ఎంపి విజయసాయిరెడ్డి
మరో పది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యంలో ఎలాంటి గందరగోళం లేదు. ముఖ్యంగా పాలకపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కిందటి రెండు సాధారణ ఎన్నికల్లో మాదిరిగానే ఒంటరిగానే ముందుకెళుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గుండె నిండా ఉన్న ఆత్మవిశ్వాసం పాలక పార్టీగా అవతరించాక వైఎస్సార్సీపీలో రెట్టింపయింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలోగాని, ఆయన పార్టీలోగాని వచ్చే ఎన్నికలపై ఎలాంటి అస్పష్టత లేదా గందరగోళం ఏమాత్రం కనిపించవు. అయోమయం, ఎటూ తేల్చుకోలేని పరిస్థితులు–ఇవన్నీ తెలుగుదేశం, ఇతర ప్రతిపక్షాల్లోనే దర్శనమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగే 16వ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి, ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని మరో రెండు పార్టీలకు మధ్య ఎన్నికల పొత్తు గురించి దాదాపు ఏడాది నుంచి మీడియాలో ఊహాగానాలు, చర్చలు నడుస్తూనే ఉన్నాయి.
ఈ విషయంలో ఏదీ తేలకుండా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే, ప్రతిపక్షాల ఎత్తులు, జిత్తులు ఏమాత్రం పట్టించుకోకుండా పాలకపక్షమైన వైఎస్సార్సీపీ పూర్తిగా పాలనపైన, ప్రజా సంక్షేమంపైనే గత నాలుగేళ్లుగా దృష్టి కేంద్రీకరించింది. ఫలితంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ వరుసగా రెండు ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించనట్టుగానే నవ్యాంధ్ర ప్రదేశ్ లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ వరుస విజయాలతో అధికారం కైవసం చేసుకుంటుందనే మాట సర్వత్రా వినిపిస్తోంది.
మీడియా, ఎన్నికల నిపుణులు, రాజకీయ పండితులు సైతం ఏపీ పాలకపక్షానికి దాని సంక్షేమ కార్యక్రమాల వల్ల తిరుగులేని ప్రజాదరణ ఉందని, జనం తీర్పు మరో రెండు దశాబ్దాల వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పక్షానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఆసరాగా ఉన్న పాలకపక్షానికే తెలుగు జనం పట్టం
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి అత్యధిక తెలుగు ప్రజానీకానికి సుపరిపాలన అందించడం, తాము రూపొందించి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడం మినహా మరో ధ్యాస లేదనేది రాజకీయ చైతన్యం ఉన్న ఎవరిని అడిగినా చెబుతారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన 2023–2014 వార్షిక బడ్జెట్లో ప్రత్యక్ష ప్రయోజన (నగదు) బదిలీ పథకాలకు రూ.54,000 కోట్లకు పైగా సొమ్ము కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం.
మొత్తం బడ్జెట్ వ్యయంలో (రూ.2.79 లక్షల కోట్లు) ఇది దాదాపు 20 శాతం. జన సంక్షేమ నగదు బదిలీ పథకాలకు ఇంత మొత్తంలో నిధులు కేటాయించిన రాష్ట్రం దక్షిణాదిన ఏపీ ఒక్కటే అంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, ఇంకా ఆంధ్రాను అప్పుల ఊబిలోకి ప్రభుత్వం నెట్టేస్తుందని ప్రతిపక్షాలు అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నా జగన్ గారి ప్రభుత్వ పట్టించుకోవడం లేదు. సత్యనిష్ఠతో, అకుంఠిత దీక్షతో ఈ ప్రజా సంక్షేమ పథకాలను (నగదు బదిలీ ప్రక్రియతో) ప్రభుత్వం కొనసాగిస్తోంది.
ప్రజా శ్రేయస్సే సర్వస్వమని భావించే సర్కారుకు అవసరమైన సొమ్ము సకాలంలో అందుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రుజువైంది. అలాగే, అసంతృప్తితో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రగిలిపోతున్నారనే దుష్ప్రచారం మధ్య వారికి తన శాయశక్తులా సర్కారు ఆసరాగా నిలుస్తోంది. కొత్త ప్రయోజనాలు వారికి అందేలా చూస్తోంది. ఇటీవల వారి కోసం ప్రభుత్వం ప్రకటించిన కొత్త పెన్షన్ స్కీము కూడా ఉద్యోగులకు నచ్చే విధంగా ఉంది. ఇన్ని సానుకూలాంశాలతో 2024 వేసవిలో జరిగే పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరుపై నడక మాదిరి ఉంటుందన్న రాజకీయ పండితుల అంచనాలు నిజం కాబోతున్నాయి.