– జనసేన పార్టీ ఛైర్మన్, రాజకీయ వ్యవహారాల కమిటీ నాదెండ్ల మనోహర్
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి టెక్నికల్ గా మడమ తిప్పి సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వ ఉద్యోగులను నిలువునా ముంచారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేస్తామని పాదయాత్రలో హామీలు గుప్పించి, మేనిఫెస్టోలో చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పచ్చిగా మోసం చేశారు. కేవలం ఉద్యోగుల ఓట్లు, మద్దతు కోసమే అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు ‘మాకు సాంకేతికపరమైన అంశాలు తెలియక హామీ ఇచ్చాం’ అనడం జగన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతారహిత్యాన్ని వెల్లడిస్తోంది. సీపీఎస్ రద్దు హామీని నీటి మీద రాతలా మార్చడంపై సలహాదారులు సన్నాయి నొక్కులు నొక్కడం కాకుండా… ముఖ్యమంత్రే స్వయంగా సమాధానం చెప్పి తాము తప్పుడు హామీ ఇచ్చామని అంగీకరించాలి.