అశాస్త్రీయ పద్దతిలో రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ఎలా నామరూపాల్లేకుండా పోయిందో అశాస్త్రీయ పద్దతిలో జిల్లాల విభజన చేసిన వైసీపీ కూడా నామరూపాల్లేకుండా పోయే పరిస్థితి తెచ్చుకుందని రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు.
కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన సక్రమంగా చేయకపోవటంతో అస్తవ్యస్థ పరిస్థితి ఏర్పడిందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేయటం సరికాదన్నారు. అశాస్త్రీయ విధానాలతో కృష్ణాజిల్లా కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. జిల్లా భౌగోళిక పరిధిలోనే రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తే పద్దతిగా ఉండేదన్నారు. ఎన్నో వందల సంవత్సరాలనుండి కలిసి ఉన్న ప్రాంతాల ప్రజలు ఇప్పుడు విడిపోతుంటే అంగీకరించే పరిస్థితి ఉండేదన్నారు.
పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు పునర్విభజన చేసే సమయంలో తప్పనిసరిగా రెవిన్యూ డివిజన్లు కూడా విడదీయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అవనిగడ్డ రెవిన్యూ డివిజన్ ఏర్పాటు ఆవశ్యకత ఎప్పటి నుంచో ఉందన్నారు. న్యాయ, పోలీస్ శాఖల పరంగా కోర్టు, డీఎస్పీ కార్యాలయం అవనిగడ్డలో ఉన్న నేపథ్యంలో అవనిగడ్డలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
తరచూ ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే ప్రాంతం కాబట్టి తక్షణమే యంత్రాంగం స్పందించి సహాయ చర్యలు వేగవంతం చేసేందుకు ఈ ప్రాంతంలో ఆర్డీఓ స్థాయి అధికారి ఉంటే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ అంశంలో జిల్లా కలెక్టర్ సానుకూలంగా పరిశీలించాలని కోరారు.