– విలేఖర్ల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా
హైదరాబాద్: మేడిపండు చూడు మేలిమై ఉండును… పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అన్నట్టు రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏం లేదని రుజువయింది. ఆయన తీరు ఎట్లా ఉందంటే అన్నీ వదిలేసి నడి బజార్లో నిలబడ్డట్టుంది. నిండా మునిగినోనికి నాకేముంది అన్నట్టు అబద్ధాలు, అసత్యాల ప్రవాహంలో మునిగిపోయారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం తెలంగాణ భవన్ లో విలేఖర్లతో మాట్లాడారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే… రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటాయి. గోబల్స్ ని మించిపోయిండు రేవంత్ రెడ్డి. ఎల్లంపల్లి ప్రాజెక్టును మేమే కట్టామని అంటాడు. రేవంత్ కత్తెర జేబులో పెట్టుకోని తిరుగుతున్నాడు.
ఏడ రిబ్బన్ కనిపిస్తే అక్కడ కత్తిరిస్తున్నాడు. నిన్న రేవంత్ రెడ్డి ప్రారంభించిన ట్యాంకులు కేసీఆర్ హయాంలో ప్రారంభించినవి. ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టామంటున్నారు.
మీలాగా చిన్నగా ఆలోచించి పేర్లు మార్చాలని అనుకోలేదు. నీలాగా దిక్కుమాలిన దివాలా కోరు రాజకీయాలకు కేసిఆర్ పాల్పడలేదు. టిఆర్ఎస్ వచ్చిన తర్వాత నీటిపారుదుల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను. ఎల్లంపల్లి ప్రాజెక్టు హై లెవెల్ బ్రిడ్జి పూర్తి కాలేదు. ఆర్అండ్ఆర్ పూర్తి కాలేదు. ల్యాండ్ అక్విజేషన్ పూర్తి కాలేదు. గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు. టిఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టును 2052 కోట్లతో పూర్తి చేసి 2016లో పూర్తిస్థాయిలో 20 టీఎంసీల నీళ్లు నింపాం. మేం నీలాగా చిల్లర రాజకీయాలకు పోలేదు..
నిన్న నువ్వు చేసిన శంకుస్థాపన కూడా మేం నిర్మించిన కాళేశ్వరం నీళ్లనే తీసుకెళ్తున్నావ్. ఎల్లంపల్లి కెపాసిటీ 20 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ మూడు టీఎంసీలు. మిగిలిన 17 టీఎంసీల్లో సొంత ఆయకట్టు 1,65,000 ఎకరాలు అంటే 12 టిఎంసిలు పోతాయి. ఎన్టిపిసి విద్యుత్ ఉత్పత్తికి ఆరున్నర టీఎంసీలు. మంచిర్యాల నియోజకవర్గంలో గూడెం లిఫ్ట్‌కు మూడు టీఎంసీలు. లోకల్లో రామగుండం లిఫ్ట్ కు ఒక టిఎంసి వాడుకుంటాం.. దానికి సామర్ధ్యం కంటే ఎక్కువ వాడుతున్నాం ఇప్పటికీ. ఎల్లంపల్లి కెపాసిటీకి మించి మరో 20 టీఎంసీలు హైదరాబాద్ కి ఎలా తెస్తావు రేవంత్ రెడ్డి?