– ప్రభుత్వపరంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తాం
– క్రీడల కోసం ప్రపంచస్థాయి మౌలిక వసతులను కల్పిస్తాం
– విద్యాశాఖ నుంచి ఎలాంటి మద్దతు కావాలన్నా అందజేస్తాం
– విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్ లో జాతీయ క్రీడా దినోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్
– క్రీడాకారులను ఘనంగా సత్కరించిన మంత్రి
విశాఖపట్నం: ఎనర్జీ, టాలెంట్, డిటర్మినేషన్ మన ఆంధ్ర రాష్ట్ర యువకుల బ్లడ్ లోనే ఉందని, ప్రభుత్వ పరంగా క్రీడాకారులను పోత్సహిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. భారత హాకీ లెజెండ్, మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని శాప్ ఆధ్వర్యంలో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మేజర్ ధ్యాన్ చంద్, తెలుగు భాషా వికాసానికి కృషిచేసిన గిడుగు రామ్మూర్తి చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… కేబినెట్ మీటింగ్ లో స్పోర్ట్స్ గురించి చాలా చర్చించాం. ఉప ముఖ్యమంత్రి పవనన్న కూడా స్పోర్ట్స్ ను ప్రమోట్ చేయాలని, గ్రాస్ రూట్ మూమెంటమ్ క్రియేట్ చేయాలన్నారు. ఇప్పుడున్న పిల్లలు యూట్యూబ్, పబ్జీలకు అలవాటుపడ్డారు. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే గ్రాస్ రూట్ మూమెంటమ్ క్రియేట్ చేస్తేనే సమాజంలో మార్పు వస్తుందని మేమందరం చర్చించాం, నమ్మాం.
చంద్రబాబు నేతృత్వంలో ఒక గ్రాస్ రూట్ మూమెంటమ్ క్రియేట్ చేశారు. ఇది ప్రారంభం మాత్రమే. 24వేల మంది యువకులు దాదాపు పది క్రీడల్లో పాల్గొని.. జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సుమారు 462 మంది విన్నర్స్ మనముందు ఉన్నారు. మిమ్మల్నందరినీ చూస్తే నాకు ఒకటి గుర్తుకువస్తుంది. ఎనర్జీ, టాలెంట్, డిటర్మినేషన్ మన ఆంధ్ర రాష్ట్ర యువకుల బ్లడ్ లోనే ఉంది. ఈ రోజు వేదికపైన కూర్చొన్న వారిని గమనిస్తే.. ఈ స్థాయికి రావడం వెనుక చాలా త్యాగం ఉంది. హంపీ తాను ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడారు. క్రీడల్లో తమ పిల్లలను తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయని పరిస్థితి. పట్టుదల, కమిట్ మెంట్ ఉంటే రాబోయే రోజుల్లో మీరు కూడా ఈ వేదికపై కూర్చొనే అవకాశం కలుగుతుంది.
ప్రభుత్వపరంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తాం
ప్రభుత్వపరంగా క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తాం. దేశానికే కాదు.. ప్రపంచానికే ఏపీని క్రీడా రాజధానిగా మార్చాలనేది మా లక్ష్యం. మొదట విద్యావ్యవస్థలోనే మార్పు తీసుకువస్తాం. అందుకే ప్రతి శనివారం నో బ్యాగ్ డే ప్రకటించాం. లైఫ్ స్కిల్స్, స్పోర్ట్స్ ను ప్రోత్సహిస్తాం. తొలి అడుగు మాత్రమే వేశాం. అన్నీ సాధించామని చెప్పడం లేదు. చేయాల్సింది చాలా ఉంది. ఇది కేవలం ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యం కాదు. ప్రైవేటు సంస్థలు కలిసికట్టుగా రావాలి. మనం జేఎస్ డబ్ల్యూ, జీఎంఆర్ వంటి సంస్థలను చూశాం. అద్భుతంగా ఫండింగ్ చేస్తున్నారు. వాళ్లందరినీ ఒక ఫ్లాట్ ఫాం పైకి తీసుకువచ్చి పెద్ద ఎత్తున ఒక గ్రాస్ రూట్ మూమెంటమ్ క్రియేట్ చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం.
