ్చిన వెంటనే 29 నవంబర్ 2014 లోనే వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు మా నాయకుడు కేసీఆర్.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని స్వయంగా కలిసి తీర్మానం కాపీలను అందజేసి రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. ఆ తర్వాత మోడీ ప్రభుత్వ నాన్చివేత ధోరణి ని నిరసిస్తూ వర్గీకరణ అంశంలో వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలంటూ బీఆర్‌ఎస్ ఎంపీ లు అనేక సార్లు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తదనంతరం సుప్రీం కోర్టు కు వర్గీకరణ అంశం చేరితే సుప్రీం కోర్టులో ఉన్న వర్గీకరణ కేసులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంప్లీడ్ అయి అనుకూల వాదనలు వినిపించడం జరిగింది. చివరకు ఆగస్టు 1 ,2024 న సుప్రీం కోర్టు వారు వర్గీకరణ చేసే హక్కు రాష్ట్రాల కుంది అని తీర్పు ఇస్తే, ఆ తీర్పును బీఆర్‌ఎస్ పార్టీ వెంటనే స్వాగతించింది, సమర్థించింది.

ఇప్పుడు కూడా వర్గీకరణ కోసం ప్రభుత్వం చేసే అన్ని సానుకూల నిర్ణయాలకు బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ స్వయంగా తాను ఏర్పాటు చేసిన ఉషామెహ్రా కమిషన్ చేసిన సిఫారసుల మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, 2004 నుండి 2014 దాకా 10 సం౹౹లు యుపిఏ ప్రభుత్వం కాలయాపన చేసింది. ఎస్సీ వర్గీకరణకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయమంటే 2004 నుండి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కుంటి సాకులు చెప్పి తప్పించుకుంది.

ఆనాడు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా నిర్దిష్ట నిర్ణయం తీసుకోలేదు.10 సం౹౹లు గోడ మీద పిల్లిలాగే వ్యవహరించింది. అందుకే ఎస్సీ వర్గీకరణ కోసం ఆ కాలంలో ఉధృతంగా ఉద్యమం జరిగింది.ఆ సందర్భంలో గాంధీభవన్ ఘటన లో అసువులు బాసిన మాదిగ అమరవీరులను, బీఆర్‌ఎస్ ప్రభుత్వం గుర్తించి వారి కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సహాయం అందించింది.

2014 నుండి 2024 వరకు 10 సం౹౹లు కేంద్రంలో అధికారంలో ఉండి పార్లమెంట్ లో స్పష్టమైన మెజారిటీ ఉన్నా కూడా వర్గీకరణకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయకుండా బిజెపి ప్రభుత్వం కాలయాపన చేసింది. 10 సం౹౹ పాటు బిజెపి నాన్చివేత ధోరణి తో లక్షలాది మంది మాదిగ బిడ్డలకు దక్కాల్సిన విద్య,ఉద్యోగ అవకాశాలు దక్కకుండా పోయాయి.

ఆగస్టు 1,2024 న వచ్చిన సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో వెంటనే వర్గీకరణ చేసి మాదిగలకు విద్యా ఉద్యోగాల్లో కొత్త రిజర్వేషన్ ప్రకారం అవకాశాలు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.ఇప్పుడేమో పాత రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

ఇప్పటి నుండి రాబోయే అన్ని విద్యా,ఉద్యోగాల్లో కొత్త రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తున్నది. వర్గీకరణ పూర్తి అయితే స్థానిక సంస్థల్లో మాదిగలకు రాజకీయ అవకాశాలు పెరుగుతాయి కాబట్టి వర్గీకరణ చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. వర్గీకరణ బిల్లుకు మా నాయకుడు కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని తెలియజేస్తున్నాము.

LEAVE A RESPONSE