-
రిషికొండ ప్యాలెస్ చిత్ర విచిత్రాలు
-
కళ్లు తిరిగే ఖరీదైన నిర్మాణాలు
-
బిత్తరపోయిన సీఎం బాబు
-
ఫొటోలపై సోషల్‌మీడియాలో ఘాటైన కామెంట్లు
-
ఫొటో కామెంట్లతో సోషల్‌మీడియాలో హల్చల్
-
పేద జగన్ కట్టించిన పేదిల్లు అంటూ వ్యంగ్యాస్త్రాలు
-
జగన్ టేస్ట్‌పై పేలుతున్న సెటైర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
అది భూలోకంలో కట్టిన నయా ఇంద్ర భవనం. చక్రవర్తులు, రాజులు, బిలియనీర్లకు మాత్రమే సాధ్యమయ్యే నిర్మాణాలు. బాత్రూములు కూడా బంగారునగిషీ చెక్కినవే. ప్రపంచ ‘కోటీశ్వ’రరావులు మాత్రమే, ముచ్చటపడి నిర్మించుకునే ప్యాలెస్. అయితే ఇక్కడే చిన్న తేడా. వారంతా వారి వారి కష్టార్జితంతో నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్య ఆదాయంతో కట్టుకున్న మహళ్లు.
కానీ ఐదేళ్లు ఏపీని పాలించిన జగన్ మాత్రం, జనం సొమ్ముతో.. పుణ్యానికి వచ్చిన పైసలతో విశాఖ రిషికొండను బోడిగుండు చేసి, నిర్మించిన రాజమహల్‌ను చూసి సీఎం చంద్రబాబు బిత్తరపోయారు. ‘ఓరి వీడి దుంపతెగ. ఏమి టేస్టురా సామీ’ అని వాటిని చూస్తున్నంత సేపూ నోరెళ్లబెట్టారు. ఒక గదిని మించి మరో గది. ఒక హాలును మించి మరో హాలు నిర్మాణం. చివరాఖరకు బాత్రూములు కూడా బంగారునగిషీతో ఉన్నవే కావడంతో బాబు ఖంగుతిన్నారు.
గోల్డు స్పూనుతో పుట్టిన ధనవంతులకే రాని ఆలోచనలు, ‘పేదలపెన్నిధి జగన్’కు వచ్చిన తీరుపై, అధికారులు కూడా హాశ్చర్యపోయారు. సీఎం అయిన నాలుగు నెలల తర్వాత తొలిసారి విశాఖకు వెళ్లిన చంద్రబాబు.. మాజీ సీఎం జగన్ ముచ్చటపడి అక్కడ నిర్మించుకున్న రిషికొండ ప్యాలెస్‌లో అడుగుపెట్టి, ప్యాలెస్‌ను ఆసాంతం పరిశీలించారు. ఆయన పరిశీలన గంటసేపు పైన పట్టిందంటే.. రిషికొండపై జగన్ సారు ఎన్ని గదులు నిర్మించి ఉంటారు? అవి ఎంత ఖరీదుగా ఉంటే చూపరులు వాటిని గంటలపాటు అలా చూస్తుండిపోతారు?
ఇక చంద్రబాబు పరిశీలిస్తున్న రిషికొండ ప్యాలెస్ చిత్రాలు బయటకు రావడం.. సోషల్‌మీడియాలో దానిపై సెటైర్ల వర్షం, సెంటీమీటర్ల రేంజిలో కురవడం చకచకా జరిగిపోయింది. ఒక్కో ఫొటోకు ఒక్కో చిత్రమైన కామెంట్‌తో సోషల్‌మీడియా సైనికులు రచ్చ రచ్చ చేస్తున్నారు.
‘ఎవరబ్బ సొమ్ము రాజా’.. ‘పేదలకు పునరావాసం కోసం పేద జగన్ నిర్మించిన పేదిలు’్ల.. ‘తన ఆస్తులు అమ్మి పేదలకు జగనన్న నిర్మించిన రాజమహల్’.. ‘పేదలకు జగనన్న నిర్మించిన ఆ చిన్న భవనం చూసి అంత ఏడుపెందుకు రాజా’? ‘పేదల కోసం పేద జగనన్న కట్టించిన పేద భవనం’.. అంటూ, నెటిజన్లు పిచ్చ పిచ్చగా కామెంట్లు పెడుతున్నారు.