శ్రీనగర్: అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు జమ్ముకశ్మీర్‌లోని కాజిగుండ్ ప్రాంతంలో గురువారం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో 15 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 45 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కాజీగుండ్‌లోని బద్రాగుండ్ క్రాసింగ్ వద్ద టిప్పర్ డంపర్ ఢీకోట్టినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికు ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు.
కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. ఆ వరదల్లో సుమారు 16 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. వర్షాలు తగ్గిన క్రమంలో యాత్రను పునరుద్ధరించారు అధికారులు. తిరిగి ప్రారంభమైన మూడో రోజే ఈ ఘోర ప్రమాదం సంభవించింది. అమరనాథ్ యాత్రకు భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి గురువారం 5వేల మంది యాత్రికులు బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. ‘నున్వాన్-పహల్గామ్, బాల్టాల్ బేస్ క్యాంపుల నుంచి 201 వాహనాల్లో మొత్తం 5,449 మంది యాత్రికులు బయలుదేరారు. ’ అని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఓ బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు.