తెలంగాణ అసెంబ్లీ చివరి రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే సభలో రచ్చ చోటు చేసుకుంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరమనిషి అన్నారని… స్పీకర్ కు ఆయన క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే క్షమాపణ చెప్పేందుకు ఈటల నిరాకరించారు.
దీంతో, స్పీకర్ ఛైర్ ను అగౌరవపరిచిన ఈటలను సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ అసెంబ్లీ శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి కోరారు. దీంతో, ఈటలపై స్పీకర్ సస్పెన్షన్ విధించారు. ఈ సెషన్ ముగిసేంత వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని ఆయన చెప్పారు. ఈటలను సస్పెండ్ చేయడంపై బీజేపీ సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.