– విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో మంచి గుర్తింపును తీసుకువచ్చేందుకు కృషి చేద్దాం
– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి
గుడివాడ, డిసెంబర్ 25: విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో మంచి గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ పిలుపునిచ్చారు. శనివారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని మంత్రి కొడాలి నాని క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఈ నెల 28 వ తేదీ ఉదయం 9 గంటలకు కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని కైకాల పురపాలక కళామందిరంలో గుడివాడ పట్టణం, గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లోని విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాల పంపిణీ, గుర్తింపు శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
80 శాతం పైబడి డిజేబులిటీ ఉన్నవారికి బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిళ్ళను అందజేస్తామన్నారు. డిజేబులిటీ తక్కువ ఉన్నవారికి ట్రై సైకిళ్ళను, పైకి లేవలేని వారికి వీల్ చైర్లను, చంక కర్రలను అందజేస్తామన్నారు. మానసిక వికలాంగులకు ఎంఆర్ కిట్లను పంపిణీ చేస్తారన్నారు. అలాగే అవసరమైన వారికి ఎలక్ట్రిక్ చేతి కర్రలతో పాటు బస్సు పాస్ లను కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. విభిన్న ప్రతిభావంతుల్లో అంగవైకల్యం కనబడకుండా ఉండేందుకు వారికి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందజేస్తోందన్నారు. దీనిలో భాగంగా ఆధునిక పరికరాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి ఎంతో మందుచూపుతో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని చెప్పారు. వాలంటీర్లు అందరూ వారియర్స్ గా పనిచేస్తూ ప్రజాసమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులను గుర్తించి ఉపకరణాల పంపిణీ, గుర్తింపు శిబిరానికి తీసుకువచ్చేందుకు గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని దుక్కిపాటి సూచించారు.