– ఆర్.పి. సిసోడియా
విజయవాడ: “లేపాక్షి హస్తకళా రూపకల్పన పోటీలు భారతీయ జీవన వారసత్వానికి ప్రతిబింబం. మన కళాకారుల అసాధారణ ప్రతిభను ప్రదర్శించడమే కాకుండా, వారికి గుర్తింపు, మార్కెట్లు, ఆర్థిక సాధికారతకు కొత్త మార్గాలను అందిస్తాయి,” అని హస్తకళలు, జౌళి శాఖ (పరిశ్రమలు, వాణిజ్యం) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా అన్నారు. విజయవాడ మొగల్ రాజపురం అమ్మ కల్యాణ మండపంలో జరుగుతున్న హస్త కళల ఉత్సవాన్ని బుధ వారం సందర్శించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడారు.
ఈ తరహా వేదికలు భారతీయ హస్తకళల అందం, వైవిధ్యాన్ని మాత్రమే కాకుండా కళాకారులను వినియోగదారులు, రూపకర్తలు, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేస్తున్నాయని వివరించారు. “ప్రతి చేతిపని మన సంస్కృతి, సంప్రదాయం, సహనానికి ప్రతీక. ఈ కళలను రాబోయే తరాలకు కాపాడటం, ప్రోత్సహించడం మన అందరి బాధ్యత” అని సిసోడియా పేర్కొన్నారు.
లేపాక్షి హస్తకళా రూపకల్పన పోటీ ప్రదర్శన ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నదన్నారు. కొండపల్లి బొమ్మలు, ఎటికొప్పాక బొమ్మలు, చెక్కచిత్తరువులు, తోలుబొమ్మలు, కలంకారి ముద్రణ వంటి ఐదు ప్రధాన కళల్లో పోటీ నిర్వహించామని, బంగారు, వెండి, కాంస్య పతకాలు, రెండు లక్షల యాభై వేల రూపాయల నగదు బహుమతులు అందిస్తున్నామన్నారు. బహుమతి ప్రదాన కార్యక్రమం సెప్టెంబర్ 12వ తేదీ శుక్రవారం జరగనుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ మనోహరన్ మాట్లాడుతూ, ఈ ప్రదర్శన కళాకారులను సమాజంతో అనుసంధానం చేయడంలో, సంప్రదాయ నైపుణ్యాలను కాపాడడంలో సహాయపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కళల వారసత్వం లో ఈ కార్యక్రమం మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా నుంచి దాదాపు నలభైమంది శిల్పులు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారన్నారు.
ప్రదర్శనలో చెక్కచిత్తరువులు, క్రోషే లేస్, తంజావూరు చిత్రాలు, తోలుబొమ్మలు, దుర్రీలు, రగ్గులు, అనుకరణ ఆభరణాలు వంటి ఎన్నో కళాఖండాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రదర్శన, అమ్మకం 14 వ తేదీ వరకు కొనసాగనుందన్నారు.