September 24, 2026

2030 నాటికి పేదరిక నిర్మూలన

  • 2033 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
  • 2030 నాటికి ‘జీరో పావర్టీ’
  • రాష్ట్ర అభివృద్ధి కార్యాచరణకు వేగం పెంచే దిశగా కీలక నిర్ణయాలు
  • TSDPS బలోపేతం.. ప్రత్యేక PMU ఏర్పాటు
  • జిల్లా అభివృద్ధి ప్రణాళికలు, ఏడు సెక్టోరల్ గ్రోత్ ల్యాబ్స్‌కు రూపకల్పన
  • ప్రభుత్వం–GFST భాగస్వామ్యానికి ప్రతిపాదన

హైదరాబాద్: తెలంగాణను 2030 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా, 2033 నాటికి దేశంలోనే తొలి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యాచరణకు మరింత వేగం పెంచనుంది. రాష్ట్ర దీర్ఘకాలిక ఆర్థిక, సామాజిక అభివృద్ధి లక్ష్యాలను వేగంగా సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన గురువారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఆర్థిక, ప్రణాళిక శాఖల కార్యదర్శులతో పాటు పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్‌కు చెందిన GFST వైస్ చైర్మన్ ఎస్.పీ. టక్కర్‌తో పాటు GFST ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక, అమలు వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం, శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం, అభివృద్ధి ఫలితాలను నిరంతరం పర్యవేక్షించేలా వ్యవస్థలను రూపొందించడంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం (TSDPS)ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ (PMU) ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రాధాన్యతా అభివృద్ధి కార్యక్రమాలకు వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించడం, వివిధ శాఖల మధ్య సమన్వయం, కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, పురోగతిని వేగవంతం చేయడం వంటి బాధ్యతలను PMU నిర్వహించనుంది.

2030 నాటికి తెలంగాణను ‘జీరో పావర్టీ’ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక, లక్ష్యిత కార్యక్రమాలను అమలు చేయనున్నారు. పేదరికానికి గురయ్యే కుటుంబాలను గుర్తించి, వారికి అందాల్సిన వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేయడంతో పాటు స్థిరమైన జీవనోపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నారు. పేదరిక నిర్మూలన కార్యక్రమాల ఫలితాలను కొలిచేందుకు, పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

తెలంగాణను 2033 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వేగవంతమైన, కేంద్రీకృత అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించనున్నారు. రాష్ట్రంలోని బలాలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు, సమ్మిళిత అభివృద్ధికి కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా కార్యాచరణ రూపొందించనున్నారు.

వ్యూహాత్మక ప్రణాళిక, డేటా ఆధారిత నిర్ణయాలు, సాంకేతిక పరిజ్ఞానం, నాలెడ్జ్ సపోర్ట్, సామర్థ్య నిర్మాణం, పర్యవేక్షణ, కీలక అభివృద్ధి కార్యక్రమాల వేగవంతమైన అమలుకు తెలంగాణ ప్రభుత్వం–GFST మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకునే ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిర్ణయించారు.

ప్రభుత్వ శాఖలు, రంగాల నిపుణులు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, అభివృద్ధి సంస్థలు, ఇతర కీలక భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఏడు సెక్టోరల్ గ్రోత్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ గ్రోత్ ల్యాబ్స్‌లో ప్రధానంగా పేదరిక నిర్మూలన, మౌలిక వసతులు–లాజిస్టిక్స్, ఆరోగ్యం, పర్యాటకం, పశుసంపద–ఆక్వాకల్చర్, పట్టణీకరణ, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ అంశాలపై దృష్టి సారించనున్నారు.

సమావేశంలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Total Visitors: 2,855,767