క్రీడల కోసం ప్రపంచస్థాయి మౌలిక వసతులను కల్పిస్తాం
క్రీడల కోసం ప్రపంచస్థాయి మౌలిక వసతులను కల్పిస్తాం. మిమ్మల్నందిరినీ ప్రమోట్ చేస్తాం. ఇది కేవలం మెడల్స్ కోసం మాత్రమే కాదు. ప్రజల ఆరోగ్యం కోసం కూడా. మంగళగిరిలో 45 పార్క్ లను నిర్మిస్తున్నాం. దీనివల్ల సోషల్ ఇంటిగ్రేషన్ కూడా ఏర్పడుతుంది. సింగపూర్ లో సోషల్ హార్మోనీ క్రియేట్ చేసేందుకు అందరూ కలిసికట్టుగా ప్రయత్నిస్తారు. ఇది చాలా అవసరం. అందరికీ అద్భుత అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. వేదికపై ఉన్న ప్రముఖ క్రీడాకారులకు నేను అభిమానిని. వారు సాధించిన విజయాలు, పోరాడిన తీరు చూసి చాలా గర్వపడతా. తెలుగువారు ఒకరు ఉన్నారని గర్వంగా నేను ఫీల్ అవుతా. క్రీడాకారులకు నేను వ్యక్తిగతంగా చాలా మద్దతుగా ఉంటా.
సాధించాలనే పట్టుదల, కసి ఉండాలి
మనలో పట్టుదల, కసి ఉండాలి. అప్పుడే సాధించగలగుతాం. జీవితంలో సక్సెస్ అంత సులభంగా రాదు. అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటన్నింటిని తట్టుకుని నిలబడాలి. మనల్ని అవమానించిన వారికి గుణపాఠం చెప్పాలనే కసి ఉండాలి. చంద్రబాబు, మోదీ జీవిత ప్రయాణం చూస్తే.. విజయాలు మాత్రమే కనిపిస్తాయి. దాని వెనుక అనేక వైఫల్యాలు కూడా ఉంటాయి. ఫెయిల్యూర్స్ ఎప్పుడూ వారిన ఆపలేదు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని అహర్నిశలు కష్టపడ్డారు. విద్యాశాఖ వద్దని నాకు చాలా మంది చెప్పారు. నేను కష్టమైన మార్గాన్నే ఎంచుకుంటాను. సవాళ్లను స్వీకరించాలి. జిల్లా, రాష్ట్రం, దేశం గర్వపడే విధంగా చేయాలి. కేంద్రం కూడా మద్దతుగా నిలుస్తోంది. ఇటీవల యోగంధ్ర కూడా నిర్వహించుకున్నాం.
విద్యాశాఖ నుంచి ఎలాంటి మద్దతు కావాలన్నా అందజేస్తాం
విద్యాశాఖ నుంచి ఎలాంటి మద్దతు కావాలన్నా ఇస్తాం. క్రీడల్లో బాగా రాణించాలి. ప్రభుత్వం ఏర్పాటుచేసిన పాలసీలో క్రీడాకారులు సాధించిన విజయాల పట్ల ప్రభుత్వం ఇవ్వాల్సిన నగదు బహుమతులు, రిజర్వేషన్లలో తగిన ప్రాధాన్యత కల్పించే బాధ్యత మేం తీసుకుంటాం. ఇది కేవలం మెడల్స్ గురించే కాదు.. నేను దేవాన్ష్ ను చూస్తా. మేం ఉదయం లేపకుండానే తనంతట తానే క్రమశిక్షణతో 6 గం.లకు లేచి చెస్ ఆడతారు.
ఇక్కడున్న ప్రముఖ క్రీడాకారులు తమ విలువైన సూచనలు ఇవ్వాలి. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. డయాబెటిస్ వల్ల అనేక అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడున్న వారు రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలవాలన్నారు.
అనంతరం జాతీయ క్రీడా దినోత్సవంలో పాల్గొన్న ప్రముఖ క్రీడాకారులు పి.గోపీచంద్, ఎంఎస్ కే ప్రసాద్, కోనేరు హంపీని మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించారు. వివిధ క్రీడల్లో రాణించిన సాకేత్ సాయి మైనేని, యర్రాజి జ్యోతి, ఈ.రజిని, డి.జ్యోతికశ్రీ, షేక్ జెఫ్రిన్, పి.శివారెడ్డి, శ్రీమతి సత్యగీతతో పాటు పలువురు క్రీడాకారులను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ శ్రీభరత్, మంత్రులు వంగలపూడి అనిత, డోలా బాలవీరాంజనేయ స్వామి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, ఎండీ పీఎస్ గిరీషా, ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, తదితరులు పాల్గొన్నారు
