విజయవాడ : రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ… కొత్త చేరికలతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నయా జోష్ తో దూసుకెళ్తోంది. పీసీసీ అధ్యక్షులుగా గిడుగు రుద్రరాజు బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు, పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
పార్టీ పరంగా తనకున్న సన్నిహిత సంబంధాలను ఉపయోగిస్తూ కొత్త వారితో పాటు పాత మిత్రులను, స్తబ్థంగా ఉన్న కొందరు నేతలనూ మరలా పార్టీలోకి తీసుకొచ్చేందుకు శక్తి వంచన లేకుండా క్రుషి చేస్తున్నారు. ఇది కొంత వరకు సత్ఫలితాలను ఇచ్చింది. కొందరు ముఖ్య నాయకులతో పాటు సినీ హీరో రాజా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
తాజాగా అరకు పార్లమెంట్ పరిధిలోని హుకుంపేటకు చెందిన సమ్మారెడ్డి బాలక్రిష్ణ ఆధ్వర్యంలో మజ్జి బాబురావు, రామారావు, జన్ను వెంకట్రావు, పీ.నాగులు, ఆర్మీ వైకుంఠం, అమీర్ అలీ, వబ్బు రాజులను సోమవారం ఉదయం ఆంధ్రరత్న భవన్ లో.. పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పార్టీలోకి ఆహ్వానించారు. వారికి కండువా కప్పి పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. కాంగ్రెస్ బలోపేతానికి క్రుషి చేస్తానని వారంతా పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యనిర్వహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, సేవాదళ్ ఛైర్మన్ యలమందారెడ్డి, ఓబీసీ విభాగం ఛైర్మన్ మూల వెంకట్రావుతో పాటు సీనియర్ నాయకులు ఖుర్షీదా, గౌస్, పలువురు నేతలు పాల్గొన్నారు.