– వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి. ఐపీఎస్
– టీజీఎస్ ఆర్టీసీలో ఘనంగా జాతీయ భద్రతా వారోత్సవాలు
హైదరాబాద్: జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, వర్క్‌షాప్‌లు మరియు ఉత్పత్తి యూనిట్లలో భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం అన్ని యూనిట్లలో ‘భద్రతా దినోత్సవాన్ని’ నిర్వహించి, సిబ్బందికి భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ బస్ భవన్ లో టీజీఎస్ ఆర్టీసీ వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి మాట్లాడుతూ…కార్పొరేషన్లో పనిచేసే ప్రతి ఉద్యోగి, సూపర్వైజర్ ల భద్రత సంబంధిత అధికారులు తమ ప్రాథమిక బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు.
ఆర్టీసీ “కార్మికులు, ఉద్యోగుల భద్రతే మా ప్రధాన ధ్యేయమని. బస్ డిపోలు , వర్క్‌షాప్‌లలో భారీ యంత్రాలు, వెల్డింగ్ పరికరాలు, ఇంధన నిర్వహణ వంటి క్లిష్టమైన పనులు చేసేటప్పుడు కార్మికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి” అని ఆయన సూచించారు.
ప్రతి సంవత్సరం మార్చి 4న జాతీయ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటామని, ఈ ఏడాది వారం రోజుల పాటు అట్టడుగు స్థాయి వరకు అవగాహన కల్పించేలా భద్రతా వారోత్సవాలు నిర్వహించేలా అన్ని గ్యారేజీలు, జోనల్ వర్క్‌షాప్‌లు మరియు బాడీ బిల్డింగ్ యూనిట్లకు (BBU) ఆదేశాలు జారీ చేసినట్లు ఎండీ నాగిరెడ్డి తెలిపారు. సురక్షితమైన పని వాతావరణం వల్ల ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ లభించడమే కాకుండా, సంస్థ యొక్క ఖ్యాతి కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.